సాక్షి, భువనేశ్వర్: ఏడాది కాలం నుంచి వేధిస్తున్నా తనకు లొంగడం లేదని ఓ ఉన్మాది అమాయకురాలిపై యాసిడ్ దాడికి పాల్పడ్డాడు. ఈ దాడిలో తీవ్ర కాలిన గాయాలైన యువతి ఓ ప్రైవేట్ ఆస్ప్రతిలో చికిత్స పొందుతోంది. పోలీసుల కథనం ప్రకారం.. పరశురామ్ మఝీ (35) కలహండి జిల్లాలోని కలాంపూర్ బ్లాక్‌లో నివాసం ఉంటున్నాడు. గతేడాది నుంచి ఓ యువతి(22) ను ప్రేమ పేరుతో వేధిస్తున్నాడు. ఈ క్రమంలో కొన్ని రోజుల కిందట తనతో శారీరక సంబంధం పెట్టుకోవాలని ఎప్పటిలాగే యువతిపై బెదిరింపులకు దిగాడు. పోలీసులకు ఫిర్యాదు చేస్తానని హెచ్చరించడంతో నీ సంగతి తర్వాత చెప్తానంటూ పరశురామ్ అక్కడినుంచి వెళ్లిపోయాడు.
ఈ క్రమంలో సోమవారం కంప్యూటర్ క్లాస్ నుంచి ఇంటికి తిరిగి వస్తున్న యువతిని బంకపల్లా సర్కిల్ వద్ద ఆ ఉన్మాది అడ్డగించాడు. తనతో శారీరక సంబంధానికి నిరాకరించడంతో ఆవేశానికి లోనైన నిందితుడు తన వెంట తెచ్చుకున్న యాసిడ్‌ను బాధితురాలి ముఖంపై పోసి దాడికి పాల్పడ్డాడు. బాధిత యువతి కేకలు వేయడంతో నిందితుడు అక్కడినుంచి పరారయ్యాడు. ముఖం, చేతిపై తీవ్ర కాలిన గాయాలైన యువతిని భవానిపట్నా హాస్పిటల్‌కు తరలించి చికిత్స అందిస్తున్నట్లు పోలీసులు మంగళవారం తెలిపారు.
జాబ్ కోసం హైదరాబాద్ వెళ్తున్నట్లు చెప్పి అందర్నీ నమ్మించి రెండు రోజుల కిందట ఇంటి నుంచి వెళ్లిపోయిన పరశురామ్ మఝీ ఇంత దారుణానికి పాల్పడ్డాడని విచారణలో తేలినట్లు చెప్పారు. కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. భారత్‌లో ఏడాదికేడాది యాసిడ్ దాడులు పెరిగిపోతున్నాయి. 2011లో 80గా నమోదైన యాసిడ్ దాడులు, 2016లో 307కు పెరగడం పోలీసులను ఆందోళనకు గురిచేస్తుంది.
Comments
Please login to add a commentAdd a comment