న్యూఢిల్లీ: పాకిస్థాన్ ఆక్రమిత కశ్మీర్‌లో భారత సైన్యం జరిపిన సర్జికల్ స్ట్రైక్స్ విషయమై ఆర్మీ నార్తన్ కమాండ్ జనరల్ ఆఫీసర్ కమాండింగ్ ఇన్ చీఫ్ రణ్‌బీర్ సింగ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఉడీ ఉగ్రవాద దాడికి ప్రతీకారంగానే భారత ఆర్మీ తొలిసారి 2016 సెప్టెంబర్‌లో సర్జికల్ స్ట్రైక్స్ చేసిందని ఆయన స్పష్టం చేశారు. ఇటీవల ముగిసిన సార్వత్రిక ఎన్నికల్లో ఆర్మీ సర్జికల్ స్ట్రైక్స్ తీవ్ర చర్చనీయాంశమైన సంగతి తెలిసిందే. సర్జికల్ స్ట్రైక్స్ తొలిసారి తామే నిర్వహించామని బీజేపీ చెప్పుకుంటుండగా... ఆ వాదనను కాంగ్రెస్ పార్టీ తోసిపుచ్చింది. యూపీఏ హయాంలో భారత ఆర్మీ ఆరుసార్లు సర్జికల్ స్ట్రైక్స్ జరిపినట్టు కాంగ్రెస్ చెప్పుకొచ్చింది. ఆ పార్టీ సీనియర్ నేత రాజీవ్ శుక్లా తమ హయాంలో ఎప్పుడెప్పుడు సర్జికల్ స్ట్రైక్స్ జరిగాయో తేదీలతో సహా వెల్లడించారు. తమ హయాంలో సర్జికల్ దాడులు జరిగినా.. వాటి క్రెడిట్ ఎప్పుడూ తీసుకోలేదని, మాజీ ప్రధానులు మన్మోహన్‌సింగ్, వాజపేయి ఈ దాడులపై ఎన్నడూ విలేకరుల సమావేశం నిర్వహించి.. తమదే ఘనత చెప్పుకోలేదని ఆయన బీజేపీని దుయ్యబట్టారు.
అయితే, మోదీ హయాంలోనే తొలిసారి సర్జికల్ స్ట్రైక్స్ జరిగాయని ధ్రువీకరిస్తూ ఆర్మీ టాప్ కమాండర్ వ్యాఖ్యలు చేయడంపై కాంగ్రెస్ పార్టీ గుర్రుగా ఉంది. 2016 సెప్టెంబర్ 18న ఉడీలోని భారత సైనిక శిబిరంపై ఉగ్రవాదులు దాడులు జరిపి.. 18మంది సైనికులను పొట్టనబెట్టుకున్నారు. దీనికి ప్రతీకారంగా పదిరోజుల అనంతరం పీవోకేలోని ఉగ్రవాద శిబిరాలపై భారత సైన్యం సర్జికల్ దాడులు నిర్వహించింది.
Comments
Please login to add a commentAdd a comment