National level player
-
కబడ్డీ.. కబడ్డీ... గెలిచింది
40 ఏళ్ల క్రితం సమాజం ఛీత్కారాల మధ్య కబడ్డీ ఆటను ఎంచుకుంది. జాతీయ స్థాయి క్రీడాకారిణిగా ఎదిగింది. వివక్షలను ఎదుర్కొంది. అవార్డులను గెలుచుకుంది. వందలాది అమ్మాయిలను చాంపియన్లుగా మలిచి అంతర్జాతీయ కబడ్డీ కోచ్‌గా పేరొందింది మహారాష్ట్రలోని నాసిక్ వాసి శైలజా జైన్. ఆటుపోట్ల మధ్య ౖధైర్యంగా ఎంచుకున్న మార్గం గురించి ఎన్నో విషయాలను పంచుకుంటుంది. ‘‘నా చిన్నతనం అంతా నాగపూర్‌లో గడిచింది. అమ్మ టీచర్, నాన్న బ్యాంకు ఆఫీసర్. అమ్మకు క్రీడలంటే చాలా ఇష్టం. ఆ రోజుల్లోనే చీర కట్టుకుని కబడ్డీ ఆడేది. నేను కూడా ఆమె నుండి ఈ గుణాన్ని వారసత్వంగా పొందాను. అమ్మనాన్నలకు నాతో కలిపి నలుగురం ఆడపిల్లలం సంతానం. కానీ, నేనే క్రీడాకారిణి అయ్యాను. స్కూల్లో జరిగే క్రికెట్, ఫుట్‌బాల్, ఖోఖో, కబడ్డీ.. ప్రతి పోటీలో పాల్గొనేదానిని. ఒక నెల రోజులు ఇంటికి దూరంగా క్రికెట్ క్యాంపులో చేరడానికి వెళ్లాను. ఈ రోజుల్లో ఎలాంటి అడ్డంకులు లేవు కానీ, యాభై ఏళ్ల క్రితం అంటే ఆడపిల్లలు ఆడుకోవడం అంత సులువు కాదు. హాఫ్ ప్యాంట్ ‘అమ్మాయి ఎదిగింది. హాఫ్ ప్యాంట్ వేసుకొని మగపిల్లల్లా ఆడుకోవడానికి బయటకు వెళుతోంది చూడు’ అని స్థానికులు చెప్పుకునేవారు. కానీ, మా అమ్మనాన్నలు ఎప్పుడూ అలాంటి మాటలు పట్టించుకోలేదు. నాకు పూర్తి స్వేచ్ఛను ఇవ్వడమే కాదు, సపోర్ట్‌గా నిలిచారు. కబడ్డీ క్లబ్లో చేరడంతో నా జీవితమే మారిపోయింది. మొదటి మార్పు నాగపూర్‌లోనే మరాఠా లాన్సర్స్ పేరుతో కబడ్డీ క్లబ్ ఉండేది. అక్కడి కోచ్ నా స్నేహితుల్లో ఒకరిని ప్రాక్టీస్‌కు పిలిచారు. నన్ను పిలవలేదు. ఆ రోజు చాలా ఏడ్చాను. నాకు అవకాశం రాదనుకున్నాను. కానీ నేరుగా క్లబ్‌కి వెళ్లి, కోచ్‌తో నాకూ ఆడాలని ఉందని చెప్పాను. వారి అనుమతితో క్లబ్లో చేరిపోయాను. అటు నుంచి మిగతా క్రీడలను వదిలేసి కబడ్డీపైనే దృష్టి పెట్టాను. గ్రౌండ్‌కు చేరుకోవడంలో నేనే ముందుండేదానిని. వేరే వాళ్లు రాకముందే గ్రౌండ్ ఊడ్చటం, నీళ్లు చల్లడం, మార్కింగ్ చేయడం మొదలైన పనులన్నీ చేసేదాన్ని. చీకటి దారుల గుండా.. ఇంటికి గ్రౌండ్‌కి మధ్య 12 కి.