అనూహ్యం.. విస్మయం..!
ఊహించనిరీతిలో విస్మయపరచడంలో నరేంద్రమోదీని మించిన నాయకుడు లేరంటే అతియోశక్తి కాదేమో! సెప్టెంబర్ 18న 18మంది సైనికుల్ని పొట్టనబెట్టుకున్న ఉడీ ఉగ్రవాద దాడి నేపథ్యంలో పాక్‌ను ఇరకాటంలో నెట్టేందుకు దౌత్యపరమైన మార్గాల్లోనే ఎన్డీయే ప్రభుత్వం ముందుకు సాగుతోందని అందరూ భావించారు. సైనిక చర్యలాంటి తీవ్రమైన నిర్ణయాలు ఉండకపోవచ్చునని దేశ ప్రజలు కూడా నిర్ధారణకు వచ్చేలోపే.. అనూహ్యంగా సైన్యం పాకిస్థాన్ భూభాగంలోకి చొచ్చుకెళ్లి మరీ ఉగ్రవాద శిబిరాలపై ’సునిశిత దాడులు’ (సర్జికల్ స్ట్రైక్స్) జరిపింది.1990 నుంచి పాక్ మన దేశంలోకి ఉగ్రవాదాన్ని ఎగుమతి చేస్తున్నా.. ఇలాంటి దాడులు చేయడం ఇదే తొలిసారి కావడం గమనార్హం.
ఈ సైనిక చర్యల పర్యవసానం ఏమిటి? ప్రభావం ఎలా ఉండబోతున్నది? అన్నది ఇప్పటికిప్పుడు బేరీజు వేయలేం. కానీ, తన దౌత్య వ్యూహంలో భాగంగా రిస్క్ చేయడానికి వెనుకాడని ప్రధాని మోదీని మెచ్చుకోకుండా ఉండలేం. నిజానికి మోదీ ఇలాంటి అనూహ్య నిర్ణయాలు తీసుకోవడం ఇదేం కొత్త కాదు. 2014 మేలో ఆయన ప్రధానిగా తన ప్రమాణ స్వీకార వేడుకకు సార్క్ దేశాధినేతలతోపాటు పాక్ ప్రధాని నవాజ్ షరీఫ్‌ను కూడా ఆహ్వానించారు. దీనిని ఎవరూ పెద్దగా ఊహించలేకపోయారు. అనంతరం ఇరుదేశాల ద్వైపాక్షిక చర్చలను ముందుకు తీసుకెళ్లాలని ఇరునేతలు నిర్ణయించారు. మోదీ-షరీఫ్ మధ్య గొప్ప ’కెమిస్ట్రీ’ ఉండటంతో భారత్-పాక్ సంబంధాలు ఘననీయంగా మెరుగుపడతాయని అంతా భావించారు. కానీ కశ్మీర్‌లో మృతిచెందిన మిలిటెంట్ కమాండర్ బుర్హాన్ వనీని షరీఫ్ అమరుడు అని కీర్తించడం, పాకిస్థానీ స్వాతంత్య్ర దినమైన ఆగస్టు 14న అతనికి అంకితం ఇవ్వడంతో ఇరుదేశాలు సంబంధాలు దారుణంగా దెబ్బతిన్నాయి.
కానీ, అంతకుముందు రెండేళ్లలో భారత్-పాక్ సంబంధాల్లో కొన్ని మెరుపులు, కొన్ని విస్మయాలు, కొన్ని ఎదురుదెబ్బలు ఉన్నాయి. 2014లో ఇరుదేశాల విదేశాంగ కార్యదర్శుల స్థాయి చర్చలు నిర్వహించాలని మోదీ ప్రభుత్వం భావిస్తే.. వెంటనే కశ్మీర్ వేర్పాటువాద హురియత్ నేతలతో సమావేశమై పాక్ హై కమిషనర్ అబ్బుల్ బాసిత్ షాక్ ఇచ్చాడు. బ్యాంకాక్‌లో 2015 డిసెంబర్‌లో ఎన్‌ఎస్‌ఏ స్థాయి సమావేశం జరుగగా.. ఆ తర్వాత వారానికే పారిస్‌లో ఊహించనిరీతిలో మోదీ-షరీఫ్ భేటీ అయ్యారు.
ఇక రష్యా పర్యటన నుంచి తిరిగొస్తూ ఆఫ్గన్ మీదుగా లాహోర్‌లోని షరీఫ్ ఫామ్‌హౌజ్‌కు వెళ్లి ప్రధాని మోదీ ఏకంగా దేశాన్ని విస్మయ పరిచారు. షరీఫ్ మనవరాలి పెళ్లి విందులో పాల్గొని తన దౌత్య చతురతను చాటారు. నిజానికి మోదీ పాక్ విషయంలోనే కాదు అమెరికా విషయంలోనూ దూకుడుగా దౌత్యనీతిని అవలంబించారు. అమెరికా అధ్యక్షుడు ఒబామా కోసం పారిస్ వాతావరణ ఒప్పందాన్ని ఆమోదిస్తున్నట్టు ఇటీవల ప్రకటించి ఆయన అందరినీ విస్మయ పరిచారు. నిజానికి ఈ ఏడాది చివర్లోగానీ ఈ ఒప్పందాన్ని ఆమోదించబోమని మోదీ చైనాలో జీ20 సదస్సు సందర్భంగా పేర్కొన్న సంగతి తెలిసిందే.