సీఎం కూడా బోనులోకి రావాల్సిందే: హైకోర్టు
కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీని క్రాస్ ఎగ్జామిన్ చేసే సమయంలో సీనియర్ న్యాయవాది రామ్ జెఠ్మలానీ చేసిన వ్యాఖ్యలు దారుణంగా ఉన్నాయని కోర్టు వ్యాఖ్యానించింది. ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ సూచనల మేరకే అలాంటి వ్యాఖ్యలు చేస్తే.. ఆయన తప్పనిసరిగా కోర్టుబోనులోకి రావల్సిందేనని జస్టిస్ మన్‌మోహన్ చెప్పారు. జైట్లీ క్రాస్ ఎగ్జామినేషన్ కొనసాగడానికి ముందే ఆయన తన ఆరోపణలను సరైన పద్ధతిలో కోర్టు ముందు ఉంచాలని తెలిపారు. ముఖ్యమంత్రి కోర్టుకు రావాల్సిందేనని స్పష్టం చేశారు.
ఆ వ్యాఖ్యలను రామ్ జెఠ్మలానీ తనంతట తానే చేశారా లేదా కేజ్రీవాల్ సూచనల మేరకు చేశారా అన్న విషయంలో స్పష్టత ఇవ్వాలని జైట్లీ తరఫున వాదించిన సీనియర్ న్యాయవాదులు రాజీవ్ నాయకర్, సందీప్ సేథి కోరారు. 2000 నుంచి 2013 వరకు తాను డీడీసీఏ అధ్యక్షుడిగా ఉన్న సమయంలో ఆర్థిక అక్రమాలకు పాల్పడినట్లు ఆరోపించిన కేజ్రీవాల్, మరో ఐదుగురు ఆప్ నేతలపై అరుణ్ జైట్లీ రూ. 10 కోట్లకు సివిల్ పరువు నష్టం దావా దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఈ కేసులో కేజ్రీవాల్‌తో పాటు ఆప్ నేతలు రాఘవ్ ఛద్దా, కుమార్ విశ్వాస్, అశుతోష్, సంజయ్ సింగ్, దీపక్ బాజ్‌పాయ్ ఉన్నారు.