సాక్షి, న్యూఢిల్లీ : సైనిక పాటవంపై పొరుగున చైనా విపరీతంగా వెచ్చిస్తున్న నేపథ్యంలో 2018-19 బడ్జెట్‌లో రక్షణ రంగానికి కేటాయించిన నిధులపై ఆర్మీ అసంతృప్తి వ్యక్తం చేసింది. డిఫెన్స్ కేటాయింపులపై సైనిక బలగాల వైస్ చీఫ్ లెఫ్టినెంట్ జనరల్ శరత్ చంద్ విస్మయం వ్యక్తం చేశారు. రక్షణ రంగ ఆధునీకరణకు కేటాయించిన నిధులు ఏమాత్రం సరిపోవని..పలు మేకిన్ ఇండియా ప్రాజెక్టులు నిధుల లేమితో కుంటుపడతాయని రక్షణరంగంపై పార్లమెంటరీ కమిటీకి ఆయన తేల్చిచెప్పారు.
ఆధునీకరణకు కేటాయించిన రూ 21,388 కోట్లు ఎందుకూ సరిపోవని..ప్రస్తుత స్కీమ్‌లపైనే రూ 29,033 కోట్ల చెల్లింపులు జరపాల్సిఉందని శరత్ చంద్ పేర్కొన్నారు. ‘2018-19 బడ్జెట్ మా ఆశలను తుంచేసింది..ఇప్పటివరకూ సాధించిన పురోగతికి ఎదురుదెబ్బ తగిలింద’ని ఆయన పెదవివిరిచారు. ప్రస్తుత సైనిక పరికరాల ఆధునీకరణ, యుద్ధ వాహనాల కొనుగోలు నిధుల లభ్యతపై ఆందోళన వ్యక్తం చేశారు. సైనిక బడ్జెట్‌లో 63 శాతం వేతనాల చెల్లింపులకే సరిపోతుందని చెప్పుకొచ్చారు. సైనిక పరికరాల్లో కేవలం 8 శాతం అత్యాధునిక ఫీచర్లతో ఉందని, 68 శాతం పురాతనమైనవని చెప్పారు. ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ పార్లమెంట్‌లో ఇటీవల ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో రక్షణ రంగానికి గత ఏడాది కంటే 7.81 శాతం వృద్ధితో రూ 2.95 లక్షల కోట్లు కేటాయించారు. అయితే 1962 నుంచి జీడీపీలో రక్షణ బడ్జెట్ శాతం పరంగా ఇది అతితక్కువ కావడం గమనార్హం.
Comments
Please login to add a commentAdd a comment