మీ దూరం. అందుకే ఇంట్లో సైకిల్ కావాలని పట్టుబట్టాను. సైకిల్‌పై కాలేజీకి, ప్రాక్టీస్ కోసం క్లబ్‌కు వెళ్లేదాన్ని. దీని కోసం నాగ్‌పూర్‌లోని సివిల్ లైన్ ఏరియాను దాటాల్సి వచ్చేది. సాయంత్రం 5 గంటల నుంచే సివిల్ లైన్స్ మొత్తం నిర్మానుష్యంగా మారేవి. కానీ, నేను 8 గంటలకు చీకట్లో అదే మార్గంలో సైకిల్‌పై ఇంటికి వచ్చేదాన్ని. ఎప్పుడూ భయం అనిపించలేదు. ఎవరైనా వేధించినప్పుడు నడిరోడ్డుపై కొట్టి గుణపాఠం చెప్పేదాన్ని. చిన్న చిన్న అవార్డులైనా... యూనివర్శిటీ, రాష్ట్ర, జాతీయ స్థాయిల్లో కబడ్డీ పోటీల్లో పాల్గొన్నాను. చిన్న చిన్న అవార్డులు వచ్చినా గర్వంగా ఫీలయ్యేదాన్ని. నాకు నేనే అత్యుత్తమ ప్లేయర్‌ననే విశ్వాసం పెరుగుతుండేది. పెళ్లయ్యే వరకు అదే మైదానంలో రోజూ ప్రాక్టీస్ చేసేదాన్ని. పెళ్లి తర్వాత నాసిక్‌కు వచ్చాను. అప్పటికే చదువు పూర్తయింది కాబట్టి ఉద్యోగం వేటలో ఉన్నాను. ఆ సమయంలో రాష్ట్ర కోచ్‌ని కలిశాను. కోచ్ అవడానికి ‘నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ స్పోర్ట్స్’ నుంచి కోర్సు చేయాలని సలహా ఇచ్చారు. బెంగళూరు వెళ్లి కోర్సు పూర్తి చేశాను. అక్కడి నుంచి తిరిగొచ్చాక క్రీడా విభాగంలో కోచ్ ఉద్యోగం వచ్చింది. పాఠశాల స్థాయి నుంచి... కబడ్డీ, ఖోఖో ఆటలకు నేనే కోచ్‌ని. పాఠశాల స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు క్రీడాకారులను సిద్ధం చేయడం ప్రారంభించాను. నా శిక్షణలో అమ్మాయిలు అవార్డులు గెలుచుకోవడం చూసి నాలో ధైర్యం కూడా పెరుగుతూ వచ్చింది. శిక్షణ కోసం ఇతర ప్రాంతాలకు వెళ్లాల్సి వచ్చింది. అందుకు మా అత్తింటివారు ఎలాంటి అడ్డు చెప్పలేదు. స్పోర్ట్స్ ఆఫీసర్‌గా ప్రమోషన్ వచ్చినప్పుడు ఆరు నెలల్లోనే దానిని తిరిగి ఇచ్చేశాను. ప్రమోషన్ తీసుకోకపోతే భవిష్యత్తులో చాలా నష్టపోతారని చెప్పారు. కానీ, ప్రమోషన్ పేరుతో ఆఫీసులో కూర్చొని ఉండటం నా వల్ల అయ్యే పని కాదు. గ్రౌండ్‌లోనే నా భవిష్యత్తు ఉందని బలంగా నమ్మేదాన్ని. అందుకే, తక్కువ డబ్బు వచ్చినా గ్రౌండ్‌ను వదలలేదు. డిప్రెషన్‌ను అధిగమించి.. నా దగ్గర శిక్షణ తీసుకున్న 400 మంది అమ్మాయిలకు జాతీయ స్థాయిలో ఆడే అవకాశం వచ్చింది. రాష్ట్ర ప్రభుత్వం నుంచి అవార్డులు అందుకున్నాను. రికార్డ్ ఉన్నప్పుటికీ టీమ్ ఇండియా టీ షర్ట్ ధరించే అవకాశం రాలేదు. అంతర్జాతీయ మ్యాచ్‌లకు ఎంపికైనా అవకాశాన్ని అందిపుచ్చుకోవడానికి అడుగడుగునా అవరోధాలు. దీంతో డిప్రెషన్‌కు గురయ్యాను. కొన్నాళ్లు ఏం చేయాలో అర్థం కాని స్థితి. 2008లో జూనియర్ ఆసియా చాంపియన్‌షిప్‌లో కోచ్‌గా అవకాశం వచ్చింది. ఫలితాలు బాగుండటంతో ఆ తర్వాత అంతర్జాతీయ జట్టుకు కోచ్‌గా వెళ్తానని అందరికీ చెప్పాను. నా కల నెరవేరుతుందని అనుకున్నాను. కానీ, నా ఆశలు మళ్లీ నేలకు జారాయి. అదే ఏడాది మళ్లీ ప్రమోషన్ వచ్చింది. 2014 వరకు అదే జాబ్‌లో కొనసాగి రిటైరయ్యాను. అసంతృప్తి అలాగే ఉండిపోయింది. అంతర్జాతీయంగా అవకాశాలు... రిటైరయ్యాక ఇరాన్ నుండి బాలికల జట్టుకు కోచ్‌గా ఉండమని ఆహ్వానం అందింది. మా ఇంట్లోవాళ్లు ఆ దేశంలో ఉండటం సులభం కాదన్నారు. ఒకసారి పాస్‌పోర్ట్‌పై ఇరాన్ ముద్ర పడితే ఇక అంతే అన్నారు. కానీ, అవేవీ పట్టించుకోకుండా వెళ్లాను. అలా మొదలైన నా ప్రయాణం రెండేళ్లకు జకార్తాలో జరిగిన ఆసియా క్రీడల వరకు వెళ్లింది. అక్కడి అలవాట్లు, తిండి, భాష, వేషధారణ అన్నీ మనకు భిన్నమైనవే. అయినా లభించిన అవకాశాన్ని బంగారంగా మార్చుకునే ధైర్యాన్ని పెంచుకున్నాను. నేను జైన్ కమ్యూనిటీకి చెందినదానిని, మాంసాహారం తినలేను. ఇరాన్లో శాకాహారం దొరకడం చాలా కష్టం. కోచ్‌గా ఉంటూ నాన్‌వెజ్ తినకుండా ఉండటం ఎలా సాధ్యం అని అక్కడివాళ్లు ఆశ్చర్యపోయేవారు. భారతదేశానికి వచ్చినప్పుడు నా ఆహారానికి కావల్సిన పదార్థాలను తీసుకెళ్లేదాన్ని. కానీ, ఆహారం గురించి పై అధికారులకు ఎప్పుడూ కంప్లైంట్ చేయలేదు. రాని భాషలు నేర్చుకున్నాను. టీమ్‌తో అనుబంధాలను పెంచుకున్నాను. ఏడాదిన్నరలో 14 క్యాంపులు నిర్వహించాను. జకార్తా నుంచి భారత్‌కు జకార్తా ఆసియా క్రీడల్లో నా జట్టు సెమీఫైనల్స్‌కు చేరుకొని భారత జట్టుతో ఫైనల్స్‌కు ఎంపికయ్యింది. ఆ మ్యాచ్‌లో నేను చాలా ఒత్తిడికి గురయ్యాను. నా దేశానికి ప్రత్యర్ధిగా నేనే ఉన్నాను... దీంతో తిండి, నిద్రకు దూరమయ్యాను. కానీ, నా బాధ్యత గుర్తుకొచ్చింది. నా జట్టు అమ్మాయిలను ప్రోత్సహించాను. నేను చెప్పిన ట్రిక్కులు పాటించి, గెలుపొందారు. స్వర్ణం గెలిచిన తర్వాత అమ్మాయిలు గ్రౌండ్లో ఉత్సాహంగా జెండాతో పరుగులు ప్రారంభించారు. నా చేయి పట్టుకుని ‘మేడమ్ రండీ.. మీ వల్లే మాకు బంగారు పతకం వచ్చింది..’ అంటూ ఆనందాన్ని వ్యక్తం చేశారు. కానీ, వారితో ‘నా కాంట్రాక్ట్ మిమ్మల్ని ఫైనల్ మ్యాచ్ వరకే, అది పూర్తయిపోయింది. నా భారత ఆటగాళ్లు బాధపడుతుంటే, నేను సంబరాలు చేసుకోలేను’ అని చెప్పాను. తొలిసారి భారత్ ఓడిపోయి ఇరాన్ గెలిచి చరిత్ర సృష్టించింది. ఆ చరిత్రలో నా పేరు కూడా నమోదయ్యింది. స్వదేశానికి... ‘నా దేశాన్ని గెలిపించుకోవాలే కానీ, పరాయి దేశాన్ని కాదు’ అనే ఆలోచనతో తిరిగి నాసిక్ వచ్చేశాను. ఇక్కడ నుంచి 150 కిలోమీటర్ల దూరంలో నివసిస్తున్న గిరిజన బాలికలకు కబడ్డీలో శిక్షణ ఇస్తున్నాను. వారిని నా అకాడమీకి తీసుకువచ్చి డైట్ కిట్స్ ఇస్తుంటాను. ఇందుకు వనవాసి కళ్యాణ్ ఆశ్రమం నుంచి సహాయం అందుతుంది. గిరిజన బాలికలు క్రీడల్లో చాలా బాగా రాణిస్తున్నారు. దేశానికి మంచి క్రీడాకారిణులు లభించేలా వారిని తీర్చిదిద్దడంలో ఇప్పుడు నేను చాలా బిజీగా ఉన్నాను’’ అని వివరించారు శైలజా జైన్. -
అన్‌స్టాపబుల్ సంధ్య
రోజు కూలి కోసం తేయాకు తోటల్లో ఆకులు తెంపుతున్న సంధ్యను తోటలోకి వచ్చి రగ్బీ తెంపుకుపోయింది! ఇప్పుడామె ‘అన్‌స్టాపబుల్’ రగ్బీ ప్లేయర్! పేదరికం నుంచి, కరెంటే లేని కొండాకోనల గ్రామం నుంచి జాతీయ స్థాయి ప్లేయర్‌గా ఎదిగిన సంధ్యను స్ఫూర్తివంతమైన క్రీడాకారిణిగా ‘వరల్డ్ రగ్బీ’ సంస్థ తన ‘ఎవరూ ఆపలేని జాబితా’లో చేర్చింది! ఉత్తర బెంగాల్‌లోని సిలిగురికి తూర్పు వైపున.. బైకాంత్‌పూర్ అటవీ ప్రాంతంలో ఉంటుంది సరస్వతీపూర్ గ్రామం. మూడు వైపులా ఇంతెత్తున గ్రామాన్ని కనిపించనివ్వకుండా గుగ్గిలం కలప చెట్లు ఉంటాయి. సాల్ వృక్షాలు అంటారు వాటినే. గ్రామానికి నాలుగో వైపున తీస్తానది ప్రవహిస్తూ ఉంటుంది. ఏనుగులైతే ఇక గుంపులుగా సరస్వతీపూర్కు వచ్చిపోతుండే అతిథులు. ఇప్పుడా ఊరికి కొత్త వెలుగు వచ్చింది! ప్రభుత్వం ఇటీవలే వేయించిన కరెంట్ పోల్స్ వల్ల వచ్చిన విద్యుద్దీప కాంతుల వెలుగు కాదది. సంధ్యారాయ్ అనే ఆ ఊరి అమ్మాయి డిసెంబర్ 23 న ‘వరల్డ్ రగ్బీ అన్‌స్టాపబుల్’ జాబితాలో చోటు సంపాదించి ఊరి పేరు వెలిగిపోయేలా చేసింది. ‘వరల్డ్ రగ్బీ’ సంస్థ ఏటా ‘అన్‌స్టాపబుల్’ అని అత్యుత్తమ ప్రతిభ కనబరుస్తున్న క్రీడాకారిణుల పేర్లను ప్రకటిస్తుంది. ప్రతిభ మాత్రమే కాదు. వాళ్లది స్ఫూర్తివంతమైన జీవన పోరాటం అయి ఉండాలి. ఈసారి వరల్డ్ రగ్బీ–‘ఆసియా అన్‌స్టాపబుల్స్’ ప్రకటించిన 32 మంది రగ్బీ మహిళా క్రీడాకారులలో సంధ్యారాయ్ పేరు కూడా ఉంది! ఇండియా నుంచి ముగ్గురు ఎంపికైతే వారిలో సంధ్య ఒకరు. ఇరవై ఏళ్ల సంధ్య అంత తేలిగ్గా ఏమీ ఈ స్థాయికి