Tirupati encounter
-
ఏపీ పోలీసుల బెదిరింపులు
తిరుపతి ఎన్కౌంటర్ బాధితులకు తమిళ ఎర్ర కూలీలపై కాల్పుల కేసు ఉపసంహరణకు ఒత్తిడి సాక్షి ప్రతినిధి, చెన్నై: రెండేళ్ల క్రితం తమిళనాడుకు చెందిన 20 మంది ఎర్రచందనం కూలీలను తిరుపతిలో ఎన్కౌంటర్ చేసిన ఘటనపై కేసును వెనక్కు తీసుకోవాలంటూ ఏపీ పోలీసులు తనను బెదిరిస్తున్నారని మృతుడు శశికుమార్ భార్య మునియమ్మాళ్ ఆరోపించారు. తిరువణ్ణామలై జిల్లా వేటపాళయంకు చెందిన శశికుమార్ అనే కూలీ ఆనాటి కాల్పుల్లో మృతి చెందాడు. శశికుమార్ భార్య మునియమ్మాళ్ ఓ తమిళ ఛానల్‌కు మంగళవారం ఇచ్చిన ఇంటర్వ్యూలో.. ఇటీవల తాను ఇంట్లో వంట చేసుకుంటుండగా కొందరు ఏపీ పోలీసులు లోపలికి చొరబడి కొన్ని కాగితాలపై సంతకం, వేలిముద్ర వేయమన్నారని తెలిపారు. ఏంటని అడిగితే కాల్పుల కేసును ఉపసంహరించుకునేట్లుగా పత్రాలని బదులిచ్చారని ఆమె వెల్లడించారు. ‘‘నీ మంచి కోసమే చెబుతున్నాం. డబ్బులిస్తాం. పిల్లల చదువులకు ఉపయోగంగా ఉంటుంది. పత్రాలపై సంతకం పెట్టి తిరుపతి కోర్టుకు హాజరవ్వు’’ అని పోలీసులు ఒత్తిడి చేసినట్లు ఆమె పేర్కొన్నారు. ఏపీ పోలీసుల ఒత్తిడిపై డీఐజీ కాంతారావును సదరు చానల్ ప్రతినిధి వివరణ కోరగా.. కేసు కోర్టులో ఉందంటూ దానిపై మాట్లాడటానికి ఆయన నిరాకరించినట్లుగా తెలిసింది. -
ఆంధ్రప్రదేశ్ ఆస్తులు కనబడితే చాలు ..
చెన్నై : శేషాచల అటవీ ప్రాంతంలో జరిగిన ఎన్‌కౌంటర్‌పై తమిళులు రగిలిపోతున్నారు. తమిళ రాష్ట్రంలో... ఆంధ్రప్రదేశ్ ఆస్తులు కనబడితే చాలు బూడిద చేసేందుకు ఆందోళనకారులు సిద్దపడుతున్నారు. నిన్న హెరిటేజ్ ఫుడ్స్‌పై దాడి చేసిన తమిళ తంబీలు...శుక్రవారం చెన్నైలో ఆంధ్రాబ్యాంకుపై దాడి చేశారు. బ్యాంకులోని ఫర్నిచర్ ధ్వంసం చేశారు. మరోవైపు పాండిచ్చేరీలో ఏపీఎస్ ఆర్టీసీ బస్సును దగ్ధం చేసేందుకు ప్రయత్నించారు. బస్సులోని సీట్లకు నిప్పంటించారు. అయితే బస్సు డ్రైవర్ అప్రమత్తంగా వ్యవహరించడంతో బస్సును మంటల నుంచి రక్షించారు. తుత్తుకుడిలో ఆంధ్రాబ్యాంక్పై నిన్న దుండగులు బాంబు విసిరిన విషయం తెలిసిందే. అయితే అప్పటికి బ్యాంక్ తెరవకపోవటంతో ప్రమాదం తప్పింది. -
తమిళనాడు సీఎంకు చంద్రబాబు లేఖ
హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శుక్రవారం తమిళనాడు ముఖ్యమత్రి పన్నీర్ సెల్వంకు లేఖ రాశారు. శేషాచలం అడవుల్లో జరిగిన ఎర్ర చందనం కూలీల ఎన్‌కౌంటర్‌పై విచారణకు ఆదేశించామని, నివేదిక రాగానే పూర్తి వివరాలు సమర్పిస్తామని చంద్రబాబు తన లేఖలో పేర్కొన్నారు. కాగా చిత్తూరు జిల్లా శేషాచలం అడవుల్లో జరిగిన ఎన్కౌంటర్లో మృతి చెందిన తమిళులకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వమే నష్ట పరిహారం చెల్లిచాలని తమిళనాడు ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం డిమాండ్ చేసిన విషయం తెలిసిందే. 20 మంది ఎర్రచందనం స్మగ్లర్లను ఏపీ పోలీసులు, అటవీశాఖ అధికారులు ఎన్కౌంటర్ చేసిన నేపథ్యంలో చంద్రబాబుకు ఆయన ఓ లేఖ రాశారు. స్మగ్లింగ్ వ్యవహారంపై పూర్తి స్థాయి న్యాయవిచారణ జరిపించాలని, మరణాలను మానవహక్కుల ఉల్లంఘన కోణంలో విచారించాలని లేఖలో పన్నీరు సెల్వం పేర్కొన్నారు. ఆయన లేఖకు ముఖ్యమంత్రి చంద్రబాబు సమాధానం ఇచ్చారు. -
ఎవరైనా ఎందుకు చావాలి?
