సర్జికల్ స్ట్రైక్స్‌పై మోదీ కామెంట్స్.. ఇజ్రాయెల్‌తో పోలిక!
మాండీ: ఈ రోజుల్లో ప్రతి ఒక్కరూ మన సైన్యం గురించే మాట్లాడుతున్నారంటూ ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఆర్మీపై ప్రశంసల జల్లు కురిపించారు. హిమాచల్ ప్రదేశ్‌లోని మాండిలో మంగళవారం జరిగిన ఓ భారీ బహిరంగ సభలో మాట్లాడిన మోదీ.. పాకిస్థాన్‌లో సైన్యం జరిపిన సర్జికల్ స్ట్రైక్స్ గురించి నేరుగా ప్రస్తావించనప్పటికీ.. ఈ విషయంలో మన జవాన్ల సత్తాను కొనియాడారు.
'గతంలో ఇజ్రాయెల్ గురించి ఇలా మాట్లాడుకునేవారు. ఇప్పుడు ప్రతి ఒక్కరికీ మన సైన్యం సామర్థ్యం గురించి తెలిసింది' అని మోదీ అన్నారు. శత్రుదేశాల్లోని మిలిటెంట్లు లక్ష్యంగా గతంలో ఇజ్రాయెల్ ఆర్మీ ఇలాంటి నిర్దేశిత దాడులు చేసిన సంగతి తెలిసిందే. హిమాచల్ ప్రదేశ్ వీరుల భూమి అని ప్రధాని మోదీ కీర్తించారు. రాష్ట్రంలో దాదాపు ప్రతి ఇంటి నుంచి ఒక జవాన్ ఉన్నాడని పేర్కొన్నారు.
దేశంలోని నగరాల్లో దాడులకు సిద్ధమవుతున్న ఉగ్రవాదులను ఏరివేసేందుకు సెప్టెంబర్ 29న సైన్యం పాకిస్థాన్‌లో ప్రవేశించి వీరోచితంగా సర్జికల్ దాడులు జరిపిన సంగతి తెలిసిందే. ఉడీ ఉగ్రవాద దాడి నేపథ్యంలో సైన్యం జరిపిన సర్జికల్ దాడులకు అనుమతి ఇవ్వడం ద్వారా ప్రధాని మోదీ ప్రభుత్వం ధైర్యాన్ని ప్రదర్శించిందని, ఈ సర్జికల్ దాడుల విషయంలో సైన్యంతోపాటు, ప్రధాని మోదీకి కూడా క్రెడిట్ ఇవ్వాల్సిందేనని రక్షణమంత్రి మనోహర్ పరీకర్ గతంలో వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే.