40 ఏళ్ల క్రితం సమాజం ఛీత్కారాల మధ్య కబడ్డీ ఆటను ఎంచుకుంది. జాతీయ స్థాయి క్రీడాకారిణిగా ఎదిగింది. వివక్షలను ఎదుర్కొంది. అవార్డులను గెలుచుకుంది. వందలాది అమ్మాయిలను చాంపియన్లుగా మలిచి అంతర్జాతీయ కబడ్డీ కోచ్‌గా పేరొందింది మహారాష్ట్రలోని నాసిక్ వాసి శైలజా జైన్. ఆటుపోట్ల మధ్య ౖధైర్యంగా ఎంచుకున్న మార్గం గురించి ఎన్నో విషయాలను పంచుకుంటుంది.
‘‘నా చిన్నతనం అంతా నాగపూర్‌లో గడిచింది. అమ్మ టీచర్, నాన్న బ్యాంకు ఆఫీసర్. అమ్మకు క్రీడలంటే చాలా ఇష్టం. ఆ రోజుల్లోనే చీర కట్టుకుని కబడ్డీ ఆడేది. నేను కూడా ఆమె నుండి ఈ గుణాన్ని వారసత్వంగా పొందాను. అమ్మనాన్నలకు నాతో కలిపి నలుగురం ఆడపిల్లలం సంతానం. కానీ, నేనే క్రీడాకారిణి అయ్యాను. స్కూల్లో జరిగే క్రికెట్, ఫుట్‌బాల్, ఖోఖో, కబడ్డీ.. ప్రతి పోటీలో పాల్గొనేదానిని. ఒక నెల రోజులు ఇంటికి దూరంగా క్రికెట్ క్యాంపులో చేరడానికి వెళ్లాను. ఈ రోజుల్లో ఎలాంటి అడ్డంకులు లేవు కానీ, యాభై ఏళ్ల క్రితం అంటే ఆడపిల్లలు ఆడుకోవడం అంత సులువు కాదు.
హాఫ్ ప్యాంట్
‘అమ్మాయి ఎదిగింది. హాఫ్ ప్యాంట్ వేసుకొని మగపిల్లల్లా ఆడుకోవడానికి బయటకు వెళుతోంది చూడు’ అని స్థానికులు చెప్పుకునేవారు. కానీ, మా అమ్మనాన్నలు ఎప్పుడూ అలాంటి మాటలు పట్టించుకోలేదు. నాకు పూర్తి స్వేచ్ఛను ఇవ్వడమే కాదు, సపోర్ట్‌గా నిలిచారు. కబడ్డీ క్లబ్‌లో చేరడంతో నా జీవితమే మారిపోయింది.
మొదటి మార్పు
నాగపూర్‌లోనే మరాఠా లాన్సర్స్ పేరుతో కబడ్డీ క్లబ్ ఉండేది. అక్కడి కోచ్ నా స్నేహితుల్లో ఒకరిని ప్రాక్టీస్‌కు పిలిచారు. నన్ను పిలవలేదు. ఆ రోజు చాలా ఏడ్చాను. నాకు అవకాశం రాదనుకున్నాను. కానీ నేరుగా క్లబ్‌కి వెళ్లి, కోచ్‌తో నాకూ ఆడాలని ఉందని చెప్పాను. వారి అనుమతితో క్లబ్‌లో చేరిపోయాను. అటు నుంచి మిగతా క్రీడలను వదిలేసి కబడ్డీపైనే దృష్టి పెట్టాను. గ్రౌండ్‌కు చేరుకోవడంలో నేనే ముందుండేదానిని. వేరే వాళ్లు రాకముందే గ్రౌండ్ ఊడ్చటం, నీళ్లు చల్లడం, మార్కింగ్ చేయడం మొదలైన పనులన్నీ చేసేదాన్ని.
చీకటి దారుల గుండా..
ఇంటికి గ్రౌండ్‌కి మధ్య 12 కి.మీ దూరం. అందుకే ఇంట్లో సైకిల్ కావాలని పట్టుబట్టాను. సైకిల్‌పై కాలేజీకి, ప్రాక్టీస్ కోసం క్లబ్‌కు వెళ్లేదాన్ని. దీని కోసం నాగ్‌పూర్‌లోని సివిల్ లైన్ ఏరియాను దాటాల్సి వచ్చేది. సాయంత్రం 5 గంటల నుంచే సివిల్ లైన్స్ మొత్తం నిర్మానుష్యంగా మారేవి. కానీ, నేను 8 గంటలకు చీకట్లో అదే మార్గంలో సైకిల్‌పై ఇంటికి వచ్చేదాన్ని. ఎప్పుడూ భయం అనిపించలేదు. ఎవరైనా వేధించినప్పుడు నడిరోడ్డుపై కొట్టి గుణపాఠం చెప్పేదాన్ని.
చిన్న చిన్న అవార్డులైనా...
యూనివర్శిటీ, రాష్ట్ర, జాతీయ స్థాయిల్లో కబడ్డీ పోటీల్లో పాల్గొన్నాను. చిన్న చిన్న అవార్డులు వచ్చినా గర్వంగా ఫీలయ్యేదాన్ని. నాకు నేనే అత్యుత్తమ ప్లేయర్‌ననే విశ్వాసం పెరుగుతుండేది. పెళ్లయ్యే వరకు అదే మైదానంలో రోజూ ప్రాక్టీస్ చేసేదాన్ని. పెళ్లి తర్వాత నాసిక్‌కు వచ్చాను. అప్పటికే చదువు పూర్తయింది కాబట్టి ఉద్యోగం వేటలో ఉన్నాను. ఆ సమయంలో రాష్ట్ర కోచ్‌ని కలిశాను. కోచ్ అవడానికి ‘నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ స్పోర్ట్స్’ నుంచి కోర్సు చేయాలని సలహా ఇచ్చారు. బెంగళూరు వెళ్లి కోర్సు పూర్తి చేశాను. అక్కడి నుంచి తిరిగొచ్చాక క్రీడా విభాగంలో కోచ్ ఉద్యోగం వచ్చింది.
పాఠశాల స్థాయి నుంచి...
కబడ్డీ, ఖోఖో ఆటలకు నేనే కోచ్‌ని. పాఠశాల స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు క్రీడాకారులను సిద్ధం చేయడం ప్రారంభించాను. నా శిక్షణలో అమ్మాయిలు అవార్డులు గెలుచుకోవడం చూసి నాలో ధైర్యం కూడా పెరుగుతూ వచ్చింది. శిక్షణ కోసం ఇతర ప్రాంతాలకు వెళ్లాల్సి వచ్చింది. అందుకు మా అత్తింటివారు ఎలాంటి అడ్డు చెప్పలేదు. స్పోర్ట్స్ ఆఫీసర్‌గా ప్రమోషన్ వచ్చినప్పుడు ఆరు నెలల్లోనే దానిని తిరిగి ఇచ్చేశాను. ప్రమోషన్ తీసుకోకపోతే భవిష్యత్తులో చాలా నష్టపోతారని చెప్పారు. కానీ, ప్రమోషన్ పేరుతో ఆఫీసులో కూర్చొని ఉండటం నా వల్ల అయ్యే పని కాదు. గ్రౌండ్‌లోనే నా భవిష్యత్తు ఉందని బలంగా నమ్మేదాన్ని. అందుకే, తక్కువ డబ్బు వచ్చినా గ్రౌండ్‌ను వదలలేదు.
డిప్రెషన్‌ను అధిగమించి..
నా దగ్గర శిక్షణ తీసుకున్న 400 మంది అమ్మాయిలకు జాతీయ స్థాయిలో ఆడే అవకాశం వచ్చింది. రాష్ట్ర ప్రభుత్వం నుంచి అవార్డులు అందుకున్నాను. రికార్డ్ ఉన్నప్పుటికీ టీమ్ ఇండియా టీ షర్ట్ ధరించే అవకాశం రాలేదు. అంతర్జాతీయ మ్యాచ్‌లకు ఎంపికైనా అవకాశాన్ని అందిపుచ్చుకోవడానికి అడుగడుగునా అవరోధాలు. దీంతో డిప్రెషన్‌కు గురయ్యాను. కొన్నాళ్లు ఏం చేయాలో అర్థం కాని స్థితి. 2008లో జూనియర్ ఆసియా చాంపియన్‌షిప్‌లో కోచ్‌గా అవకాశం వచ్చింది. ఫలితాలు బాగుండటంతో ఆ తర్వాత అంతర్జాతీయ జట్టుకు కోచ్‌గా వెళ్తానని అందరికీ చెప్పాను. నా కల నెరవేరుతుందని అనుకున్నాను. కానీ, నా ఆశలు మళ్లీ నేలకు జారాయి. అదే ఏడాది మళ్లీ ప్రమోషన్ వచ్చింది. 2014 వరకు అదే జాబ్‌లో కొనసాగి రిటైరయ్యాను. అసంతృప్తి అలాగే ఉండిపోయింది.
అంతర్జాతీయంగా అవకాశాలు...
