ఎందులో ‘నైనా’ రికార్డే !
15 ఏళ్లకే పీజీ, జాతీయస్థాయి క్రీడాకారిణిగా రాణింపు
హైదరాబాద్: జాతీయస్థాయిలో క్రీడల్లో రాణిస్తూనే పిన్న వయసులోనే పెద్ద చదువులు చదువుతూ రికార్డు సృష్టిస్తోంది హైదరాబాద్ కాచిగూడకు చెందిన 15 ఏళ్ల నైనా జైస్వాల్. విభిన్న రంగాల్లో తనదైన ముద్ర వేస్తూ ముందుకు సాగుతున్న నైనా కేవలం 8 ఏళ్ల వయసులోనే పదోతరగతి పూర్తి చేసింది. 10 ఏళ్లకు ఇంటర్, 14 ఏళ్లకు డిగ్రీ పాసై శెభాష్ అనిపించుకుంది. అదే సమయంలో మరోవైపు టేబుల్ టెన్నిస్‌లో రాణిస్తూ జాతీయస్థాయిలో అనేక విజయాలు నమోదు చేసింది. ఈ ఏడాది
దూరవిద్యా విధానంలో పీజీ (పొలిటికల్ సైన్స్)లో చేరిన నైనా బుధవారం ఎల్‌బీనగర్ లోని విజయ్‌కరణ్ డిగ్రీ కాలేజ్‌లో ప్రారంభమైన పరీక్షలకు హాజరైంది. ఈ సందర్భంగా ‘సాక్షి’తో మాట్లాడుతూ... భవిష్యత్తులో సివిల్స్ సాధించటమే తన లక్ష్యమని చెప్పింది. పిన్న వయసులోని విభిన్న రంగాల్లో రాణించడం వెనుక తన తండ్రి అశ్విన్‌కుమార్, తల్లి భాగ్యలక్ష్మీల ప్రోత్సాహం ఎంతో ఉందని తెలిపింది.
చదువుకోడానికి తాను ప్రత్యేకంగా సమయం కేటాయించనని, రోజూ 8 గంటల పాటు టేబుల్ టెన్నిస్ ప్రాక్టీస్ చేస్తుంటానని పేర్కొంది. సమయం దొరికినప్పుడు రామాయణం, భగవద్గీత వంటి ఆధ్యాత్మిక గ్రంథాలను చదవడానికి ఇష్టపడతానని చెప్పింది. కాగా, నైనా వీటన్నింటితో పాటు రెండు చేతులతో రాయడంలోనూ నేర్పరి. అలాగే, కేవలం రెండు సెకన్లలో ఏ నుంచి జెడ్ వరకు అక్షరాలను టైప్ చేసి మరో రికార్డూ సృష్టించింది. అందరూ వయసు పెరుగుతోందని భావిస్తుంటారు, నేను మాత్రం ఆయుష్షు తగ్గుతున్నట్లుగా భావిస్తా’ అని చెబుతున్న నైనా.. ఎన్ని నేర్చుకున్నా, ఎంత నేర్చుకున్నా చదువు ఉంటేనే ఇతర రంగాలకు మరింత అర్హత తోడవుతుందని అంటోంది.