ఏపీ పోలీసుల బెదిరింపులు | AP police intimidation to the Tirupati encounter victims | Sakshi
Sakshi News home page

ఏపీ పోలీసుల బెదిరింపులు

Published Wed, Feb 22 2017 1:40 AM | Last Updated on Mon, Aug 20 2018 1:46 PM

AP police intimidation to the Tirupati encounter victims

తిరుపతి ఎన్‌కౌంటర్‌ బాధితులకు
తమిళ ఎర్ర కూలీలపై కాల్పుల కేసు ఉపసంహరణకు ఒత్తిడి

సాక్షి ప్రతినిధి, చెన్నై: రెండేళ్ల క్రితం తమిళనాడుకు చెందిన 20 మంది ఎర్రచందనం కూలీలను తిరుపతిలో ఎన్‌కౌంటర్‌ చేసిన ఘటనపై కేసును వెనక్కు తీసుకోవాలంటూ ఏపీ పోలీసులు తనను బెదిరిస్తున్నారని మృతుడు శశికుమార్‌ భార్య మునియమ్మాళ్‌ ఆరోపించారు. తిరువణ్ణామలై జిల్లా వేటపాళయంకు చెందిన శశికుమార్‌ అనే కూలీ ఆనాటి కాల్పుల్లో మృతి చెందాడు.

శశికుమార్‌ భార్య మునియమ్మాళ్‌ ఓ తమిళ ఛానల్‌కు మంగళవారం ఇచ్చిన ఇంటర్వ్యూలో.. ఇటీవల తాను ఇంట్లో వంట చేసుకుంటుండగా కొందరు ఏపీ పోలీసులు లోపలికి చొరబడి కొన్ని కాగితాలపై సంతకం, వేలిముద్ర వేయమన్నారని తెలిపారు. ఏంటని అడిగితే కాల్పుల కేసును ఉపసంహరించుకునేట్లుగా పత్రాలని బదులిచ్చారని ఆమె వెల్లడించారు. ‘‘నీ మంచి కోసమే చెబుతున్నాం. డబ్బులిస్తాం. పిల్లల చదువులకు ఉపయోగంగా ఉంటుంది. పత్రాలపై సంతకం పెట్టి తిరుపతి కోర్టుకు హాజరవ్వు’’ అని పోలీసులు ఒత్తిడి చేసినట్లు ఆమె పేర్కొన్నారు. ఏపీ పోలీసుల ఒత్తిడిపై డీఐజీ కాంతారావును సదరు చానల్‌ ప్రతినిధి వివరణ కోరగా.. కేసు కోర్టులో ఉందంటూ దానిపై మాట్లాడటానికి ఆయన నిరాకరించినట్లుగా తెలిసింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement