సరైన లక్ష్యం + మెరుపు వేగం= సర్జికల్ దాడి | army surgical strikes special story | Sakshi
Sakshi News home page

సరైన లక్ష్యం + మెరుపు వేగం= సర్జికల్ దాడి

Published Fri, Sep 30 2016 2:55 AM | Last Updated on Sat, Aug 25 2018 3:57 PM

సరైన లక్ష్యం + మెరుపు వేగం= సర్జికల్ దాడి - Sakshi

సరైన లక్ష్యం + మెరుపు వేగం= సర్జికల్ దాడి

ఉడీ ఘటనకు ప్రతీకారంగా భారత ఆర్మీ పీవోకేలోని పాక్ మిలిటెంట్ల స్థావరాలపై సర్జికల్ దాడులు నిర్వహించింది. అణ్వాయుధాలు వాడేందుకు ఆలోచించేది లేదన్న పాక్ వ్యాఖ్యల నేపథ్యంలో.. భారత్ జరిపిన ఈ మెరుపు (సర్జికల్) దాడుల అంశంపై తెరపైకి వచ్చింది. అసలు సర్జికల్ దాడులంటే ఏంటి? ఈ దాడుల ప్రణాళికేంటి? ఎందుకు? ఎప్పుడు నిర్వహిస్తారనేది ఓసారి చూస్తే..

సర్జికల్ దాడులంటే ఏంటి?
నిర్దేశిత లక్ష్యాలపై చాలా చురుకుగా దాడి చేసి శత్రువును మట్టుబెట్టడం, భారీగా నష్టం కలిగించటమే సర్జికల్ దాడి. అయితే సామాన్య ప్రజలకు, దాడి జరిగిన ప్రాంతాల్లో చుట్టుపక్కల పెద్దగా నష్టం జరగకుండా, కేవలం లక్ష్యాన్ని, అక్కడున్న శత్రవులను మట్టుపెట్టడం ఈ దాడుల్లో చాలా కీలకం. చాలా సందర్భాల్లో యుద్ధాన్ని నివారించేందుకు కూడా ఇటువంటి దాడులను చేస్తుంటారు. నియంత్రణ రేఖ (ఎల్వోసీ) గుండా పాక్ ప్రేరేపిత ఉగ్రవాదులు తరచూ చొరబాట్లు చేస్తున్న నేపథ్యంలో సర్జికల్ దాడుల ద్వారా పీవోకేలో ఉగ్రవాద కేంద్రాలను ఏరివేసేందుకు భారత్ ఈ ఆపరేషన్ చేపట్టింది. ఈ ఆపరేషన్‌లో పాల్గొనే బృందాలు ప్రత్యర్థి కళ్లుమూసి తెరిచేలోగానే మొత్తం పనిచక్కబెట్టుకుని వచ్చేస్తాయి. అప్పుడే ఆపరేషన్ విజయవంతం అయినట్లు.

 ఈ దాడులెలా చేస్తారు?
సర్జికల్ దాడులు చేయటం చాలా వ్యూహాత్మకమైన ఆపరేషన్. సర్వీస్ ఇంటెలిజెన్స్ విభాగం, ఇంటెలిజెన్స్ బ్యూరో, రా (రీసెర్చ్ అండ్ అనాలసిస్ వింగ్), సాంకేతిక బృందాలు కలుపుకుని ఆర్మీలో ప్రత్యేకంగా శిక్షణ పొందిన బలగాలతో ఈ ఆపరేషన్ టీమ్‌లను ఏర్పాటుచేస్తారు. ప్రత్యర్థి ఎంత దూరంలో ఉన్నాడు? చుట్టుపక్కల పరిస్థితేంటి? ఎంత వేగంగా పని చక్కబెట్టుకోవచ్చు వంటి అంశాలపై వివిధ స్థాయీల్లో తీవ్రమైన చర్చ, ఈ భాగాల మధ్య సమన్వయం అవసరం.

వీటన్నింటిపై స్పష్టత వచ్చాకే సర్జికల్ దాడులు మొదలవుతాయి. నిర్ణయించుకున్న ప్రణాళిక ప్రకారం లక్ష్యాలపై.. ఒక్క అడుగు కూడా లెక్కలో తేడా రాకుండా మెరుపువేగంతో దాడులు జరుగుతాయి. ఈ తతంగం జరుగుతున్నంతసేపు సీ4ఐఎస్‌ఆర్ (ఆదేశం, నియంత్రణ, సమాచారం, కంప్యూటర్లు, ఇంటెలిజెన్స్, నిఘా, గూఢచర్య విభాగాల సమన్వయం)తో ఈ ప్రత్యేక బృందాలు అనుసంధానమై ఉంటాయి. ప్రజలు నివసించే ప్రాంతాల్లోనూ సామాన్య జనానికి నష్టం జరగకుండా.. కేవలం లక్ష్యాన్ని మాత్రమే ధ్వంసం చేసేందుకు సర్జికల్ దాడులు నిర్వహిస్తారు. దాడులకు ముందే ప్రత్యర్థి వర్గంలోకి కోవర్టుల్లా ప్రవేశించి సేకరించే సమాచారం కూడా ఇలాంటి ఆపరేషన్లలో ప్రత్యేక భూమిక నిర్వహిస్తుంది.

