న్యూఢిల్లీ: మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయికి దేశం కన్నీటితో వీడ్కోలు పలికింది. ‘మహనీయుడా మళ్లీ రా’ అంటూ స్వర్గానికి సాగనంపింది. కుటుంబ సభ్యులు, రాష్ట్రపతి, ప్రధాని తదితర ప్రముఖుల సమక్షంలో అధికార లాంఛనాలతో ఢిల్లీలో వాజ్‌పేయి అంత్యక్రియలు జరిగాయి. లక్షల మంది కార్యకర్తలు, పార్టీ నాయకులు, విపక్ష పార్టీల నేతలు, అభిమానుల అశ్రునయనాల మధ్య ఉద్విగ్న వాతావరణంలో ఈ కార్యక్రమం ముగిసింది.
‘అటల్ బిహారీ అమర్ రహే’ నినాదాలు స్మృతి స్థల్ వద్ద మార్మోగుతుండగా యమునా తీరంలో రాష్ట్రీయ స్మృతి స్థల్‌లో ఆయన దత్త పుత్రిక నమితా కౌల్ భట్టాచార్య.. వాజ్‌పేయి చితికి నిప్పంటించారు. అంతకుముందు, మాజీ ప్రధానికి గౌరవసూచకంగా 21 గన్‌సెల్యూట్‌తో నివాళులర్పించారు. రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్, ప్రధాని నరేంద్ర మోదీ, అగ్రనేత ఎల్‌కే అడ్వాణీ, కాంగ్రెస్ చీఫ్ రాహుల్ గాంధీ, మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్, వివిధ పార్టీల నేతలు, ముఖ్యమంత్రులు తదితరులు అంత్యక్రియలకు హాజరయ్యారు. భూటాన్ రాజు, పాక్ ప్రతినిధి, బంగ్లాదేశ్ విదేశాంగ మంత్రి సహా పలుదేశాల దౌత్యవేత్తలు కూడా అంత్యక్రియల్లో పాల్గొన్ని వాజ్‌పేయికి ఘనంగా నివాళులర్పించారు.
ప్రముఖులంతా స్మృతిస్థల్‌లోనే..
వాజ్‌పేయి అంత్యక్రియల్లో రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, ప్రధాని మోదీ, బీజేపీ అగ్రనేత అడ్వాణీ, పార్టీ చీఫ్ అమిత్ షా సహా రాజకీయ మహామహులంతా పాల్గొన్నారు. కేంద్ర మంత్రులు రాజ్‌నాథ్ సింగ్, సుష్మా స్వరాజ్, నిర్మలా సీతారామన్, పీయుష్ గోయల్, హర్ష వర్ధన్, రాంవిలాస్ పాశ్వాన్, శ్రీపాద్ నాయక్‌లు.. ఆర్మీ చీఫ్ జనరల్ బిపిన్ రావత్, వైమానిక దళ చీఫ్ ఎయిర్ చీఫ్‌మార్షల్ బీరేందర్ సింగ్ ధనోవా, నౌకాదళ చీఫ్ అడ్మిరల్ సునీల్ లాంబాలు కూడా మాజీ ప్రధానికి త్రివిధ దళాల తరఫున ఘనంగా నివాళులర్పించారు. ముఖ్యమంత్రులు యోగి ఆదిత్యనాథ్, నితీశ్ కుమార్, శివ్‌రాజ్ సింగ్ చౌహాన్, విజయ్ రూపానీ కూడా ఉద్వేగంగా తమ అభిమాన నేతకు వీడ్కోలు పలికారు.
వీరితోపాటు భూటాన్ రాజు జిగ్మే ఖేసర్ నాంగెల్ వాంగ్‌ఛుక్, అఫ్గాన్ రాజకీయ ప్రముఖుడు హమీద్ కర్జాయ్, బంగ్లాదేశ్ విదేశాంగ మంత్రి అబ్దుల్ హసన్ మహమూద్, శ్రీలంక, నేపాల్ విదేశాంగ మంత్రులు లక్ష్మణ్ కిరియెల్లా, ప్రదీప్ గ్యావాలి, పాకిస్తాన్ తాత్కాలిక సమాచార మంత్రి సయద్ జఫర్ అలీ సహా సార్క్ దేశాల ప్రతినిధులు అంత్యక్రియల్లో పాల్గొని వాజ్‌పేయికి నివాళులర్పించారు. ఆరెస్సెస్ చీఫ్ మోహన్ భాగవత్, ప్రధాన కార్యదర్శి భయ్యాజీ జోషి, బీజేపీ అగ్రనేత మురళీ మనోహర్ జోషి, అకాలీదళ్ అగ్రనేత ప్రకాశ్ సింగ్ బాదల్, కాంగ్రెస్ నేతలు గులాంనబీ ఆజాద్, రాజ్‌బబ్బర్, జమ్మూకశ్మీర్ మాజీ సీఎం మెహబూబా ముఫ్తీ తదితరులు కూడా అంత్యక్రియలకు హాజరయ్యారు. బంగ్లాదేశ్ ముక్తి పోరాటానికి వాజ్‌పేయి ఇచ్చిన మద్దతును, చేసిన సహాయాన్ని మరిచిపోలేమని ఆ దేశ విదేశాంగ మంత్రి పేర్కొన్నారు.
