
అతనే ఆమె డబ్బంతా కాజేశాడు
చెన్నై: ప్రముఖ భరతనాట్య కళాకారిణి శైలజ బ్యాంకు అకౌంటులో కోట్ల రూపాయల అక్రమాలకు పాల్పడిన మాజీ ఉద్యోగిని సెంట్రల్ క్రైం బ్రాంచ్ పోలీసులు ఢిల్లీలో అరెస్టు చేశారు. కేరళకు చెందిన ప్రముఖ భరతనాట్య, కూచిపూడి కళాకారిణి శైలజ. ఈమె అంతర్జాతీయ స్థాయిలో ప్రదర్శనలు ఇస్తూ ఉంటారు. ప్రస్తుతం చెన్నై నందనంలో కుటుంబంతోపాటు నివసిస్తున్నారు. ఇటీవల ఆమె కలైమామణి అవార్డు అందుకున్నారు. అవే వర్గీస్ అనే వ్యక్తి అనేక ఏళ్లపాటు ఆమెతో పనిచేశాడు. ఇతను నమ్మకంగా ఉండటంతో శైలజ బ్యాంకు అకౌంట్లను చూస్తుండేవాడు.
ఇటీవలె శైలజ బ్యాంకు అకౌంటులో అనేక కోట్ల రూపాయల మోసం జరిగినట్టు తెలిసింది. దీంతో అవే వర్గీస్‌ను ఉద్యోగం నుంచి శైలజ తొలగించినట్లు సమాచారం. అంతేకాకుండా దీనిపై చెన్నై పోలీసు కమిషనర్ కార్యాలయంలో కొన్ని రోజుల క్రితం అవే వర్గీస్‌పై ఫిర్యాదు కూడా చేశారు. దీంతో పోలీసు కమిషనర్ ఎ కె విశ్వనాథన్ ఉత్తర్వులమేరకు సెంట్రల్ క్రైం బ్రాంచ్ పోలీసులు కేసు నమోదు చేసి విచారణ ప్రారంభించగా వర్గీస్ పరారయ్యాడు. శైలజ బ్యాంకు అకౌంట్‌ను పోలీసులు పరిశీలించగా కొన్ని కోట్ల రూపాయలు అతను స్వాహా చేసినట్లు తెలిసింది. అతడి సెల్‌ఫోన్ ఆధారంగా ఢిల్లీలో ఉన్నట్లు తెలియడంతో పోలీసులు గత వారం ఢిల్లీకి చేరుకున్నారు. అక్కడ ఢిల్లీ పోలీసుల సాయంతో అరెస్టు చేశారు. అతని వద్ద పోలీసులు విచారణ జరపగా నగదును అపహరించి తన ఖాతాలో వేసుకున్నట్లు తెలిపారు. దీంతో పోలీసులు అతన్ని కోర్టులో హాజరు పరచి పుళల్ జైలుకు తరలించారు.