
న్యూఢిల్లీ : అసెంబ్లీ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ విజయాన్ని ఢిల్లీ ప్రజల విజయంగా ఆ పార్టీ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ అభివర్ణించారు. ఢిల్లీ ఎన్నికల్లో ఆప్ ఘన విజయం సాధించడంపై కేజ్రీవాల్ స్పందించారు. ఆప్ కేంద్ర కార్యాలయంలో ఆప్ కార్యకర్తలతో కేజ్రీవాల్ మాట్లాడారు. ‘భారత్ మాతా కీ జై, ఇక్విలాబ్ జిందాబాద్, వందేమాతరం’ అంటూ తన ప్రసంగాన్ని ప్రారంభించిన కేజ్రీవాల్.. ఢిల్లీ ప్రజలకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు. ఢిల్లీ ప్రజలు సరికొత్త తీర్పు ఇచ్చారని అన్నారు. దేశంలోనే కొత్త రాజకీయ అధ్యాయం తీసుకొచ్చారని తెలిపారు. అభివృద్ధికే ఢిల్లీ ప్రజలు పట్టం కట్టారని చెప్పారు. మూడోసారి తమ కొడుకుపై నమ్మకం ఉంచి భారీ విజయాన్ని కట్టబెట్టారని వ్యాఖ్యానించారు. ఐ లవ్ యూ ఢిల్లీ అని తన ఆనందాన్ని వ్యక్తం చేశారు.
ఇంకా ఆయన మాట్లాడుతూ.. ‘ఢిల్లీ ప్రజలకు తక్కువ ధరకే విద్యుత్ అందించాం. విద్య, వైద్యం కోసం చేసిన కృషి వల్లే ఆప్‌ను ప్రజలు మళ్లీ ఆదరించారు. ఈ రోజు మంగళవారం.. హనుమాన్‌జీ ఢిల్లీ ప్రజలను ఆశీర్వాదించారు. రాబోయే ఐదేళ్లపాటు ప్రజలకు సేవ చేస్తూనే ఉండటానికి హనుమాన్‌జీ మాకు సరైన మార్గాన్ని చూపిస్తూ ఉండాలని ప్రార్థిస్తున్నాము. ఆప్ గెలుపు కోసం కార్యకర్తలు తీవ్రంగా శ్రమించారు. అందరం కలిసి పనిచేస్తూ ఢిల్లీని సుందర నగరంగా తీర్చిదిద్దుదామ’ని పిలుపునిచ్చారు.
Comments
Please login to add a commentAdd a comment