
శ్రీనగర్/జమ్మూ: విపరీతమైన మంచు కారణంగా 15,500 అడుగుల ఎత్తులో చిక్కుకున్న సుమారు 350 మందిని ఆర్మీ రక్షించింది. ఈ మేరకు శుక్రవారం రక్షణ శాఖ అధికార ప్రతినిధి కల్నల్ రాజేశ్ కలియా వెల్లడించారు. శ్రీనగర్–లేహ్ జాతీయ రహదారిపై ఉన్న జోజిలా పాస్ వద్ద వీరంతా చిక్కుకున్నట్లు తెలిపారు. గురువారం నుంచి మంచు విపరీతంగా పడడంతో రోడ్లు మూసుకొని పోయి వాహనాల్లో ఇరుక్కుపోయారు. బయట ఉష్ణోగ్రతలు –7కు పడిపోయాయి. దాదాపు 250 ట్రక్కులు ఈ ట్రాఫిక్ జామ్‌లో ఇరుక్కుపోయాయి. ఆర్మీ, పోలీసులు, ప్రభుత్వ యంత్రాంగం కలసికట్టుగా రాత్రంతా శ్రమించి వీరిని రక్షించారు. ప్రభుత్వం ద్వారా వారి జాడను తెలుసుకున్న ఆర్మీ వారిని రక్షించి, వేడి ఆహారాన్ని, దుప్పట్లను అందించింది. మరోవైపు పోలీసులు, జీఆర్‌ఈఎఫ్ సిబ్బంది రోడ్డుపై పేరుకున్న మంచు తొలగిస్తూ, ట్రాఫిక్ మళ్లించే ఏర్పాట్లు చేశారు. ఆర్మీ వెనువెంటనే తీసుకున్న నిర్ణయం వల్ల వీరు సురక్షితంగా బయటపడ్డారు.
Comments
Please login to add a commentAdd a comment