సర్జికల్ దాడి ఫుటేజీ కేంద్రానికిచ్చిన ఆర్మీ
న్యూఢిల్లీ: సర్జికల్ దాడుల వీడియోలను భారత ఆర్మీ కేంద్ర ప్రభుత్వానికి అప్పగించింది. దీంతో ఈ ఫుటేజీ విడుదలపై కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోనుంది. గత రెండు రోజులుగా సర్జికల్ దాడుల విషయంపై వివాదం రగులుతున్న విషయం తెలిసిందే. ఫుటేజీని బయటపెట్టాలని ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ తోపాటు పలువురు డిమాండ్ చేశారు. ఈ నేపథ్యంలో కేంద్రం ఏం చేయనుందనే అంశంపై ఆసక్తి నెలకొంది.
అటు పాకిస్థాన్తోపాటు ప్రతిపక్షాల సభ్యులు కూడా పాకిస్థాన్ భూభాగంలో భారత ఆర్మీ నిర్వహించిన సర్జికల్ దాడులకు సంబంధించిన ఫుటేజీ విడుదల చేయాలని, దాడులు జరిగినట్లున్న ఆధారాలను బయటపెట్టాలని డిమాండ్ చేస్తున్న నేపథ్యంలో బుధవారం భద్రతా వ్యవహారాల కేబినెట్ భేటీ కూడా జరిగింది. ప్రధాని నరేంద్రమోదీ అధ్యక్షతన ఈ భేటీ నిర్వహించారు. తన రెండు రోజుల పర్యటనను ముగించుకొని కేంద్ర హోంమంత్రి రాజ్ నాథ్ సింగ్ కూడా వచ్చిన నేపథ్యంలో సరిహద్దు ప్రాంతంలోని రక్షణ పరిస్థితిపై ప్రధాని మోదీకి వివరించినట్లు తెలుస్తోంది. ఫుటేజీ అంశంపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.