చెత్తయినా.. టెర్రరిస్టయినా ఊడ్చేస్తాం!
సాక్షి, కసౌలి : అత్యంత ఎత్తయిన ప్రదేశాలు, ప్రమాదకర సరిహద్దుల్లో సైన్యమే.. స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని నిర్వహిస్తుందని రక్షణ శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ చెప్పారు. హిమాచల్ ప్రదేశ్‌లోని కసౌలిలో టూరిస్టులు బహిరంగ ప్రదేశాల్లో జారవిడిచిన ప్లాస్టిక్, ఇతర చెత్తా చెదారాలను శుద్ధి చేసే కార్యక్రమానికి ఆమె ఆదివారం శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. దేశంలో అత్యంత ఎత్తయిన సుందరమైన, ఉగ్రవాద ప్రభావిత ప్రదేశాలైన జమ్మూ కశ్మీర్, హిమాచల్ ప్రదేశ్, ఈశాన్య రాష్ట్రాల్లో పర్యావరణ పరిరక్షణ చర్యలను ఇకపై సైన్యమే పర్యవేక్షిస్తుందని చెప్పారు.
వెస్ట్రన్ కమాండ్ ఆధ్వర్యంలోని కసౌలిని స్వచ్ఛంగా ఉంచేందుకు సైన్యం చేస్తున్న కృషిని రక్షణ మంత్రి నిర్మలా సీతారామన్ ప్రశంసించారు. ఈ సందర్భంగా ఆమె వెస్ట్రన్ కమాండ్ అధికారులను ప్రత్యేకంగా సన్మానించారు. సైనికులు చేస్తున్న త్యాగాల వల్లే వందకోట్లకు పైబడిన భారతీయులు స్వేచ్ఛగా, హాయిగా జీవించగలుగుతున్నారని నిర్మలా సీతారామన్ వ్యాఖ్యానించారు. సైనిక సంక్షేమానికి కేంద్రప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. కసౌలి బస్టాండ్‌లో మల్టి స్టోర్ పార్కింగ్ కోసం 15 కోట్ల రూపాయలను విడుదల చేస్తున్నట్లు చెప్పారు.