గువాహటి : భారత పౌరులను గుర్తించే ‘నేషనల్ రిజిస్టర్ ఆఫ్ సిటిజెన్స్(ఎన్‌ఆర్‌సీ)’ శనివారం ఉదయం 10 గంటలకు 3.11 కోట్ల మందిని అసోం పౌరులుగా గుర్తించినట్లు పేర్కొంది. అసోంలో మొత్తం 3.29 కోట్ల మంది ప్రజల నుంచి దరఖాస్తులు స్వీకరించగా, వారిలో 3 కోట్ల పదకొండు లక్షల మందిని మాత్రమే భారత పౌరులుగా గుర్తించింది. దీంతో దాదాపు 19 లక్షల మందికి ఎన్‌ఆర్‌సీ తుది జాబితాలో చోటు దక్కకపోవడంతో వారు ఇకపై విదేశీయులుగా గుర్తింపబడనున్నారు.
కాగా అసోం ఎన్‌ఆర్‌సీ తుది జాబితా విడుదల నేపథ్యంలో రాష్ట్రంలో 144 సెక్షన్ విధించారు. ఆందోళనకర పరిస్థితులు తలెత్తే క్రమంలో రాష్ట్ర పోలీసులతో పాటు దాదాపు 218 భద్రతా బలగాలను కేంద్రం అసోంలో మోహరించింది. ఇక ఎన్‌ఆర్‌సీ తుది జాబితా వెల్లడి నేపథ్యంలో రాష్ట్ర ప్రజలు సంయమనం పాటించాల్సిందిగా అసోం ముఖ్యమంత్రి సర్బానంద సోనోవాల్ ప్రజలకు విఙ్ఞప్తి చేశారు. ఎన్‌ఆర్‌సీ జాబితాలో పేరు లేని వారికి మరో అవకాశం ఉంటుందని, వారు విదేశీయుల ట్రిబ్యునల్‌కు అప్పీలు చేసుకోవచ్చని వెల్లడించారు. అయితే వారిలో ఎక్కువ మంది ముస్లింలు, అందులోనూ బెంగాలీ మాట్లాడే ముస్లింలే ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తోంది.
చదవండి: అక్రమ వలసదారులను పంపిస్తాం: అమిత్ షా
భూములు కొల్లగొడుతున్నారని ఆరోపణ!
ప్రభుత్వ ఉద్యోగాలు, విద్యావకాశాలు వలసవచ్చిన విదేశీయులకు వెళుతున్నాయని, స్థానికులైన తమకు రావడం లేదని 1950వ దశకం నుంచే ‘సన్స్ ఆఫ్ సాయిల్’గా పిలుచుకునే 34 శాతం జనాభా కలిగిన అస్సామీ భాష మాట్లాడే అస్సామీలు కొంతకాలంగా ఆందోళన చేస్తున్నారు. తమ వెనకబాటుతనాన్ని ఆసరాగా చేసుకొని వలసదారులు తమ విలువైన భూములను కొల్లగొడుతున్నారంటూ 1960వ దశకం నుంచి ఆందోళన తీవ్రం చేశారు. ఇరుగు పొరుగు రాష్ట్రాల ప్రజలతోపాటు బంగ్లాదేశ్ యుద్ధానంతరం ఆ దేశీయులు అసోంలోకి వలస వచ్చారు. వాస్తవానికి బంగ్లా దేశీయులకన్నా పశ్చిమ బెంగాల్‌కు చెందిన ముస్లింలే అసోంలో ఎక్కువ ఉన్నారని పలు స్వచ్ఛంద సంస్థలు తమ అధ్యయనాల్లో తెలిపాయి. మణిపూర్ నుంచి వలసవచ్చిన వారు కూడా స్థానికంగా భూములు కొనుక్కొని స్థిరపడ్డారని ఆ సంస్థలు వెల్లడించాయి.
పెరిగిన ముస్లింల జనాభా
వలసలు ఎక్కడి నుంచి అన్న ప్రశ్నను పక్కన పెడితే రాష్ట్రంలో హిందువులకన్నా ముస్లింల జనాభా శాతం పెరుగుతూ వచ్చింది. వారిప్పుడు మెజారిటీ స్థాయికి చేరుకున్నారు. ఈ నేపథ్యంలో ఆరెస్సెస్ శక్తులు ఆందోళనల్లో భాగంగా ముస్లింలకు వ్యతిరేకంగా అస్సామీలను రెచ్చ గొడుతూ వచ్చారు. ఆ పర్యవసానంగానే నిల్లీ మారణకాండ, కొక్రాజర్ మారణకాండలు జరిగాయి. ఈ రెండు ఘటనల్లో కూడా ఆరెస్సెస్ నాయకులు అరెస్ట్ అవడం గమనార్హం. హిందువులైనా, ముస్లింలు అయినా తమకు సంబంధం లేదని, విదేశీయులందరిని తమ రాష్ట్రం నుంచి పంపించాలని స్థానిక అస్సామీలు మొదటి నుంచి డిమాండ్ చేస్తున్నారు.
