అక్రమ నిల్వదారులపై కేంద్రం కొరడా
* ధరల పెరుగుదలకు బ్లాక్ మార్కెటింగ్ కారణమంటున్న సర్కార్
* బ్లాక్ మార్కెటింగ్ నాన్ బెయిలబుల్ నేరంగా చట్టంలో మార్పు
* రాష్ట్రాలు చర్యలు చేపట్టాలి: పాశ్వాన్
న్యూఢిల్లీ: ఆహార ఉత్పత్తులను అక్రమంగా నిల్వ చేసేవారిపై కొరడా ఝుళిపించడానికి కేంద్రం సిద్ధమవుతోంది. ధరల పెరుగుదలకు అక్రమ నిల్వలే కారణమని భావిస్తున్న కేంద్రం.. నిత్యావసర వస్తువుల చట్టాన్ని మరింత బలోపేతం చేయాలని యోచిస్తోంది. అంతేగాక ధరల స్థిరీకరణ నిధిని ఏర్పాటు చేసి దాని ద్వారా ధరలు అదుపు చేయడంలో రాష్ట్రాలు జోక్యం చేసుకునేలా చర్యలు చేపట్టనుంది.
వర్షాభావ పరిస్థితులను ముందస్తుగా ఊహించి వ్యవసాయ ఉత్పత్తులను బ్లాక్‌మార్కెట్‌కు తరలించడంవల్లే ఉల్లి, ఆలూ ధరలు అమాంతం పెరిగాయని తలపోస్తున్న కేంద్రం.. అలాంటి అక్రమ నిల్వలను ఛేదించాలని రాష్ట్రాలనుకోరింది. శుక్రవారం ఇక్కడ జరిగిన రాష్ట్రాల ఆహార మంత్రుల సమావేశంలో వినియోగదారుల చట్టాన్ని మార్చాలనే ఏకాభిప్రాయానికివచ్చారు. ఈ సమావేశంలో పాల్గొన్న కేంద్ర ఆహార మంత్రి రామ్ విలాస్ పాశ్వాన్ మాట్లాడుతూ.. ధరల పెరుగుదలకు బ్లాక్ మార్కెట్ కారణమన్నారు. అది జాతి వ్యతిరేక పని అన్నారు. రాజకీయాలకు అతీతంగా నిత్యావసర వస్తువుల చట్టాన్ని సమర్థవంతంగా వినియోగించి ధరలను అదుపులో ఉంచాలని రాష్ట్రాలను పాశ్వాన్ కోరారు. చట్టంలో మార్పులు తేవడానికి వారం రోజుల్లోనే కేబినెట్‌లో చర్చిస్తామన్నారు.
వచ్చే మూడు నెలల్లోనే నిత్యావసర వస్తువుల చట్టాన్ని అమలు చేయడానికి చాలా రాష్ట్రాలు అంగీకరించాయని, అయితే తెలంగాణ సహా మరికొన్ని రాష్ట్రాలు ఆరు నెలల సమయాన్ని కోరాయని పాశ్వాన్ తెలిపారు. ప్రస్తుతం 11 రాష్ట్రాలు ఈ చట్టాన్ని అమలు చేస్తున్నాయి. స్థిరీకరణ నిధిపై ఆయన స్పష్టతనివ్వలేదు. కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ మాట్లాడుతూ.. ధరలపై భయపడాల్సిన అవసరం లేదని భరోసా ఇచ్చారు. వ్యవసాయ మంత్రి మాట్లాడుతూ.. ఏ ఆహార వస్తువులకు కొరత లేదని, అక్రమ నిల్వదారులవల్లే ఆ పరిస్థితి తలెత్తిందన్నారు. ధరల పెరుగుదలకు అక్రమ నిల్వలు కారణమని ప్రభుత్వం చెప్పడాన్ని ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ ఎద్దేవా చేసింది. బీజేపీకి ప్రభుత్వ ఏర్పాటు చేసిన తర్వాతే ఈ విషయం బోధపడిందా అంటూ కాంగ్రెస్ ప్రతినిధి రణ్‌దీప్ సుర్జేవాలా ప్రశ్నించారు. ‘మోడీ సర్కార్ ధరల పెరుగుదలతో హాహాకారాలు పెట్టిస్తోంది’ అనే స్లోగన్‌ను ఎన్డీఏ ప్రభుత్వం తీసుకుకోవాలని ఆయన సూచించారు.