ఎన్కౌంటర్పై భగ్గుమన్న తమిళ పార్టీలు
చెన్నై : ఎర్ర చందనం స్మగ్లర్ల ఎన్కౌంటర్ను తమిళనాడులోని రాజకీయ పార్టీలు తప్పబట్టాయి. ఎన్కౌంటర్పై సమగ్ర దర్యాప్తుకు ఎండీఎంకే ప్రధాన కార్యదర్శి వైగోతో పాటు తమిళ కాంగ్రెస్ డిమాండ్ చేసింది. పోలీసులే ఏకపక్షంగా కాల్పులు జరిపారని వైగో ఆరోపించారు. మరోవైపు తమిళనాడు ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం మంగళవారం చిత్తూరు ఎన్కౌంటర్పై అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఎర్రచందనం కూలీల వివరాల కోసం తమిళనాడు పోలీసులు ..తిరుపతి రానున్నారు.
కాగా చిత్తూరు జిల్లా శేషాచలం అడవుల్లో జరిగిన ఎన్కౌంటర్లో 20మంది ఎర్రచందనం స్మగ్లర్లు హతమైన విషయం తెలిసిందే. వీరంతా తమిళనాడుకు చెందిన కూలీలు. మరోవైపు పరారీలో ఉన్న మిగతా స్మగ్లర్ల కోసం టాస్క్ఫోర్స్ పోలీసులు, అటవీశాఖ అధికారులు గాలింపు ముమ్మరం చేశారు. మరోవైపు ఈ ఎన్ కౌంటర్ ఆంధ్రప్రదేశ్, తమిళనాడు రాష్ట్రాల మధ్య దూరాన్ని పెంచినట్లు అయింది. దీనిపై తమిళనాడు కాంగ్రెస్ నేత ఇళంగోవన్ తీవ్రంగా విమర్శనాస్త్రాలు సంధించారు. పేదలకు సరైన పునరావాసం, ఉపాధి కల్పించకపోవడం వల్లే ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయని మండిపడ్డారు. ఆంధ్రాహోటళ్లు, బ్యాంకులు, ఆస్తులపై దాడులపై చేస్తామన్నారు.