రిటైరయ్యాక ఇరాన్ నుండి బాలికల జట్టుకు కోచ్‌గా ఉండమని ఆహ్వానం అందింది. మా ఇంట్లోవాళ్లు ఆ దేశంలో ఉండటం సులభం కాదన్నారు. ఒకసారి పాస్‌పోర్ట్‌పై ఇరాన్ ముద్ర పడితే ఇక అంతే అన్నారు. కానీ, అవేవీ పట్టించుకోకుండా వెళ్లాను. అలా మొదలైన నా ప్రయాణం రెండేళ్లకు జకార్తాలో జరిగిన ఆసియా క్రీడల వరకు వెళ్లింది. అక్కడి అలవాట్లు, తిండి, భాష, వేషధారణ అన్నీ మనకు భిన్నమైనవే. అయినా లభించిన అవకాశాన్ని బంగారంగా మార్చుకునే ధైర్యాన్ని పెంచుకున్నాను. నేను జైన్ కమ్యూనిటీకి చెందినదానిని, మాంసాహారం తినలేను. ఇరాన్‌లో శాకాహారం దొరకడం చాలా కష్టం. కోచ్‌గా ఉంటూ నాన్‌వెజ్ తినకుండా ఉండటం ఎలా సాధ్యం అని అక్కడివాళ్లు ఆశ్చర్యపోయేవారు. భారతదేశానికి వచ్చినప్పుడు నా ఆహారానికి కావల్సిన పదార్థాలను తీసుకెళ్లేదాన్ని. కానీ, ఆహారం గురించి పై అధికారులకు ఎప్పుడూ కంప్లైంట్ చేయలేదు. రాని భాషలు నేర్చుకున్నాను. టీమ్‌తో అనుబంధాలను పెంచుకున్నాను. ఏడాదిన్నరలో 14 క్యాంపులు నిర్వహించాను.
జకార్తా నుంచి భారత్‌కు
జకార్తా ఆసియా క్రీడల్లో నా జట్టు సెమీఫైనల్స్‌కు చేరుకొని భారత జట్టుతో ఫైనల్స్‌కు ఎంపికయ్యింది. ఆ మ్యాచ్‌లో నేను చాలా ఒత్తిడికి గురయ్యాను. నా దేశానికి ప్రత్యర్ధిగా నేనే ఉన్నాను... దీంతో తిండి, నిద్రకు దూరమయ్యాను. కానీ, నా బాధ్యత గుర్తుకొచ్చింది. నా జట్టు అమ్మాయిలను ప్రోత్సహించాను. నేను చెప్పిన ట్రిక్కులు పాటించి, గెలుపొందారు. స్వర్ణం గెలిచిన తర్వాత అమ్మాయిలు గ్రౌండ్‌లో ఉత్సాహంగా జెండాతో పరుగులు ప్రారంభించారు. నా చేయి పట్టుకుని ‘మేడమ్ రండీ.. మీ వల్లే మాకు బంగారు పతకం వచ్చింది..’ అంటూ ఆనందాన్ని వ్యక్తం చేశారు. కానీ, వారితో ‘నా కాంట్రాక్ట్ మిమ్మల్ని ఫైనల్ మ్యాచ్ వరకే, అది పూర్తయిపోయింది. నా భారత ఆటగాళ్లు బాధపడుతుంటే, నేను సంబరాలు చేసుకోలేను’ అని చెప్పాను. తొలిసారి భారత్ ఓడిపోయి ఇరాన్ గెలిచి చరిత్ర సృష్టించింది. ఆ చరిత్రలో నా పేరు కూడా నమోదయ్యింది.
స్వదేశానికి...
‘నా దేశాన్ని గెలిపించుకోవాలే కానీ, పరాయి దేశాన్ని కాదు’ అనే ఆలోచనతో తిరిగి నాసిక్ వచ్చేశాను. ఇక్కడ నుంచి 150 కిలోమీటర్ల దూరంలో నివసిస్తున్న గిరిజన బాలికలకు కబడ్డీలో శిక్షణ ఇస్తున్నాను. వారిని నా అకాడమీకి తీసుకువచ్చి డైట్ కిట్స్ ఇస్తుంటాను. ఇందుకు వనవాసి కళ్యాణ్ ఆశ్రమం నుంచి సహాయం అందుతుంది. గిరిజన బాలికలు క్రీడల్లో చాలా బాగా రాణిస్తున్నారు. దేశానికి మంచి క్రీడాకారిణులు లభించేలా వారిని తీర్చిదిద్దడంలో ఇప్పుడు నేను చాలా బిజీగా ఉన్నాను’’ అని వివరించారు శైలజా జైన్.
Comments
Please login to add a commentAdd a comment