కూతురి శవంతో.. 6 కిలోమీటర్ల నడక!
సుమారు వారం రోజుల క్రితం ఒడిషాలో ఓ వ్యక్తి తన భార్య మృతదేహాన్ని భుజాన వేసుకుని కూతురితో పాటు పది కిలోమీటర్ల దూరం నడిచి వెళ్లాల్సి వచ్చింది. ఈ ఘటన దేశవ్యాప్తంగా కలకలం రేపింది. దాని వేడి చల్లారేలోపే మరో వివాదం అదే రాష్ట్రంలో చోటుచేసుకుంది. మల్కన్‌గిరి జిల్లాలో ఓ వ్యక్తి తన ఏడేళ్ల కూతురి శవాన్ని భుజాన వేసుకుని 6 కిలోమీటర్లు నడుచుకుంటూ వెళ్లాల్సి వచ్చింది. ఆ చిన్నారిని అంబులెన్సులో మల్కన్‌గిరి జిల్లా ఆస్పత్రికి తీసుకెళ్తుండగా.. దారి మధ్యలోనే ఆమె చనిపోయినట్లు తెలియడంతో అంబులెన్సు వాళ్లు దారిలోనే వాళ్లను దించేశారు.
ఏడేళ్ల బర్షా ఖేముదు ఆరోగ్యం విషమించడంతో అప్పటివరకు ఆమె చికిత్స పొందుతున్న మిథాలి ఆస్పత్రి నుంచి జిల్లా కేంద్రంలో ఉన్న ఆస్పత్రికి తీసుకెళ్లాలని వైద్యులు చెప్పారు. అంబులెన్సులో ఆమెను తీసుకెళ్తుండగా.. దారిలోనే ఆమె ప్రాణాలు కోల్పోయింది. ఆ విషయం తెలిసిన అంబులెన్సు డ్రైవర్ వెంటనే తమను దించేశాడని బాలిక తండ్రి దీనబంధు ఖేముదు చెప్పారు. భార్యాభర్తలిద్దరూ కూతురి శవాన్ని మోసుకుంటూ సమీపంలోని గ్రామానికి వెళ్లడంతో ఏమైందని అక్కడి గ్రామస్తులు అడిగారు. అప్పుడు అసలు విషయం వెలుగులోకి వచ్చింది. మరో వాహనంలో ఆ కుటుంబాన్ని వారి గ్రామంలో వదిలిపెట్టాలని వారు బీడీఓను, వైద్యాధికారులను కోరారు.
ఆనోటా ఈనోటా విషయం జిల్లా కలెక్టర్ కె. సుదర్శన్ చక్రవర్తి దృష్టికి వెళ్లింది. వెంటనే దీనిపై విచారణ జరపాల్సిందిగా చీఫ్ డిస్ట్రిక్ట్ మెడికల్ ఆఫీసర్ ఉదయ్ శంకర్ మిశ్రాను ఆదేశించారు. అంబులెన్సు డ్రైవర్, ఫార్మాసిస్ట్, వాహనంలో ఉన్న మరో అటెండెంటుపై మల్కన్‌గిరి పోలీసు స్టేషన్‌లో కేసు పెట్టారు. డ్రైవర్ చేసినది పూర్తిగా చట్ట విరుద్ధమని, నేరపూరిత నిర్లక్ష్యమని కలెక్టర్ చక్రవర్తి అన్నారు. అతడితో పాటు బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. బాలిక తల్లిదండ్రులకు అవసరమైన ఆర్థిక సాయాన్ని జిల్లా యంత్రాంగం కల్పించిందని ఆయన చెప్పారు.