 భారత్ బలమెంత?
ఈ తరహా దాడులు చేయటంలో భారత్ వద్ద త్రివిధ దళాల్లో పలు ప్రత్యేక బృందాలున్నాయి. ఈ దాడుల్లో ప్రముఖ పాత్ర వైమానిక దళానిదే. భారత వైమానిక దళంలో కీలకమైన బృందాలున్నాయి. దీంతోపాటు భారత పారాచ్యూట్ రెజిమెంట్‌లోని శిక్షణ పొందిన పారాపైలట్లు ఇలాంటి ఆపరేషన్లు చేయటంలో ప్రత్యేకంగా శిక్షణ పొందారు. క్షేత్రస్థాయిలో శ్రతువుపై పోరాడటం కష్టంగా ఉన్నప్పుడుకూడా ఇటువంటి దాడులు నిర్వహిస్తారు. అటు నేవీ కూడా తమ మెరైన్ కమాండోస్ (మార్కోస్) ఈ తరహా దాడులు చేయటంలో దిట్ట అని పేర్కొంది. వైమానిక దళంలో ‘గరుడ’ దళం సామాన్యంగా ఇలాంటి దాడులకు శిక్షణ పొందుతుంది.

ఈ దాడులు చాలా కష్టం: మాజీ ఆర్మీ అధికారి
‘సర్జికల్ దాడులను నిర్వహించటం అంత సులభమేం కాదు. లక్ష్యాలు స్థిరంగా ఉండొచ్చు. గమనంలో ఉండొచ్చు. వీటిని టార్గెట్ చేసేందుకు పక్కా ప్రణాళికతో ముందడుగేయాలి. ఆపరేషన్‌కు బయలుదేరేముందు బృందంలోని ప్రతి సిపాయికి ఆపరేషన్‌కు సంబంధించిన ప్రతి విషయాన్ని వివరంగా చెబుతారు. ఎవరి బాధ్యతను వారికి అప్పగిస్తారు. మనకేం నష్టం జరగకుండా ప్రత్యర్థిని మట్టుబెట్టి రావటం ఈ ఆపరేషన్ ప్రత్యేకత. అందుకే సర్జికల్ దాడులు చేసేందుకు ధైర్యం కావాలి’ అని రిటైర్డ్ లెఫ్టినెంట్ జనరల్ శంకర్ ప్రసాద్ తెలిపారు.

ప్రపంచవ్యాప్తంగా ప్రముఖ సర్జికల్ దాడులు
1. మయన్మార్‌లో భారత ఆపరేషన్: 2015, జూన్‌లో 70 మంది భారత కమాండోలు మయన్మార్ అడవుల్లో సర్జికల్ దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో 38 మంది నాగా మిలిటెంట్లు హతమవ్వగా ఏడుగురికి గాయాలయ్యాయి. జూన్4వ తేదీన మణిపూర్‌లో ఆర్మీ వాహనంపై దాడిచేసి 18 మంది జవాన్లను మట్టుబెట్టిన కాసేపటికే భారత్ ఈ దాడులు నిర్వహించింది.

2. ఒసామా ఆపరేషన్, పాకిస్తాన్: 2011లో పాకిస్తాన్‌లోని అబోత్తాబాద్‌లో ఐఎస్‌ఐ భద్రతావలయంలోని ఓ ఇంటిపై (అల్‌కాయిదా చీఫ్ ఒసామా దాక్కున్నాడన్న పక్కా సమాచారంతో) అమెరికా బలగాలు మెరుపుదాడి చేశాయి. సీఐఏ ఆధ్వర్యంలో జరిగిన ఈ ఘటనకు ఆపరేషన్ నెప్ట్యూన్ స్పియర్ (ఆపరేషన్ జెరోనిమో అనికూడా) అని పేరుపెట్టారు.

3. ఎంటెబీలో దాడి, ఉగాండా: ప్రపంచ సర్జికల్ దాడుల చరిత్రలో ఇది చాలా ప్రత్యేకం. 1979లో ఫ్రాన్స్ విమానాన్ని పాలస్తీనా విముక్తి ఉగ్రవాదులు ఉగాండాలోని ఎంటెబీలో హైజాక్ చేశారు. 100 మంది ఇజ్రాయిలీ కమాండోలు నిర్వహించిన ఈ ఆపరేషన్‌లో ఉగ్రవాదులందరూ, ముగ్గురు ప్రయాణికులు మృతిచెందగా.. మిగిలిన వారిని క్షేమంగా రక్షించారు.

4. బే ఆఫ్ పిగ్స్ ఆక్రమణ: 1961లో క్యూబాలో ఫిడేల్ క్యాస్ట్రోను గద్దెదించేందుకు అప్పటి అమెరికా అధ్యక్షుడు జాన్ ఎఫ్ కెనడీ, సీఐఏ నేతృత్వంలో బే ఆఫ్ పిగ్స్ సమీపంలో ఈ ఆపరేషన్ జరిగింది. ఈ ఆపరేషన్‌లో 100 మంది అమెరికన్ సైనికులు చనిపోయారు. ఈ ఆపరేషన్ ద్వారా అనుకున్నది సాధించలేకపోవటం అమెరికాకు ఓ పీడకలగా మిగిలింది.

5. ఆపరేషన్ ఈగల్ క్లా, ఇరాన్: 1979లో కొందరు ఇరానియన్ విద్యార్థులు.. తెహ్రాన్‌లో 53 మంది అమెరికన్లను బందీలుగా చేసుకున్నారు. దీంతో అప్పటి అమెరికా అధ్యక్షుడు జిమ్మీ కార్టర్ సీక్రెట్ మిషన్‌కు ఆదేశించారు. ఆపరేషన్ ఈగల్ క్లాగా వ్యవహరించిన ఈ ఘటనకూడా అమెరికాకు చేదు జ్ఞాపకాలనే మిగిల్చింది. బందీలను విడిపించే క్రమంలో అమెరికన్ సైనికులు ఇసుక తుపానులో చిక్కుకుపోయారు. ఓ హెలికాప్టర్ కూలిపోయింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement