
ఉత్కల్ ప్రమాదం.. ఆడియో క్లిప్ వైరల్
న్యూఢిల్లీ: ఉత్తర ప్రదేశ్ లో కళింగ ఉత్కల్ ఎక్స్ ప్రెస్ ప్రమాదంపై దర్యాప్తు ముమ్మరం చేశారు అధికారులు. ప్రమాదానికి ట్రాక్ నిర్వహణ పనులే కారణమని అనుమానాలు వ్యక్తం అవుతున్న నేపథ్యంలో ఓ ఆడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
సిబ్బంది నిర్లక్ష్యమే ప్రమాదానికి కారణమంటూ ఇద్దరు అధికారులు మాట్లాడుకోవటం 15 నిమిషాల ఆ ఆడియో క్లిప్‌లో స్పష్టంగా ఉంది. ‘ఘటనా స్థలంలో ఓవైపు పనులు జరుగుతుండగా, అప్రమత్తంగా ఉండాల్సిన సిబ్బంది నిర్లక్ష్యం వహించారని, పెట్రోలింగ్ కూడా సరిగ్గా నిర్వహించలేదని’ అందులో ఓ వ్యక్తి తెలిపారు. ‘‘వెల్డింగ్ పనులు చేసిన సిబ్బంది ఒక చోట పట్టా కూడా బిగించకుండానే వెళ్లిపోయారు. బహుశా అదే ప్రమాదానికి కారణమై ఉంటుంది’’ అని అభిప్రాయం వ్యక్తం చేశారు.
అలాగే పట్టాల పై కొన్ని పరికరాలను వదిలి వెళ్లినట్లు కూడా వాళ్లు మాట్లాడుకున్నారు. అలాంటి సమయంలో కనీసం ఎర్ర జెండా అయినా వాళ్లు (సిబ్బంది) ఉంచాల్సింది అని ఆయన చెబుతుండటం గమనించవచ్చు. ఇక ఘటన బాధ్యులుగా జూనియర్ ఇంజనీర్‌తోపాటు అధికారులందరూ విచారణ ఎదుర్కునే అవకాశం ఉందంటూ మరో అధికారి మాట్లాడటం ఆ క్లిప్‌లో ఉంది. మొత్తానికి నిర్లక్ష్యమే ప్రమాదానికి కారణమన్న స్పష్టత ఇచ్చిన ఈ అధికారుల సంభాషణ వైరల్ అవుతుండగా, ఆడియో క్లిప్‌పై విచారణ చేపట్టినట్లు రైల్వే బోర్డు అధికారి మహ్మద్ జమ్‌షెడ్ తెలిపారు.
పూరి నుంచి హరిద్వార్ వెళ్తున్న కళింగ ఉత్కల్ ఎక్స్‌ప్రెస్ శనివారం సాయంత్రం ఉత్తర ప్రదేశ్ ముజఫర్ నగర్, ఖతౌలి వద్ద 14 బోగీలు పట్టాలు తప్పటంతో 24 మంది మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో ప్రాథమిక విచారణ అనంతరం నలుగురు రైల్వే అధికారులను సస్పెండ్ చేశారు.