టెన్షన్..టెన్షన్.. అపోలో రోగుల తరలింపు
చెన్నై: తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత ఆరోగ్యం విషమం నేపథ్యంలో రాష్ట్రంలోని పలు నగరాల్లో ముఖ్యంగా చెన్నైలో అప్రమత్తత పరిస్థితి నెలకొంది. ఇప్పటికే నగరంలోని పలు కంపెనీలు అప్రమత్తమయ్యాయి. తమ సంస్థల్లో పనిచేస్తున్న ఉద్యోగులను ముందస్తుగా ఇంటికి పంపించేస్తున్నాయి. కొన్ని సంస్థలు మధ్యాహ్నానికే సెలవులు ప్రకటించాయి. మరోపక్క, జయ చికిత్స పొందుతున్న ఆస్పత్రి వద్ద టెన్షన్ పరిస్థితి నెలకొంది. ఆస్పత్రిలోని రోగులను ఇతర ఆస్పత్రులకు తరలిస్తున్నారు. సీరియస్ కేసులను సైతం జాగ్రత్తగా అంబులెన్స్‌ల ద్వారా వేరే ఆస్పత్రులకు మారుస్తున్నారు.
వారి రోగాన్ని బట్టి ఇతర నగరాల్లోని ఆస్పత్రులకు కూడా వారిని తరలిస్తున్నట్లు తెలిసింది. మరోపక్క, జయలలిత చికిత్స పొందుతున్న అపోలో ఆస్పత్రి ఏఐఏడీఎంకే పార్టీ నేతలు, కార్యకర్తలు, అభిమానులతో కిక్కిరిసిపోతోంది. ఆస్పత్రి వద్ద కాస్తంత ఉద్విగ్న పరిస్థితి నెలకొనడం, ఆస్పత్రిలోని రోగులను వేరే ఆస్పత్రులకు తరలిస్తున్న నేపథ్యంలో జయను తమకు చూపించాలని వారంతా డిమాండ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో పోలీసులు కూడా ఎక్కడికక్కడ అప్రమత్తమయ్యారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా రాష్ట్ర పోలీసులు, కేంద్ర బలగాలు, బ్లాక్ కమాండోస్‌ను రంగంలోకి దించారు. మొత్తానికి తమిళనాడు అంతటా కూడా ఉక్కిరిబిక్కిరి పరిస్థితి కనిపిస్తోంది.