భువనేశ్వర్ : ప్రపంచాన్ని కరోనా కాటేస్తున్న నేపథ్యంలో వ్యక్తిగత శుభ్రత, భౌతిక దూరం పాటించడం ఎంత ముఖ్యమో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. వీటికి తోడు మహమ్మారి దరిచేరకుండా ఉండేందుకు మాస్కులు, శానిటైజర్ల వాడకం కూడా అంతే ముఖ్యం. అయితే కొంత మంది వీటిపై నిర్లక్ష్యం వహిస్తున్నారు. ప్రభుత్వాలు, అధికారులు ఎన్ని విధాలుగా చెప్పినా నిబంధనలను బేఖాతరు చేస్తున్నారు. ఈక్రమంలో ఒడిశాకు చెందిన ఓ వ్యక్తి.. కరోనా ముందు జాగ్రత్తలను వివరిస్తున్నాడు. ఇందుకు వినూత్న వేషం ధరించి మాస్కులు, శానిటైజర్లను ప్రజలకు అందజేస్తున్నాడు. (కరోనా.. కొడుకు గురించి విజయ్ ఆందోళన! )
అతని పేరు సాయిరామ్. అచ్చం మహాత్మా గాంధీలా.. సిల్వర్ రంగు పెయింట్ వేసుకుని భువనేశ్వర్‌లోని మురికి వాడల్లో మాస్కులు, శానిటైజర్లు పంపిణీ చేస్తున్నాడు. దీనికి తోడు గత వారం రోజులుగా చేతిలో జాతీయ జెండా పట్టుకుని కాలినడకన నడుస్తూ, ప్రతి ఇంటింటికి వెళ్లి కరోనాపై అవగాహన కల్పిస్తున్నాడు. ఇలా ఇప్పటి వరకు 150 కిలోమీటర్ల మేర నడిచాడు. (లాక్‌డౌన్.. విమాన, రైల్వే సర్వీసులపై క్లారిటీ)
ఈ విషయంపై సాయిరామ్ మాట్లాడుతూ.. ‘ప్రజలు నన్ను సిల్వర్ గాంధీ అని పిలుస్తారు. కరోనా గురించి అవగాహన కల్పించడానికి కాలినడకన నడవడం ప్రారంభించాను. ఈ ప్రయాణం కోసం నా దగ్గర ఉన్న డబ్బులతో కొన్ని మాస్కులు, శానిటైజర్లను కొనుగోలు చేసి ప్రజలకు ఉచితంగా పంపిణీ చేస్తున్నాను. ప్రస్తుతం మురికివాడ ప్రాంతాలకు వెళ్లి కూడా కరోనా వైరస్‌ను అరికట్టడానికి, కరోనాకు వ్యతిరేకంగా జరిగే యుద్ధంలో విజయం సాధించాలని వివరిస్తున్నాను. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అందజేసే మార్గదర్శకాలను పాటించాలని ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాను’. అంటూ సాయి రామ్ తన ఆలోచన వెనక ఉన్న ఉద్దేశ్యాన్ని వెల్లడించాడు. (లాక్‌డౌన్: ఒడిశా కీలక నిర్ణయం)
Comments
Please login to add a commentAdd a comment