సాక్షి వెబ్సైట్ ప్రత్యేకం అది 90వ దశకంలో రాష్ట్రంలో వామపక్ష తీవ్రవాదం బలంగా ఉన్న కాలం.. ఎన్ కౌంటర్లు, మందుపాతరలు నిత్యకృత్యం. అటు నక్సలైట్లు, ఇటు పోలీసులు, సాధారణ పౌరులు, ప్రజాప్రతినిధుల మరణాలు లేని రోజులు చాలా అరుదు. అలాంటి సమయంలో క్రైమ్ రిపోర్టర్‌గా ఒక ఆంగ్ల దినపత్రికలో ఉద్యోగం.. ప్రతి రోజు కత్తి మీద సామును గుర్తుకు తెచ్చేది. పోలీసు అధికారులతో పాటు ప్రజాసంఘాలు, పౌరహక్కుల ప్రతినిధులతో సమానమైన సంబంధాలు, బ్యాలెన్స్ తప్పకుండా రిపోర్టింగ్ చేయాల్సిన బాధ్యత. ఈ క్రమంలో ఎన్నెన్ని మృతదేహాలు.. ఛిద్రమైన దేహాలు.. ఇంటినుంచి బయటకు వస్తే మళ్లీ ఇంటికి ఎప్పుడు వెళతామో తెలియని అనిశ్చితి. అలా రెండు మూడేళ్లు గడిచేసరికి మనసు స్పందించడం మానేసింది. హైదరాబాద్- కరీంనగర్ రాజీవ్ రహదారిపై ప్రజ్ఞాపూర్ దాటిన తర్వాత రోడ్డుకు ఎడమవైపు మూడు కిలోమీటర్ల లోపల అహ్మదీపూర్ అనే గ్రామం ఉంది. ఎన్కౌంటర్ జరిగిందని తెలియగానే ప్రయాణం.. చెల్లాచెదురుగా మృతదేహాలు! చనిపోయింది ఏడుగురు. అక్కడ ఆరు దేహాలు మాత్రమే కనబడుతున్నాయి. 'ఏడో బాడీ ఎక్కడ?' అక్కడే ఉన్న కానిస్టేబుల్‌ను అడిగా. పైనుంచి కిందివరకు పరికించి చూసి 'ఎన్ని సంవత్సరాలుగా ఈ ఉద్యోగం చేస్తున్నావ'ని ప్రశ్న. జవాబు చెప్పేలోపే మీరు కూడా మాలాగే మొద్దుబారిపోయారు అని ముక్తాయింపు. కొరడాతో మొహం మీద కొట్టిన ఫీలింగ్. ఇన్ని సంవత్సరాల రిపోర్టింగ్ ప్రయాణంలో చాలామంది పోలీసు అధికారులు కూడా తమ మొద్దుబారిపోయిన మనసులు విప్పిన సందర్భాలు ఉన్నాయి. ''ఐ షుడ్ టేక్ ఎట్ లీస్ట్ టెన్ డెత్స్ టు మై గ్రేవ్'' అని వాపోయిన ఒక అధికారి మాటలు ఇంకా గుర్తున్నాయి. తర్వాతి కాలంలో క్రమంగా వామపక్ష తీవ్రవాదం బలహీనపడింది. 'చావు వార్తల' ఫ్రీక్వెన్సీ తగ్గింది. ఏదో ఒక రిలీఫ్ అనిపించేది. కానీ అకస్మాత్తుగా గత పదిరోజులుగా ఆ ప్రశాంతత దూరమైంది. నల్లగొండలో వరుస సంఘటనలు, చిత్తూరు ఎర్రచందనం కూలీల 'ఎన్ కౌంటర్' వాదోపవాదాలు, ఆరోపణలు, ప్రత్యారోపణలు.. వీటిమధ్య హక్కుల ఉల్లంఘన అంశం మరుగున పడిపోయింది. ఎన్కౌంటర్లపై గతంలో జరిగిన విచారణల్లో పెద్దగా తేలింది ఏమీ లేదు. ''నువ్వు