
‘నా వయసు 38. నేనూ నా భర్తా పిల్లల్ని వద్దనుకున్నాం. రెండు కుక్క పిల్లలను పెంచుకుంటున్నాం. అసలు పిల్లల్ని ఎప్పుడూ కనాలనిపించలేదు నాకు. ఒకవేళ తల్లిని కావాలని అనిపిస్తే దత్తత గురించి ఆలోచిస్తాను. అయినా ప్రతి ఒక్కరూ బిడ్డల్ని కనాలనేమీ లేదు. పిల్లల పెంపకానికి భారీగా పెట్టుబడి పెట్టాలి. అంకితభావంతో పెంచాలి. పైగా, జీవితంలో చాలాసార్లు రాజీ పడాలి. నిబద్ధతతో వ్యవహరించాలి’అంటున్నారు రీమ్ కొకర్. రీమ్ ఓ యాంటీ నేటలిస్ట్. ఢిల్లీలోని అమెరికన్ ఎంబసీలో పనిచేస్తున్నారు. ఆమె గాయని కూడా. పిల్లలు లేకున్నా తాము అనేక మార్గాలో జీవితాన్ని çసఫలం చేసుకుంటున్నామని చెప్పారు. ‘ఒత్తిడితో కూడిన ఈ ప్రపంచ సమస్యల్ని పిల్లలు ఎదుర్కోక తప్పదు. వాళ్ల భద్రతకు నేను గ్యారెంటీ ఇవ్వలేను’అని ఆమె అభిప్రాయపడ్డారు.
యాంటీ నేటలిజం..
యాంటీ నేటలిజం అనేది ఒక ఆలోచనా విధానం. ఇప్పటికే ఒత్తిడితో సతమతమవుతున్న ప్రపంచంలోకి కొత్తగా ఇంకొంత మంది పిల్లల్ని తీసుకురావడాన్ని క్రూరమైన విషయంగా ఈ యాంటీ నేటలిస్టులు భావిస్తుంటారు. బిడ్డల్ని కనకపోవడం ద్వారా జనాభా పెరుగుదలను కాస్త నెమ్మదింపచేయడం.. ఒకరినో, పెద్ద కుటుంబం కావాలంటే అంతకంటే ఎక్కువ మందినో దత్తత తీసుకోవడం మంచిదని భావిస్తుంటారు. మన దేశంలో కూడా ఈ యాంటీ నేటలిస్టుల సంఖ్య క్రమేపీ పెరుగుతోంది.
ఎవెంజర్స్‌లో..
2018లో విడుదలైన ‘ఎవెంజర్స్ : ఇన్ఫినిటీ వార్’సినిమా కథలో యాంటీ నేటలిజం ఛాయలు కనిపిస్తాయి. ఇందులో ప్రపంచాన్ని తన అదుపులో పెట్టుకోవాలని చూసే విలన్ థానోస్.. సగం విశ్వం కోసం మరో సగాన్ని విధ్వంసం చేయాలనుకుంటాడు. పేదరికానికి, అధిక జనాభాకి మధ్య ప్రత్యక్ష సంబంధముందని భావిస్తాడు. ‘ది పాపులేషన్ బాంబ్’(1968) రచయిత పాల్ ఎర్లిచ్.. జనాభా పెరుగుదల పరిమిత వనరులపై ఒత్తిడి పెంచగలదన్నారు. ఆర్థికవేత్త జులియన్ సిమన్‌ఇలాంటి వాదనలను తోసిపుచ్చారు. ‘మిత వనరుల’చుట్టూ తిరిగిన వాదనలను తోసిపుచ్చి, మానవ వనరులకు పట్టం గట్టారు. మానవ సంపదే అంతిమ వనరుగా పేర్కొన్నారు.
అధిక జనాభా.. అతి పెద్ద సమస్య
వాతావరణ మార్పుల వల్లనో, లేదంటే నేరాలు, హింస వల్లనో, కాలుష్యం వల్లనో సంక్షోభంలో చిక్కుకున్న ఈ ప్రపంచంలోకి ఒక బిడ్డను తీసుకురావడం బాధ్యతరహితమే అవుతుందంటారు రచయిత కరెన్ డి సౌజా. మ్యాగజీన్ ఎడిటర్ వర్దన్ కొండ్వికర్‌ది కూడా ఇదే తరహా అభిప్రాయం. ఈయన ప్రకారం అధిక జనాభాయే ఈ భూమిపై అతి పెద్ద సమస్య. మిగిలినవన్నీ దీని నుంచి పుట్టుకొచ్చినవే. ప్రేమ కోసం పరితపించే పిల్లలు ఎందరో ఉన్న ఈ ప్రపంచంలోకి సొంత బిడ్డను తీసుకురావాలనుకోవడం లేదంటారు కొండ్వీకర్.
ఇష్టాలకు అనుగుణంగా జీవించే అవకాశం లేని చోట.. సమాజం కోరినట్టు జీవించని వారిపై ఒత్తిడి తీసుకొచ్చే చోట.. బిడ్డల్ని కనకపోవడమే ఉత్తమమంటారు డెవలప్‌మెంట్ కమ్యూనికేషన్ స్పెషలిస్ట్ జో జోస్ (31). పిల్లల్ని కనకపోవడం ద్వారా ఈ ప్రపంచానికి గొప్ప మేలు చేస్తున్నట్టు జో భావిస్తుంటారు.
Comments
Please login to add a commentAdd a comment