
వంటపాత్రలు కడిగిన సీఎం
అమృతసర్: ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) నేతలు సోమవారం స్వర్ణ దేవాలయాన్ని దర్శించుకున్నారు. దేవాలయం ప్రాంగణంలో వారు స్వచ్ఛందంగా సామాజిక సేవ చేశారు. కేజ్రీవాల్ వంటశాలలో పాత్రలు కడిగారు. యూత్ మేనిఫెస్టో విడుదల సందర్భంగా జరిగిన తప్పుకు క్షమాపణ కోరేందుకు ఆయన స్వర్ణ దేవాలయానికి వచ్చారు.
సిక్కులు పరమ పవిత్రంగా భావించే 'హర్మాందర్ షాహిబ్' ఫొటోలతో యూత్ మేనిఫెస్టోను ఆప్ విడుదల చేసింది. దీంతో ప్రత్యర్థి పార్టీలు ఆప్పై విమర్శలు గుప్పించాయి. ఈ నేపథ్యంలో ప్రాయశ్చిత్తం చేసుకునేందుకు ఆప్ నేతలు గోల్డెన్ టెంపుల్ లో సేవ చేశారు. కేజ్రీవాల్ తో పాటు పార్టీ సీనియర్ నాయకులు ఆశిష్ కేతన్, లాయర్ హెచ్ ఎస్ పూల్కా, ఎంపీలు భగవంత్ మాన్, సాధు సింగ్, నటులు, ఆప్ సభ్యులు గుల్ పనాంగ్, గురుప్రీత్ గుగ్గీ తదితరులు ఉన్నారు. వీరంతా భక్తులతో కలిసి సహఫంక్తి భోజనాలు చేశారు.