మంత్రే నాపై దాడి చేశాడు: గవర్నర్
న్యూఢిల్లీ: రోజుకో మలుపు తిరుగుతోన్న అరుణాచల్ ప్రదేశ్ రాజకీయంలో బుధవారం కీలక పరిణామం చోటుచేసుకుంది. అత్యవసరంగా రాష్ట్రపతి పాలనను ఎందుకు సిఫార్సుచేయాల్సి వచ్చిందో వివరిస్తూ ఆ రాష్ట్ర గవర్నర్ జేపి రాజ్ ఖోవా సుప్రీంకోర్టుకు ఇచ్చిన వివరణలో ఇప్పటివరకు వెలుగుచూడని విషయాలు వెల్లడించారు. మాజీ ముఖ్యమంత్రి నబాం టుకీకి అత్యంత సన్నిహితుడైన ఓ మంత్రి తనపై దాడికి యత్నించాడని గవర్నర్ బాంబు పేల్చారు.
'రాష్ట్రంలో నానాటికీ క్షీణిస్తోన్న శాంతిభద్రతలపై ఎప్పటికప్పుడు కేంద్రానికి నివేదికలు పంపాను. ఇటు రాష్ట్ర ప్రభుత్వానికి కూడా అవసరమైన సూచనలు చేశా. ఆ క్రమంలో డిసెంబర్ 14న సీఎం టుకీ, కొద్దిమంది మంత్రులతో జరిగిన సమావేశంలో ఓ మంత్రి నాపై దాడిచేసేందుకు ప్రయత్నించారు. ఆ చర్య నన్నెంతో కలిచివేసింది. గవర్నర్నైన నాకే అలా జరిగితే ఇక సామాన్యుడి పరిస్థితి ఎలా ఉందో ఊహించుకోవచ్చు. అందుకే అరుణాచల్ ప్రదేశ్ శాంతిభద్రతల దృష్ట్యా రాష్ట్రపతి పాలను సిఫార్సు చేశా' అని గవర్నర్ రాజ్ ఖోవా సుప్రీంకోర్టుకు ఇచ్చిన వివరణలో తెలిపారు.