Kasauli
-
‘లంచం వద్దంది.. అందుకే చంపా!’
సిమ్లా: నిజాయితీతో వ్యవహరించిన ఓ అధికారిణిని వెంటాడి చంపిన ఘటనలో నిందితుడిని ఎట్టకేలకు పోలీసులు అరెస్ట్ చేశారు. అక్రమ కట్టాల కూల్చివేతను పర్యవేక్షించిన అధికారి షహిల్ బాల శర్మ(51)ను ఓ వ్యక్తి అతికిరాతకంగా కాల్చి చంపిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో నిందితుడు విజయ్ను ఎట్టకేలకు గురువారం సాయంత్రం పోలీసులు మధురలో(యూపీ) అదుపులోకి తీసుకున్నారు. విచారణలో నిందితుడు విజయ్ పోలీసులకు అసలేం జరిగిందో చెప్పాడు. ‘కూల్చివేతలు వద్దని ఆమెను బతిమాలుకున్నాం. ఆమె వినలేదు. చివరకు లంచం కూడా ఇస్తామన్నాం. కానీ, ఆమె తిరస్కరించారు. నా తల్లి ఆమె కాళ్ల మీద పడింది.. అయినా కనికరించలేదు. పైగా తాను నిజాయితీ ఆఫీసర్‌నంటూ ప్రగల్భాలు పలికారు. తన చేతిలో సుప్రీం కోర్టు ఆదేశాలు ఉన్నాయని.. వాటిని పాటించక తప్పదని ఆమె చెప్పారు. భరించలేక పోయా.. అందుకే వెంటాడి చంపేశా’ అని విజయ్ తెలిపాడు. ఘటన తర్వాత అడవిలోకి పారిపోయిన నిందితుడు.. ఆ రాత్రి ఇంటికి తిరిగొచ్చి డబ్బు, ఏటీఎంలతో ఢిల్లీకి చేరుకున్నాడు. ఎవరూ గుర్తుపట్టకుండా ఉండేందుకు గుండు గీయించుకుని మధురకు చేరుకున్నాడని, సెల్ ఫోన్స్ సిగ్నల్ ఆధారంగా అతన్ని కనిపెట్టినట్లు పోలీసులు తెలిపారు. కాగా, సుప్రీం కోర్టు ఆదేశాలను అనుసరించి కసౌలీ పట్టణంలో అక్రమ కట్టడాలను కూల్చివేతకు హిమాచల్‌ప్రదేశ్ ప్రభుత్వం ఉపక్రమించింది. పోలీసుల సాయంతో అధికారులు నిబంధనలను ఉల్లంఘించిన హోటళ్లను కూల్చివేయటం ప్రారంభించారు. ఈ క్రమంలో మండో మాట్కండలో ఉన్న నారాయణి గెస్ట్ హౌజ్ కూల్చేందుకు యత్నించగా.. అధికారిణి షహిల్ బాల, ఆ గెస్ట్‌హౌజ్ యజమాని విజయ్ సింగ్ మధ్య వాగ్వాదం మొదలైంది. కోపోద్రిక్తుడైన విజయ్ సింగ్ తుపాకీతో వెంటాడి పీడబ్ల్యూడీ అధికారులపై మూడు రౌండ్లు కాల్పులు జరిపాడు. ఈ ఘటనలో షహిల్ బాల అక్కడిక్కడే మృతి చెందగా, మరో అధికారి తీవ్రంగా గాయపడ్డారు. -
చెత్తయినా.. టెర్రరిస్టయినా ఊడ్చేస్తాం!
సాక్షి, కసౌలి : అత్యంత ఎత్తయిన ప్రదేశాలు, ప్రమాదకర సరిహద్దుల్లో సైన్యమే.. స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని నిర్వహిస్తుందని రక్షణ శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ చెప్పారు. హిమాచల్ ప్రదేశ్‌లోని కసౌలిలో టూరిస్టులు బహిరంగ ప్రదేశాల్లో జారవిడిచిన ప్లాస్టిక్, ఇతర చెత్తా చెదారాలను శుద్ధి చేసే కార్యక్రమానికి ఆమె ఆదివారం శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. దేశంలో అత్యంత ఎత్తయిన సుందరమైన, ఉగ్రవాద ప్రభావిత ప్రదేశాలైన జమ్మూ కశ్మీర్, హిమాచల్ ప్రదేశ్, ఈశాన్య రాష్ట్రాల్లో పర్యావరణ పరిరక్షణ చర్యలను ఇకపై సైన్యమే పర్యవేక్షిస్తుందని చెప్పారు. వెస్ట్రన్ కమాండ్ ఆధ్వర్యంలోని కసౌలిని స్వచ్ఛంగా ఉంచేందుకు సైన్యం చేస్తున్న కృషిని రక్షణ మంత్రి నిర్మలా సీతారామన్ ప్రశంసించారు. ఈ సందర్భంగా ఆమె వెస్ట్రన్ కమాండ్ అధికారులను ప్రత్యేకంగా సన్మానించారు. సైనికులు చేస్తున్న త్యాగాల వల్లే వందకోట్లకు పైబడిన భారతీయులు స్వేచ్ఛగా, హాయిగా జీవించగలుగుతున్నారని నిర్మలా సీతారామన్ వ్యాఖ్యానించారు. సైనిక సంక్షేమానికి కేంద్రప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. కసౌలి బస్టాండ్‌లో మల్టి స్టోర్ పార్కింగ్ కోసం 15 కోట్ల రూపాయలను విడుదల చేస్తున్నట్లు చెప్పారు.