చంపితే నేనూ చంపుతా''ననే ఆటవిక న్యాయం ముందు సామాన్యుడి ప్రాణాలకు విలువ లేకుండా పోయింది.. పోతోంది. నక్సల్స్ సమస్య శాంతిభద్రతల సమస్యా, సామాజిక ఆర్థిక అంశమా అనే చర్చ దశాబ్దాలుగా కొనసాగుతూనే ఉంది. మత ఉగ్రవాదానికి కారణాలేమిటీ అనే చర్చ వందలకొద్దీ గంటలు టీవీల్లో వినపడుతూనే ఉంటుంది. ఎర్రచందనం కూలీలు, స్మగ్లర్ల చేతుల్లో మోసపోతారు. పోలీసుల తూటాలకు బలి అవుతారు. 'ఒక ఎన్ కౌంటర్ చేస్తే భయపడతారు' అనే పిడివాదం ఫలితాలు ఇచ్చిందనడానికి దాఖలాలు లేవు. యాసిడ్ దాడులు జరుగుతూనే ఉన్నాయి. లైంగిక దాడుల సంఖ్య ప్రమాదకరంగా పెరిగిపోతూనే ఉంది. బాంబులు పేలుతూనే ఉన్నాయి. ప్రతిగా వాడుతున్న తూటాల సంఖ్య భారీగానే పెరుగుతోంది. 'తుపాకులు ఉన్నది ఎందుకు' అని గతంలో మంత్రిగా పనిచేసిన ఓ పెద్దాయన ప్రశ్నిస్తాడు. గడ్డి కోసుకోవడానికి వచ్చారా అని ఒక మంత్రివర్యుడు వ్యంగంగా వ్యాఖ్యానిస్తాడు. ఎన్ కౌంటర్ అర్థాన్ని మార్చిన తెలుగు ప్రజల నేల ఇది. ''ఏంటి రెచ్చిపోతున్నావ్, ఎన్ కౌంటర్ చేస్తా''ననే ఖాకీ బెదిరింపులు సర్వసాధారణంగా వినిపిస్తున్న ఠాణాలు ఉన్న ప్రాంతం ఇది. గడిచిన పదిరోజుల సంఘటనలు భవిష్యత్తులో రెండు రాష్ట్రాల్లో ఏర్పడబోయే పరిస్థితికి ముందస్తు హెచ్చరికలా? 'వై షుడ్ ఎనీబడీ గెట్ కిల్డ్? వెదర్ ఇట్ ఈజ్ ఏ టెర్రరిస్ట్ ఆర్ ఏ కామన్ మ్యాన్ ఆర్ ఏ పోలీస్ మన్? ఈజ్ రైట్ టు లివ్ నాట్ ఏ ఫండమెంటల్ రైట్?' దిల్సుఖ్ నగర్ పేలుళ్ల తర్వాత అప్పుడే ప్రపంచాన్ని చూడటం అలవాటు చేసుకున్న నా పెద్ద కూతురు అడిగిన ప్రశ్న. చాలా రోజులపాటు నన్ను వెంటాడిన ప్రశ్న. క్రమంగా మరుగున పడిపోతున్న దశలో సూర్యాపేట బస్టాండ్ లో హోంగార్డ్, కానిస్టేబుల్ లాంటి ఇద్దరు చిరుద్యోగులు టెర్రరిస్టుల తూటాలకు బలయిన సందర్భంలో మళ్లీ గుర్తుకొచ్చిన ప్రశ్న. వరుస సంఘటనలతో ఆ ప్రశ్న మళ్లీ బలంగా వినపడుతోంది. 'వై ఎనీబడీ గెట్ షుడ్ కిల్డ్? - ఎస్. గోపినాథ్ రెడ్డి -
సుప్రీంకోర్టుకు తిరుపతి ఎన్కౌంటర్ వ్యవహారం
