ఆప్ అధినేతకు చుక్కెదురు!
న్యూఢిల్లీ: ఆప్ అధినేత, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కు స్థానిక హైకోర్టులో చుక్కెదురైంది. కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ దాఖలు చేసిన పరువునష్టం కేసులో కేజ్రీవాల్ అభ్యర్థనను హైకోర్టు తోసిపుచ్చింది. బెయిల్ మంజూరు చేయాలని కోరిన కేజ్రీవాల్ కు నిరాశ తప్పలేదు. కేజ్రీవాల్ తో పాటు మరో ఐదుమంది ఆప్ నేతలపై అరుణ్ జైట్లీ పరువునష్టం దావా వేశారు. 2013 వరకూ దాదాపు 13 ఏళ్లపాటు ఢిల్లీ క్రికెట్ బోర్డు(డీడీసీఏ)లో ఉన్నత పదవిలో ఉన్న సమయంలో అరుణ్ జైట్లీ అవినీతికి పాల్పడ్డాడని ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ తో పాటు కొందరు ఆప్ నేతలు బహిరంగంగానే తీవ్ర విమర్శలుచేశారు. తాజాగా ఈ కేసును విచారించిన ఢిల్లీ హైకోర్టు బెయిల్ మంజూరు చేసే ప్రసక్తిలేదని తీర్పు వెల్లడించింది.
రాజకీయ మైలేజీ కోసం కేజ్రీవాల్ తనపై, తన కుటుంబంపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని అది చివరికి ఆప్ నేతలకు నష్టం చేకూరుస్తుందని జైట్లీ పేర్కొన్నారు. సీఎం కేజ్రీవాల్ తో పాటు ఆరోపణలు చేసిన వారిలో ఆప్ నేతలు అశుతోష్, కుమార్ వివ్వాస్, సంజయ్ సింగ్, రాఘవ్ చద్ధా, దీపక్ బాజ్ పాయ్ ఉన్నారు. రాజకీయంగా తమపై కక్ష సాధింపుచర్యల్లో భాగంగానే అరుణ్ జైట్లీ పరువునష్టం దావా వేశారని ఆప్ నేతలు మండిపడుతున్నారు.