ప్రభుత్వాల తాత్సారం వల్లే!
ఓటు బ్యాంకు రాజకీయాలకు విలువనిచ్చే వరుస ప్రభుత్వాలు తాత్సారం చేస్తు రావడంతో సమస్య జటిలమవుతూ వచ్చింది. అఖిల అసోం విద్యార్థుల సంఘం 1979 నుంచి ఆందోళనను తమ చేతుల్లోకి తీసుకొని నడిపించింది. సమ్మెలు, దిగ్బంధనాలు, సహాయ నిరాకరణ వంటి వివిధ రీతుల్లో కొనసాగిన ఆందోళనలో విధ్వంసాలు, ప్రభుత్వ పతనాలు చోటు చేసుకున్నాయి. రాష్ట్రపతి పాలనలో కూడా పౌర జీవితం స్తంభించిపోయింది. ఆరు సుదీర్ఘ సంవత్సరాల ఆందోళన అనంతరం 1985లో అప్పటి కేంద్రంలోని రాజీవ్ ప్రభుత్వం దిగివచ్చి అస్సాం ఆందోళనకారులతో ఒప్పందం చేసుకుంది. ఆ ఒప్పందం ప్రకారం1951 నుంచి 1961 లోపు వచ్చిన బంగ్లాదేశీయులకు భారత పౌరసత్వం కల్పించాలి. 1971 తర్వాత వచ్చిన వారిని వెనక్కి పంపించాలి. 1961 నుంచి 1971 మధ్యన వలసవచ్చిన వారికి ఓటింగ్ హక్కు మినహా అన్ని పౌర హక్కులు ఉంటాయి. నాటి ఒప్పందంలో 90 శాతం అంశాలు కూడా ఇప్పటికి అమలు కాలేదన్నది ఉద్యమకారుల ఆరోపణ.
బీజేపీ అధికారంలోకి వచ్చాక
2014లో బీజేపీ అధికారంలోకి వచ్చాక సమస్య పరిష్కారం దిశగా చర్యలకు ఉపక్రమించింది. 1985 అస్సాం ఒప్పందంలోని అంశాలను మార్గదర్శకంగా తీసుకొని పౌరులను గుర్తించాల్సిందిగా కోరుతూ 2015లో ఓ ఉన్నతాధికార కమిటీని వేసింది. బంగ్లాదేశ్ విముక్తి యుద్ధానికి ఒక్క రోజు ముందు అంటే, 1971, మార్చి 24వ తేదీ అర్థరాత్రి తర్వాత భారత్‌కు వచ్చిన విదేశీయులందరిని విదేశీయులుగా పరిగణించాలని కమిటీకి కేంద్రం నిర్దేశించింది. దీంతో విదేశాల నుంచి వలస వచ్చిన హిందువులను కాకుండా ముస్లింలనే వెనక్కి పంపించాలంటూ ఆరెస్సెస్ అధినేతలు బీజేపీ ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చారు.
హిందువులకు అనుకూలంగా చట్టం
ఈ నేపథ్యంలో మోదీ ప్రభుత్వం 2016లో ‘సిటిజెన్‌షిప్ (అమెండ్‌మెంట్)బిల్’ను తీసుకొచ్చింది. అందులో బంగ్లాదేశ్, పాకిస్థాన్, అఫ్ఘానిస్తాన్ నుంచి వలస వచ్చిన హిందువులకు భారత పౌరసత్వం ఇచ్చేలా సవరణలు తీసుకొచ్చారు. ఈ బిల్లుకు వ్యతిరేకంగా కూడా అస్సామీలు చేస్తున్న ఆందోళనను పట్టించుకోకుండా ‘నేషనల్ రిజిస్టర్ ఆఫ్ సిటిజెన్స్’ అసోంలోని భారత పౌరుల జాబితాను విడుదల చేసింది. పౌరులుగా గుర్తించడంలో ఎన్నో అక్రమాలు జరిగాయని, ఆధార్ కార్డులు కూడా ఉన్న బెంగాలీ ముస్లింలను గుర్తించలేదని బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఆరోపించారు. ఇది తమ రాష్ట్రంలో చిచ్చు పెట్టవచ్చని, అశాంతి పరిస్థితులకు దారితీయవచ్చని ఆమె ఆందోళన వ్యక్తం చేశారు. బంగ్లాదేశ్‌తో పరస్పర దేశ పౌరుల మార్పిడి ఒప్పందం లేనందున ఆ దేశీయులను వెనక్కి పంపించడం సాధ్యం కాదు. అందుకనే దేశంలోని శరణార్థుల శిబిరాలకు వారిని పంపిస్తామని కేంద్రం చెప్పింది. దీంతో వరుసగా రెండోసారి భారీ మెజారిటీతో అధికారంలోకి వచ్చిన మోదీ సర్కారు నేడు అసోంలోని భారత పౌరుల తుది జాబితాను వెల్లడించింది.
Comments
Please login to add a commentAdd a comment