చిత్తూరు : తిరుపతి శేషాచలం అడవుల్లో మంగళవారం జరిగిన ఎన్కౌంటర్ వ్యవహారం సుప్రీంకోర్టుకు చేరింది. ఎన్‌కౌంటర్‌ను నిరసిస్తూ ఓ స్వచ్ఛంద సంస్థ గురువారం సుప్రీంకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు చేసింది. ఎన్‌కౌంటర్‌పై సీబీఐ లేదా సిట్‌తో విచారణ జరిపించాలని ఆ స్వచ్ఛంద సంస్థ తన పిటిషన్లో కోరింది. న్యాయస్థానం పిటిషన్‌ను విచారణకు స్వీకరించింది. మరోవైపు ఇదే అంశాన్ని న్యాయమూర్తి కృష్ణమూర్తి ఈరోజు చీఫ్ జస్టిస్ హెచ్ఎల్ దత్తు ఎదుట ప్రస్తావించారు. అయితే సరైన పిటిషన్ రూపంలో కోర్టుకు రావాలని ఆయన సూచించారు. దీనిపై ప్రజా ప్రయోజన వ్యాజ్యం వేస్తామని న్యాయవాది కృష్ణమూర్తి తెలిపారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, డీజీపీ, ఏపీ పోలీసులు మానవ హక్కుల ఉల్లంఘనకు పాల్పడ్డారన్న ఆయన కేసు విచారణను సీబీఐకి బదిలీ చేయాలని కోరారు. పోలీసులపై హత్యకేసు నమోదు చేయాలని కృష్ణమూర్తి కోరారు. -
ఆంధ్రాబ్యాంకుపై బాంబు విసిరిన దుండగులు
చెన్నై: తిరుపతి శేషాచలం అడవుల్లో జరిగిన ఎన్‌కౌంటర్‌పై తమిళనాడులో మూడోరోజు కూడా నిరసనలు, ఆందోళనలు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో తుత్తుకుడిలో ఆంధ్రాబ్యాంకుపై గురువారం ఉదయం దుండగులు బాంబు విసిరారు. అయితే ఆ సమయంలో బ్యాంకు ఇంకా తెరవకపోవటంతో ప్రమాదం తప్పింది. ఆంధ్రా బస్సులపై గుర్తు తెలియని వ్యక్తులు నిన్న దాడి చేసిన విషయం తెలిసిందే. దాంతో తమిళనాడు నుంచి ఏపీ వైపు వెళ్లే బస్సు సర్వీసులను పూర్తిగా నిలిపివేశారు. -
వారి ప్రాణాలు తీయడం ఎంత వరకు న్యాయం?:వైఎస్ జగన్
సాక్షి, హైదరాబాద్: తుపాకులేమీ లేని 20 మంది కూలీల ప్రాణాలను బలిగొనడం ఎంతవరకు న్యాయమని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి వ్యాఖ్యానించారు. శేషాచలం అడవుల్లో 20 మంది ఎర్రచందనం కూలీల కాల్చివేత ఘటనపై ఆయన ట్వీట్ చేశారు. ‘‘వారి చేతుల్లో ఎలాంటి తుపాకులు లేనప్పుడు 20 మంది కూలీల ప్రాణాలను తీయడం ఎంతవరకు సమంజసం’’ అని వైఎస్జగన్ తన ట్విటర్ ఖాతాలో ప్రశ్నించారు. How is it fair to take the lives of 20 labourers especially when they're not carrying any guns? — YS Jagan Mohan Reddy (@ysjagan) April 8, 2015 -
కూలీల ప్రాణాలు తీయడం ఎంత వరకు న్యాయం?