పార్టీ కార్యాలయంలో నివాళులు
అంతకుముందు, శుక్రవారం ఉదయం 10 గంటల వరకు కృష్ణ మీనన్ మార్గ్‌లోని వాజ్‌పేయి నివాసంలో ఆయన పార్థివదేహానికి అభిమానులు, కమ్యూనిస్టులు సహా వివిధ పార్టీల నేతలు, పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు పుష్పాంజలి ఘటించారు. ఐదు కిలోమీటర్ల దూరం చేరుకునేందుకు దాదాపు గంట పట్టింది. 11 గంటల సమయంలో ఆయన పార్థివ దేహాన్ని దీన్‌దయాళ్ మార్గ్‌లోని బీజేపీ ప్రధాన కార్యాలయానికి తీసుకొచ్చారు. ప్రధాని మోదీ, బీజేపీ చీఫ్ అమిత్ షా, కేంద్ర మంత్రులు రాజ్‌నాథ్, సుష్మాస్వరాజ్, తదితరులు ఉదయాన్నే పార్టీ కార్యాలయానికి చేరుకుని పార్థివదేహం కోసం గేటు వద్ద వేచి చూశారు. అనంతరం పార్టీ హాల్‌లో రెండున్నర గంటలపాటు కార్యకర్తల సందర్శనార్థం ఉంచారు.
ఇక్కడ కూడా ప్రధాని సహా పలువురు పార్టీ ప్రముఖులు నివాళులర్పించిన అనంతరం కార్యకర్తలను లోపలకు అనుమతించారు. కార్యాలయం వెలుపల రెండు పెద్ద ఎల్‌ఈడీ స్క్రీన్‌లను ఏర్పాటుచేసి ప్రత్యక్షప్రసారాన్నందించారు. వేల సంఖ్యలో కార్యకర్తలు ఢిల్లీతోపాటు చుట్టుపక్కల ప్రాంతాలనుంచి తరలిరావడంతో పార్టీ కార్యాలయం ఇసుకేస్తే రాలనంత జనంతో నిండిపోయింది. బీజేపీ ప్రధాన కార్యాలయంలో సీపీఐ నేత డి. రాజా, సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరీ, బిహార్ సీఎం నితీశ్ కుమార్ తదితర నేతలు వాజ్‌పేయికి నివాళులర్పించారు. మధ్యాహ్నం ఒకటిన్నర ప్రాంతంలో కార్యకర్తలు, అభిమానుల సందర్శనను నిలిపివేసి అంతిమయాత్రను ప్రారంభించారు.
ఉక్కపోతగా ఉన్నా..
పుష్పాలతో అలంకరించిన గన్ క్యారేజ్ వాహనంపై వాజ్‌పేయి పార్థివదేహం ఉన్న బాక్స్‌ను ఉంచారు. దీనికి ఆర్మీ వాహనంతో అనుసంధానం చేసిన తర్వాత పార్టీ కార్యాలయం నుంచి అంతిమయాత్ర ప్రారంభమైంది. వాతావరణం ఉక్కపోతగా ఉన్నప్పటికీ వేల మంది అంతిమయాత్రలో పాల్గొన్నారు. కృష్ణ మీనన్ మార్గ్ సహా యాత్ర కొనసాగే మార్గాలన్నింటినీ ఓవైపు వాహనాలను అనుమతించి రెండోవైపు యాత్రకోసం ఖాళీగా ఉంచారు. దీన్ దయాళ్ మార్గ్ నుంచి ఐపీ మార్గ్, బహదూర్‌షా జఫర్ మార్గ్, ఢిల్లీ గేట్, నేతాజీ సుభాష్ మార్గ్, నిషాద్రజ్ మార్గ్, శాంతివన్, రాజ్‌ఘాట్ మీదుగా రాష్ట్రీయ స్మృతి స్థల్ వరకు అంతిమయాత్ర కొనసాగింది. స్మృతిస్థల్‌కు చేరుకునేందుకు రెండున్నర గంటలు పట్టింది. 4 గంటలకు అంత్యక్రియలు ప్రారంభం కావాల్సి ఉన్నా ఆలస్యమై.. ఐదున్నరకు పూర్తయ్యాయి. ‘ఇండియా సెల్యూట్స్ అటల్‌జీ’ అని మోదీ ట్వీట్ చేశారు.
సూరత్‌లో మాజీ ప్రధానికి నివాళులర్పిస్తున్న గురుకుల పాఠశాల విద్యార్థులు
Comments
Please login to add a commentAdd a comment