
ఎవరైనా ఎందుకు చావాలి?
సాక్షి వెబ్సైట్ ప్రత్యేకం
అది 90వ దశకంలో రాష్ట్రంలో వామపక్ష తీవ్రవాదం బలంగా ఉన్న కాలం.. ఎన్ కౌంటర్లు, మందుపాతరలు నిత్యకృత్యం. అటు నక్సలైట్లు, ఇటు పోలీసులు, సాధారణ పౌరులు, ప్రజాప్రతినిధుల మరణాలు లేని రోజులు చాలా అరుదు. అలాంటి సమయంలో క్రైమ్ రిపోర్టర్గా ఒక ఆంగ్ల దినపత్రికలో ఉద్యోగం.. ప్రతి రోజు కత్తి మీద సామును గుర్తుకు తెచ్చేది. పోలీసు అధికారులతో పాటు ప్రజాసంఘాలు, పౌరహక్కుల ప్రతినిధులతో సమానమైన సంబంధాలు, బ్యాలెన్స్ తప్పకుండా రిపోర్టింగ్ చేయాల్సిన బాధ్యత. ఈ క్రమంలో ఎన్నెన్ని మృతదేహాలు.. ఛిద్రమైన దేహాలు.. ఇంటినుంచి బయటకు వస్తే మళ్లీ ఇంటికి ఎప్పుడు వెళతామో తెలియని అనిశ్చితి. అలా రెండు మూడేళ్లు గడిచేసరికి మనసు స్పందించడం మానేసింది.
హైదరాబాద్- కరీంనగర్ రాజీవ్ రహదారిపై ప్రజ్ఞాపూర్ దాటిన తర్వాత రోడ్డుకు ఎడమవైపు మూడు కిలోమీటర్ల లోపల అహ్మదీపూర్ అనే గ్రామం ఉంది. ఎన్కౌంటర్ జరిగిందని తెలియగానే ప్రయాణం.. చెల్లాచెదురుగా మృతదేహాలు! చనిపోయింది ఏడుగురు. అక్కడ ఆరు దేహాలు మాత్రమే కనబడుతున్నాయి. 'ఏడో బాడీ ఎక్కడ?' అక్కడే ఉన్న కానిస్టేబుల్ను అడిగా. పైనుంచి కిందివరకు పరికించి చూసి 'ఎన్ని సంవత్సరాలుగా ఈ ఉద్యోగం చేస్తున్నావ'ని ప్రశ్న. జవాబు చెప్పేలోపే మీరు కూడా మాలాగే మొద్దుబారిపోయారు అని ముక్తాయింపు. కొరడాతో మొహం మీద కొట్టిన ఫీలింగ్. ఇన్ని సంవత్సరాల రిపోర్టింగ్ ప్రయాణంలో చాలామంది పోలీసు అధికారులు కూడా తమ మొద్దుబారిపోయిన మనసులు విప్పిన సందర్భాలు ఉన్నాయి. ''ఐ షుడ్ టేక్ ఎట్ లీస్ట్ టెన్ డెత్స్ టు మై గ్రేవ్'' అని వాపోయిన ఒక అధికారి మాటలు ఇంకా గుర్తున్నాయి. తర్వాతి కాలంలో క్రమంగా వామపక్ష తీవ్రవాదం బలహీనపడింది. 'చావు వార్తల' ఫ్రీక్వెన్సీ తగ్గింది. ఏదో ఒక రిలీఫ్ అనిపించేది.
కానీ అకస్మాత్తుగా గత పదిరోజులుగా ఆ ప్రశాంతత దూరమైంది. నల్లగొండలో వరుస సంఘటనలు, చిత్తూరు ఎర్రచందనం కూలీల 'ఎన్ కౌంటర్' వాదోపవాదాలు, ఆరోపణలు, ప్రత్యారోపణలు.. వీటిమధ్య హక్కుల ఉల్లంఘన అంశం మరుగున పడిపోయింది. ఎన్కౌంటర్లపై గతంలో జరిగిన విచారణల్లో పెద్దగా తేలింది ఏమీ లేదు. ''నువ్వు చంపితే నేనూ చంపుతా''ననే ఆటవిక న్యాయం ముందు సామాన్యుడి ప్రాణాలకు విలువ లేకుండా పోయింది.. పోతోంది.