-
ఎన్కౌంటర్ మృతుల గుర్తింపు
తిరుపతి : శేషాచలం అడవుల్లో జరిగిన ఎన్కౌంటర్లో మృతి చెందిన 20మంది ఎర్ర చందనం కూలీలను పోలీసులు గుర్తించారు. చనిపోయిన వారంతా తమిళనాడుకు చెందినవారే. వారిలో నలుగురు వేలూరు, 8మంది విల్లుపురం, మరో 8మంది తిరువణ్ణామలైకి చెందినవారు. మృతులకు బుధవారం ఉదయం రుయా ఆస్పత్రిలో పోస్ట్‌మార్టం నిర్వహించనున్నారు. పోస్ట్‌మార్టం అనంతరం మృతదేహాలను కుటుంబ సభ్యులకు అందించనున్నారు. మరోవైపు ఎర్రచందనం కూలీల ఎన్కౌంటర్ ప్రభావం తిరుపతిలో భక్తులు,ప్రయాణికులపై పడింది. ఎన్‌కౌంటర్‌కు నిరసనగా తమిళనాడులో బంద్ నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. దాంతో తిరుపతి నుంచి తమిళనాడుకు రాకపోకలు బంద్ అయ్యాయి. దాంతో భక్తులు తిరుపతి ఆర్టీసీ బస్టాండ్‌లో అవస్థలు పడుతున్నారు. -
'ఆంధ్రా ఆస్తులు, బ్యాంకులపై దాడి చేస్తాం'
చెన్నై : చిత్తూరు జిల్లా శేషాచల అడవుల్లో ఎర్రచందనం తమిళనాడుకు చెందిన కూలీలను ఎన్కౌంటర్ చేయడంపై తమిళ పార్టీలు భగ్గుమన్నాయి. తమిళనాడులో ఉన్న ఆంధ్రా హోటళ్లు, బ్యాంకులు, ఆస్తులపై దాడులు చేస్తామని నామ్ తమిళర్ కచ్చి హెచ్చరించింది. దీంతో చెన్నైలో ఉన్న ఆంధ్రా ప్రాంతం వారి ఆస్తులు, సంస్థలకు తమిళనాడు పోలీసులు భారీ భద్రత ఏర్పాటు చేశారు. చెన్నైలోని ఆంధ్రా క్లబ్‌ను మూసివేశారు. కూలీల మృతికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వమే బాధ్యత వహించాలని ఎండీఎంకే నేత వైగో డిమాండ్ చేశారు. ఈ ఘటనపై సమగ్ర విచారణ జరపాలని తమిళనాడు కాంగ్రెస్ నేత ఇళంగోవన్ వ్యాఖ్యానించారు. చిత్తూరు జిల్లా శేషాచలం అడవుల్లో జరిగిన ఎన్కౌంటర్లో 20మంది ఎర్రచందనం స్మగ్లర్లు హతమైన విషయం తెలిసిందే. వీరంతా తమిళనాడుకు చెందిన కూలీలు. -
ఎన్‌కౌంటర్‌పై భగ్గుమన్న తమిళ పార్టీలు
చెన్నై : ఎర్ర చందనం స్మగ్లర్ల ఎన్‌కౌంటర్‌ను తమిళనాడులోని రాజకీయ పార్టీలు తప్పబట్టాయి. ఎన్‌కౌంటర్‌పై సమగ్ర దర్యాప్తుకు ఎండీఎంకే ప్రధాన కార్యదర్శి వైగోతో పాటు తమిళ కాంగ్రెస్ డిమాండ్ చేసింది. పోలీసులే ఏకపక్షంగా కాల్పులు జరిపారని వైగో ఆరోపించారు. మరోవైపు తమిళనాడు ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం మంగళవారం చిత్తూరు ఎన్‌కౌంటర్‌పై అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఎర్రచందనం కూలీల వివరాల కోసం తమిళనాడు పోలీసులు ..తిరుపతి రానున్నారు. కాగా చిత్తూరు జిల్లా శేషాచలం అడవుల్లో జరిగిన ఎన్కౌంటర్లో 20మంది ఎర్రచందనం స్మగ్లర్లు హతమైన విషయం తెలిసిందే. వీరంతా తమిళనాడుకు చెందిన కూలీలు. మరోవైపు పరారీలో ఉన్న మిగతా స్మగ్లర్ల కోసం టాస్క్‌ఫోర్స్ పోలీసులు, అటవీశాఖ అధికారులు గాలింపు ముమ్మరం చేశారు. మరోవైపు ఈ ఎన్ కౌంటర్ ఆంధ్రప్రదేశ్, తమిళనాడు రాష్ట్రాల మధ్య దూరాన్ని పెంచినట్లు అయింది. దీనిపై తమిళనాడు కాంగ్రెస్ నేత ఇళంగోవన్ తీవ్రంగా విమర్శనాస్త్రాలు సంధించారు. పేదలకు సరైన పునరావాసం, ఉపాధి కల్పించకపోవడం వల్లే ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయని మండిపడ్డారు. ఆంధ్రాహోటళ్లు, బ్యాంకులు, ఆస్తులపై దాడులపై చేస్తామన్నారు.