చేరుకోలేదు. రగ్బీ ఫుట్‌బాల్ ఎంత కఠినమైదో, సంధ్య ఇంటి పరిస్థితులు అంతకుమించిన కాఠిన్యం గలవి. ∙∙ సరస్వతీపూర్లో నిన్నమొన్నటి వరకు కరెంట్ లేనట్లే, ఆ ఊళ్లో టెన్త్ దాటి చదివిన అమ్మాయిలూ లేరు. సంధ్య కూడా అక్కడితో ఆగిపోయి ఉండేదే. సంధ్య తల్లిదండ్రులు తేయాకు తోటల్లో ఆకులు తెంపే దినసరి కూలీలు. సంధ్య కూడా పదో తరగతి వరకు ఆకులు తెంపడానికి వెళ్లింది. తెలివైన అమ్మాయి కనుక టెన్త్ ఎటూ పాస్ అయి ఉండేది. అడవికే పరిమితమైన జీవనం కనుక ఆమె తెలివితేటలు సాల్ వృక్షాలను దాటి, ఏనుగులను దాటి, తీస్తా నదిని దాటి వెలుపలికి విస్తరించేవి కావు. తిరిగి తల్లిదండ్రులతో కలిసి ఆకులు తెంపడానికి వెళుతుండేది. అయితే 2013లో జరిగిన ఒక ‘ఈవెంట్’ ఆమె జీవితాన్ని రగ్బీ వైపు తిప్పింది. అందుకు మూడు శక్తులు పని చేశాయి. జార్జి మాథ్యూ అనే క్యాథలిక్ మత ప్రబోధకుడు ఒకరు. సర్వతీపూర్లో స్థానికంగా నివసించే సిలిగురి సెలేషియన్ కాలేజ్ ఫిజికల్ డైరెక్టర్ ఒకరు. కోల్‌కతాలోని ‘జంగిల్ క్రోస్’ అనే ఔత్సాహిక రగ్బీ టీమ్ లీడర్ ఒకరు. జార్జి మాథ్యూ కోల్‌కతాలోని డాన్ బాస్కో ఆశాలయం ఇన్చార్జి. రగ్బీ ఆట మీద ఆయనకు పట్టు ఉంది. అటవీ ప్రాంతాల్లోని పిల్లలు ఆ ఆటకు పట్టునిస్తారని నమ్మకం ఉంది. అడవుల్లోని ఊళ్లన్నీ తిరుగుతూ సరస్వతీపూర్ కూడా వచ్చి కొన్నాళ్లు అక్కడే ఉన్నారు. ‘జంగిల్ క్రోస్’ రగ్బీ టీమ్ ఆయనకు పరిచయమే. సిలిగురి కాలేజ్ ఫిజికల్ డైరెక్టర్‌తో మాట్లాడుతున్నప్పుడు ఇక్కడి పిల్లలకు కూడా రగ్బీ నేర్పిస్తే బాగుంటుందన్న ఆలోచన వచ్చింది జార్జి మేథ్యూకి. ఇద్దరూ అనుకుని రగ్బీలో శిక్షణ ఇచ్చేందుకు జంగిల్ క్రోస్ని సిలిగురి కాలేజ్‌కి తెప్పించారు. అక్కడ పడింది సంధ్యారాయ్కి రగ్బీలోకి తొలి అడుగు. ఆమెతో పాటు తొమ్మిది మంది బాలికలు శిక్షణ తీసుకున్నారు. అక్కడి నుంచే సంధ్యారాయ్ ‘అన్‌స్టాపబుల్’ జర్నీ మొదలైంది. తేయాకు తెంపడానికి వెళుతున్న అమ్మాయిని ఆ తోటల్లోంచి రగ్బీ తెంపుకుపోయింది. రగ్బీలోనే తను భవిష్యత్తు ఉందని సంధ్య తెలుసుకుంది. ఈ ఏడేళ్లలో జాతీయంగా జరిగిన అనేక రగ్బీ పోటీలలో తనేంటో, తన టీమేంటో చూపించింది సంధ్య! ఆటలోని ఆమె ఒడుపును చూసి రాహుల్ బోస్ అంతటి వ్యక్తే మంత్రముగ్ధుడయ్యారు. బోస్ సినిమా నటుడిగా, డైరెక్టర్‌గానే ప్రసిద్ధి. రగ్బీలో కూడా ఆయన చాంపియన్. ఇంటర్నేషనల్ ప్లేయర్. ‘రగ్బీ అన్‌స్టాపబుల్’ జాబితాలో సంధ్యకు ఓటు వేసిన వారిలో బోస్ కూడా ఉన్నారు. ‘‘పేదింటి నుంచి వచ్చిన అమ్మాయి, కరెంటు లేని ఊరి నుంచి వచ్చిన అమ్మాయి రగ్బీలో నేషనల్ ప్లేయర్‌గా రాణించడం సాధారణమైన సంగతేమీ కాదు’’ అని ఆయన ప్రశంసించారు. ∙∙ టెన్త్ తర్వాత తన చదువేదో తను, తన రగ్బీ ఏదో తను చూసుకోలేదు సంధ్య. ఊళ్లోని అమ్మాయిల్నీ తనలా రగ్బీ ప్లేయర్లను చేసేందుకు ‘జంగిల్ క్రోస్’తో కలిసి ‘పాస్ ఫర్ ప్యాషన్’ అనే ప్రచారోద్యమాన్ని ప్రారంభించింది. ‘ఖేలో రగ్బీ’ అనే ప్రాజెక్టు కింద బాలికలకు రగ్బీలో ఆసక్తిని కలుగజేసి, వారికి తర్ఫీదు ఇప్పిస్తోంది. ఆగకుండా సాగిపోతోంది. సంధ్యపై ఒక డాక్యుమెంటరీ కూడా వచ్చింది! కాకులు దూరని కారడవిలోని ఒక గ్రామానికి రగ్బీ ఆటతో పేరు తెచ్చిన అమ్మాయి అంటూ బెంగాలీ నిర్మాత రోహన్ చక్రవర్తి ఆ డాక్యుమెంటరీని తీశారు. ఇంత ప్రేరణనిచ్చే కెరీర్ కనుకే వరల్డ్ రగ్బీ సంధ్యను ‘అన్‌స్టాపబుల్’ క్రీడాకారిణిగా గుర్తించింది. సంధ్య ప్రస్తుతం కోల్‌కతాలో స్పోర్ట్స్ మేనేజ్మెంట్ కోర్సు చేస్తోంది. సెలవులకు ఇప్పుడు సరస్వతీపూర్లోనే ఉంది. ఆ విరామాన్ని ఆమె ఊరికే గడపడం లేదు. గ్రామంలోని పిల్లలకు రగ్బీలో ట్రైనింగ్ ఇస్తోంది. తల్లితో సంధ్య టీమ్‌లో.. (కుడి నుంచి రెండో ప్లేయర్) -
జాతీయ స్థాయి క్రీడాకారిణి ఆత్మహత్య
కోల్కత్తా : పశ్చిమ బెంగాల్‌కు చెందిన జాతీయ స్థాయి క్రీడాకారిణి మౌప్రియ మిత్రా ఆత్మహత్య చేసుకుని చనిపోయారు. హూగ్లీ జిల్లాలోని బాండేల్ మనస్పూర్లో కల తన నివాసంలో ఆమె ఆత్మహత్య చేసుకున్నారు. రిలేషన్షిప్ వివాదాలతో ఆమె ఒత్తిడికి గురైందని తాము గుర్తించామని, దీనిపై మరింత విచారణ చేపడుతున్నామని బాండేల్కు చెందిన పోలీసాఫీసర్ తెలిపారు. ఆమె మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ఆసుపత్రికి తరలించినట్టు పేర్కొన్నారు. మౌప్రియ మిత్రా కోలంబోలో జరిగిన సౌత్ ఏసియన్ ఆక్వాటిక్స్ ఛాంపియన్‌షిప్స్‌లో రెండు పతకాలు సాధించింది. ఒకటి గోల్డ్, మరొకటి సిల్వర్. జిమ్నాస్టిక్స్‌గా తన కెరీర్ ప్రారంభించి అనంతరం ఓ ప్రమాదంలో తన కాలుకి గాయం కావడంతో దాన్ని వదిలిపెట్టారు. అనంతరం స్విమ్మింగ్‌పై ఆమె పట్టు సాధించారు. అయితే ఈమె నివాసంలో ఎలాంటి సూసైడ్ నోటు దొరకలేదు. -
ఎందులో ‘నైనా’ రికార్డే !
15 ఏళ్లకే పీజీ, జాతీయస్థాయి క్రీడాకారిణిగా రాణింపు హైదరాబాద్: జాతీయస్థాయిలో క్రీడల్లో రాణిస్తూనే పిన్న వయసులోనే పెద్ద చదువులు చదువుతూ రికార్డు సృష్టిస్తోంది హైదరాబాద్ కాచిగూడకు చెందిన 15 ఏళ్ల నైనా జైస్వాల్. విభిన్న రంగాల్లో తనదైన ముద్ర వేస్తూ ముందుకు సాగుతున్న నైనా కేవలం 8 ఏళ్ల వయసులోనే పదోతరగతి పూర్తి చేసింది. 10 ఏళ్లకు ఇంటర్, 14 ఏళ్లకు డిగ్రీ పాసై శెభాష్ అనిపించుకుంది. అదే సమయంలో మరోవైపు టేబుల్ టెన్నిస్‌లో రాణిస్తూ జాతీయస్థాయిలో అనేక విజయాలు నమోదు చేసింది. ఈ ఏడాది దూరవిద్యా విధానంలో పీజీ (పొలిటికల్ సైన్స్)లో చేరిన నైనా బుధవారం ఎల్బీనగర్ లోని విజయ్‌కరణ్ డిగ్రీ కాలేజ్‌లో ప్రారంభమైన పరీక్షలకు హాజరైంది. ఈ సందర్భంగా ‘సాక్షి’తో మాట్లాడుతూ... భవిష్యత్తులో సివిల్స్ సాధించటమే తన లక్ష్యమని చెప్పింది. పిన్న వయసులోని విభిన్న రంగాల్లో రాణించడం వెనుక తన తండ్రి అశ్విన్‌కుమార్, తల్లి భాగ్యలక్ష్మీల ప్రోత్సాహం ఎంతో ఉందని తెలిపింది. చదువుకోడానికి తాను ప్రత్యేకంగా సమయం కేటాయించనని, రోజూ 8 గంటల పాటు టేబుల్ టెన్నిస్ ప్రాక్టీస్ చేస్తుంటానని పేర్కొంది. సమయం దొరికినప్పుడు రామాయణం, భగవద్గీత వంటి ఆధ్యాత్మిక గ్రంథాలను చదవడానికి ఇష్టపడతానని చెప్పింది. కాగా, నైనా వీటన్నింటితో పాటు రెండు చేతులతో రాయడంలోనూ నేర్పరి. అలాగే, కేవలం రెండు సెకన్లలో ఏ నుంచి జెడ్ వరకు అక్షరాలను టైప్ చేసి మరో రికార్డూ సృష్టించింది. అందరూ వయసు పెరుగుతోందని భావిస్తుంటారు, నేను మాత్రం ఆయుష్షు తగ్గుతున్నట్లుగా భావిస్తా’ అని చెబుతున్న నైనా.. ఎన్ని నేర్చుకున్నా, ఎంత నేర్చుకున్నా చదువు ఉంటేనే ఇతర రంగాలకు మరింత అర్హత తోడవుతుందని అంటోంది.