నక్సల్స్ సమస్య శాంతిభద్రతల సమస్యా, సామాజిక ఆర్థిక అంశమా అనే చర్చ దశాబ్దాలుగా కొనసాగుతూనే ఉంది. మత ఉగ్రవాదానికి కారణాలేమిటీ అనే చర్చ వందలకొద్దీ గంటలు టీవీల్లో వినపడుతూనే ఉంటుంది. ఎర్రచందనం కూలీలు, స్మగ్లర్ల చేతుల్లో మోసపోతారు. పోలీసుల తూటాలకు బలి అవుతారు.
'ఒక ఎన్ కౌంటర్ చేస్తే భయపడతారు' అనే పిడివాదం ఫలితాలు ఇచ్చిందనడానికి దాఖలాలు లేవు. యాసిడ్ దాడులు జరుగుతూనే ఉన్నాయి. లైంగిక దాడుల సంఖ్య ప్రమాదకరంగా పెరిగిపోతూనే ఉంది. బాంబులు పేలుతూనే ఉన్నాయి. ప్రతిగా వాడుతున్న తూటాల సంఖ్య భారీగానే పెరుగుతోంది. 'తుపాకులు ఉన్నది ఎందుకు' అని గతంలో మంత్రిగా పనిచేసిన ఓ పెద్దాయన ప్రశ్నిస్తాడు. గడ్డి కోసుకోవడానికి వచ్చారా అని ఒక మంత్రివర్యుడు వ్యంగంగా వ్యాఖ్యానిస్తాడు.
ఎన్ కౌంటర్ అర్థాన్ని మార్చిన తెలుగు ప్రజల నేల ఇది. ''ఏంటి రెచ్చిపోతున్నావ్, ఎన్ కౌంటర్ చేస్తా''ననే ఖాకీ బెదిరింపులు సర్వసాధారణంగా వినిపిస్తున్న ఠాణాలు ఉన్న ప్రాంతం ఇది. గడిచిన పదిరోజుల సంఘటనలు భవిష్యత్తులో రెండు రాష్ట్రాల్లో ఏర్పడబోయే పరిస్థితికి ముందస్తు హెచ్చరికలా?
'వై షుడ్ ఎనీబడీ గెట్ కిల్డ్? వెదర్ ఇట్ ఈజ్ ఏ టెర్రరిస్ట్ ఆర్ ఏ కామన్ మ్యాన్ ఆర్ ఏ పోలీస్ మన్? ఈజ్ రైట్ టు లివ్ నాట్ ఏ ఫండమెంటల్ రైట్?' దిల్సుఖ్ నగర్ పేలుళ్ల తర్వాత అప్పుడే ప్రపంచాన్ని చూడటం అలవాటు చేసుకున్న నా పెద్ద కూతురు అడిగిన ప్రశ్న. చాలా రోజులపాటు నన్ను వెంటాడిన ప్రశ్న. క్రమంగా మరుగున పడిపోతున్న దశలో సూర్యాపేట బస్టాండ్ లో హోంగార్డ్, కానిస్టేబుల్ లాంటి ఇద్దరు చిరుద్యోగులు టెర్రరిస్టుల తూటాలకు బలయిన సందర్భంలో మళ్లీ గుర్తుకొచ్చిన ప్రశ్న. వరుస సంఘటనలతో ఆ ప్రశ్న మళ్లీ బలంగా వినపడుతోంది. 'వై ఎనీబడీ గెట్ షుడ్ కిల్డ్?
- ఎస్. గోపినాథ్ రెడ్డి