విశాఖలో కారు బీభత్సం | Woman Injured In Car Accident In Visakhapatnam | Sakshi
Sakshi News home page

విశాఖలో కారు బీభత్సం

Sep 17 2019 8:32 AM | Updated on Sep 17 2019 8:32 AM

Woman Injured In Car Accident In Visakhapatnam - Sakshi

విద్యుత్‌ స్తంభాన్ని ఢీకొని ఆగిపోయిన కారు.. రోడ్డు మధ్యలో వేలాడుతున్న హైటెన్షన్‌ వైర్లు

డాబాగార్డెన్స్‌(విశాఖ దక్షిణ): పూర్ణామార్కెట్‌లో సోమవారం ఓ కారు బీభత్సం సృష్టించింది. బ్రేకులు ఫెయిలై వేగంగా దూసుకెళ్తూ ఓ మహిళతో పాటు విద్యుత్‌ స్తంభాన్ని సైతం బలంగా ఢీకొని ఆగిపోయింది. దీంతో ఆ స్తంభం కారుపై ఒరిగిపోయింది. కారుపై విద్యుత్‌ తీగలు పడి ఉంటే పెను ప్రమాదం సంభవించి ఉండేది. అలాగే జనం కూడా ఆ సమయంలో తక్కువగా ఉండడంతో ఎటువంటి ప్రాణనష్టం జరగలేదు. ప్రత్యక్ష సాక్షులు, పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి.

బీఎస్‌ఎన్‌ఎల్‌కు చెందిన ఏపీ 09 బీఎన్‌ 1410 గల అంబాసిడర్‌ కారు డాబాగార్డెన్స్‌లోని సంస్థ కార్యాలయం నుంచి జగదాంబ జంక్షన్, పూర్ణామార్కెట్‌ మీదుగా వెలంపేటలోని బీఎస్‌ఎన్‌ఎల్‌ కార్యాలయానికి బయలుదేరింది. సాయంత్రం 5 గంటల ప్రాంతంలో జగదాంబ జంక్షన్‌ దాటి పూర్ణామార్కెట్‌ దగ్గరికి వచ్చేసరికి ఆ కారుకు బ్రేకులు ఫెయిలయ్యాయి. వేగంగా దూసుకొస్తూ సాలిపేటకు చెందిన కేజీహెచ్‌ ఎస్‌–3 వార్డులో స్వీపర్‌(కాంట్రాక్ట్‌ వర్కర్‌)గా పని చేస్తున్న బండారు అప్పలనరసమ్మ(50)ను ఢీకొట్టింది. ఈ ఘటనలో ఆమెకు తీవ్ర గాయాలయ్యాయి. అనంతరం కారు రోడ్డుకు కుడివైపున ఉన్న విద్యుత్‌ స్తంభాన్ని బలంగా ఢీకొట్టింది. దీంతో విద్యుత్‌ స్తంభం ఆ కారుపై పడిపోయింది. హైటెన్షన్‌ వైర్లు తెగిపడి రోడ్డుపై పడ్డాయి. విద్యుత్‌ శాఖ సిబ్బంది ఘటన జరిగిన 15 నిమిషాలు తరువాత వచ్చి సరఫరాను నిలిపివేశారు. అంతవరకు పోలీసులు ఘటన స్థలం వద్ద భదత్ర చర్యలు చేపట్టారు. గాయపడిన అప్పలనరసమ్మను చికిత్స కోసం పోలీసులు వెంటనే కేజీహెచ్‌కు తరలించారు. కారు డ్రైవర్‌కు స్వల్ప గాయాలయ్యాయి. అప్పటి వరకూ రద్దీగా ఉన్న పూర్ణామార్కెట్‌ జంక్షన్‌ అప్పుడే ఒక్కసారిగా ఖాళీగా కనిపించింది. లేదంటే కారు బీభత్సానికి ఎంత మంది బలయ్యేవారోనని స్థానికులు చర్చించుకున్నారు.

 బ్యాలెట్‌ బాక్సుల కోసం వెళ్తున్న కారు..
బీఎస్‌ఎన్‌ఎల్‌ గ్రూప్‌–సీ, డీ ఉద్యోగుల ఎన్నికలు సోమవారం జరిగాయి. డాబాగార్డెన్స్‌లోని జనరల్‌ మేనేజర్‌ కార్యాలయంతో పాటు వెలంపేటలోని బీఎస్‌ఎన్‌ఎల్‌ కార్యాలయంలో కూడా ఎన్నికలు నిర్వహించారు. ఉదయం నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్‌ జరిగింది. పోలింగ్‌ అనంతరం వెలంపేట బీఎస్‌ఎన్‌ఎల్‌ కార్యాలయంలో జరిగిన ఎన్నికల బ్యాలెట్‌ బాక్సులు తీసుకొచ్చేందుకు డాబాగార్డెన్స్‌ జనరల్‌ మేనేజర్‌ కార్యాలయం నుంచి అంబాసిడర్‌ కారు బయలుదేరి వెళ్లింది. ఆ కారులో పలువురు బీఎస్‌ఎన్‌ఎల్‌ అధికారులు కూడా ఉన్నారు. పూర్ణామార్కెట్‌ వద్దకు వచ్చేసరికి కారుకు బ్రేకులు ఫెయిల్‌ కావడంతో ఈ ప్రమాదం సంభవించింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement