ఇల్లే బడి... అమ్మానాన్నలే గురువులు | Records at the age of fourteen | Sakshi
Sakshi News home page

ఇల్లే బడి... అమ్మానాన్నలే గురువులు

Published Mon, Jun 16 2014 9:55 PM | Last Updated on Sat, Sep 2 2017 8:54 AM

Records at the age of fourteen

‘ఆ అమ్మాయి టేబుల్ టెన్నిస్ బాగా అడుతుంది’ అంటే...
         దేశానికి పతకాలు సాధించిపెట్టే ఓ క్రీడాకారిణి ఉంది అని సంతోషిస్తారు.
 ‘ఆ అమ్మాయి వేగంగా టైప్ చేస్తుంది’ అంటే... మంచి సాధన అని ఊరుకుంటారు.
 ‘ఆ అమ్మాయి రెండు చేతులతో రాస్తుంది’ అంటే... మల్టీటాస్కింగ్ అని ప్రశంసిస్తారు.
 ‘ఆ అమ్మాయి చక్కగా పాడుతుంది, పియానో వాయిస్తుంది’ అంటే... సంగీత జ్ఞానమున్న కుటుంబం కావచ్చంటారు.  
 ‘ఆ అమ్మాయి అరగంటలో హైదరాబాద్ బిర్యానీ వండి వడ్డిస్తుంది’ అంటే...
     ఎవరు చేసుకుంటారో కానీ అదృష్టవంతుడు అని ఇప్పుడే కితాబిస్తారు.
 ‘ఆ అమ్మాయి ఎనిమిదేళ్లకే పదవ తరగతి పరీక్ష పాసయింది’ అంటే మాత్రం...
     ‘అవునా’  అంటూ కళ్లు విప్పార్చి మరీ ఆశ్చర్యపోతారు.
 ఇక... ఇవన్నీ ఒకే అమ్మాయి సాధించిన రికార్డులని తెలిస్తే...?
     ఆ అమ్మాయి నైనా జైస్వాల్ అని మెరిసే కళ్లతో చూడడమే మిగులుతుంది.

 
పద్నాలుగేళ్ల వయసులోనే ఇన్ని రికార్డులు సాధించడం, ఇంతటి సాధన ఎలా సాధ్యమైందంటే అంతా మా అమ్మానాన్నల శ్రమ ఫలితమే అంటోంది నైనా. నిజమే.. నైనా జైస్వాల్ తండ్రి అశ్విని కుమార్ న్యాయశాస్త్రం చదువుకున్నారు. అంతకంటే ముందు ఆయన దాదాపుగా 30 సంవత్సరాలుగా ఉపాధ్యాయుడు. ఇప్పటికీ ఇంటర్, డిగ్రీ, లా విద్యార్థులకు ట్యూషన్లు చెబుతున్నారు. ‘‘తల్లిదండ్రులు కొంత శ్రద్ధ చూపిస్తే పిల్లల్లో ఉన్న ఐక్యూకు పదును పెట్టవచ్చు. అందుకు నిదర్శనం మేము, మా పిల్లలే. నా ఆలోచనకు మా ఆవిడ భాగ్యలక్ష్మి కూడా సహకరించడంతో పిల్లలను బాలమేధావులుగా తీర్చిదిద్దడం సాధ్యమైంది’’ అంటారాయన.
 
అక్క బాటలోనే తమ్ముడు!

నైనా తమ్ముడు అగస్త్య ఎనిమిదేళ్ల కుర్రాడు. రామాయణం, భగవద్గీతల్లోని శ్లోకాలు కంఠస్థం చేశాడు. భావంతో సహా ఆ శ్లోకాలనూ వల్లిస్తాడు. వంద ఎక్కాలు గుక్క తిప్పుకోకుండా చెబుతాడు. తండ్రి తయారు చేసిన మూడు వేల ప్రశ్నల జనరల్ నాలెడ్జ్ బుక్‌లెట్ నుంచి ఏ ప్రశ్నకైనా ఠక్కున జవాబులు చెప్పగలడు. తాజాగా పదవ తరగతి పరీక్షకు సిద్ధమవుతున్నాడు.

 ‘‘తెలివితేటలు, మేధాసంపత్తి అనేవి పెంచుకుంటూ పోతే పెరుగుతాయి తప్ప, ఏ ప్రయత్నమూ చేయకుండా కాలం గడిపేస్తే పెరగవు. మా పిల్లల విషయంలో నేను చేసింది అదే’’ అంటారు అశ్విని కుమార్. ‘‘నాకు సంస్కృతం రాదు, బాబుతో రామాయణం, భగవద్గీత శ్లోకాలు పలికించడం, అర్థం చెప్పడం వంటివన్నీ వాళ్లమ్మ నిర్వహిస్తున్న శాఖ. మేమిద్దరం మా పిల్లల్ని ‘ఇల్లే బడి’ అనే పద్ధతిలో తీర్చిదిద్దాలనుకున్నాం. అదే చేశాం’’ అంటారు.
 
లండన్ నుంచి ప్రత్యేక అనుమతి

పిల్లల్లో ఎనిమిదేళ్లకే పదో తరగతి పరీక్ష రాయగల సామర్థ్యం ఉందని తల్లిదండ్రులు గ్రహించడం ఒక ఎత్తు. అయితే ఆ పిల్లల చేత పరీక్ష రాయించడానికి అనుమతి పొందడం మరో ఎత్తు. అది చిన్న విషయం కాదు. అందుకు విద్యాశాఖ నుంచి ప్రత్యేక అనుమతి తీసుకోవాలి. ‘‘మా పాప నైనా చేత పరీక్ష రాయించడానికి అప్పటి విద్యాశాఖ మంత్రిని అనుమతి కోరాను. అప్పటికి ఆ మంత్రికి అలా పరీక్ష రాయవచ్చని కూడా తెలియదట.

ఆశ్చర్యపోయారు కానీ అనుమతి మాత్రం ఇవ్వలేదు. జిల్లా విద్యా శాఖాధికారులు కూడా పెద్దగా స్పందించలేదు. దాంతో ఐజిసిఎస్‌ఈ (ఇంటర్నేషనల్ జనరల్ సర్టిఫికేట్ సెకండరీ ఎడ్యుకేషన్) విధానంలో పరీక్ష రాయించడానికి లండన్‌కి ఉత్తరం రాశాను. అప్పటి ప్రధాని మన్‌మోహన్ సింగ్‌తో సమావేశానికి ఢిల్లీకి వచ్చిన కేంబ్రిడ్జి ప్రతినిధి అలీసా రిచర్డ్సన్‌ను కోరాను. అప్పుడామె చెన్నైలోని ‘సౌత్ ఏషియా’విభాగాధిపతిని కలవమని రిఫరెన్స్ ఇచ్చారు. అక్కడ పాప ఐక్యూ టెస్ట్ చేసిన తర్వాత అనుమతినిచ్చారు’’ అని చిన్న వయసులోనే నైనా జైస్వాల్ పదో తరగతి పరీక్ష రాయడానికి మార్గం సుగమం చేసుకున్న వైనాన్ని వివరించారు అశ్విని కుమార్.
 
సర్దుబాటు సంతోషమే!
 
స్కూలుకెళ్లి చదువుకోవడం అనే సాధారణ పద్ధతి నుంచి ఇంట్లోనే చదువుకునే విధానాన్ని చేపట్టడానికి దారి తీసిన పరిస్థితులను తల్లి భాగ్యలక్ష్మి. వివరించారు. ‘‘పెళ్లికి ముందు నుంచే ఆయన బోధనారంగంలో ఉన్నారు. కొంతమంది చురుకైన పిల్లలకు క్లాసు సిలబస్ కంటే ఎక్కువ విషయాలను చెప్పాలని తపన పడేవారు. అయితే, ఆ పిల్లల తల్లిదండ్రుల నుంచి పెద్దగా స్పందన వచ్చేది కాదు. అప్పుడే మేమిద్దరం ‘ఇతరుల పిల్లల విషయంలో మనం నిర్ణయం తీసుకోకూడదు, మన పిల్లలనైతే మనకు నచ్చినట్లు పెంచుకోవచ్చు’ అని అప్పుడే అనుకున్నాం’’ అంటారామె. ఈ తల్లిదండ్రుల కృషితో ఆ ఇంట్లో ఇద్దరు బాలమేధావులు తయారయ్యారు. పిల్లలను ఆల్‌రౌండర్‌లుగా తీర్చిదిద్దడం కోసం ఎంత వరకైనా శ్రమిస్తాననే తండ్రి, పిల్లల అవసరాల కోసం మా ఖర్చులు తగ్గించుకోవడం మాకేమీ బాధ అనిపించడంలేదనే తల్లి ఈ పిల్లలకు సొంతం.
 
అక్క కంటే నేనే ముందు!
 
నైనాకు రెండు చేతులతో రాయడం నేర్పించడానికి కారణం - మెదడును చురుగ్గా ఉంచడానికేనంటారు తల్లిదండ్రులు. మెదడులోని రెండు పార్శ్వాలూ చురుగ్గా ఉండాలంటే రెండు చేతులతో రాస్తే చాలంటారు. నైనా జాతీయ స్థాయి విజేత అయిన సంఘటన తమకు అత్యంత సంతోషాన్నిచ్చింది అంటారా దంపతులు. అందరూ భావిస్తున్నట్లు ఇన్ని రంగాల్లో రాణించడం వల్ల తమ పిల్లలు ఒత్తిడికి లోను కావడం లేదని, ఇప్పుడు ఏ ఒక్కటి ఆపేయమన్నా ఏడుస్తారనీ వారు చెప్పారు. ఇంతలో అగస్త్య కలగ జేసుకుంటూ ‘‘అక్క అన్నింట్లో ఫస్ట్, కానీ నేను అక్క కంటే ఫస్టే పేపర్‌లో, టీవీలో వచ్చేశా’’ అంటూ ‘అవును కదమ్మా’ అంటూ తల్లి వైపు చూశాడు.  
 
నైనా తాజాగా పద్నాలుగేళ్లకే గ్రాడ్యుయేషన్ పూర్తి చేసింది. ఇటీవలే పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఎంట్రన్స్ పరీక్ష రాసింది. త్వరలోనే పి.జి చేయనుంది. ఇక, సివిల్స్ పరీక్ష రాయడానికి 21 ఏళ్ల వయఃపరిమితి కాబట్టి, ఆ అర్హత వచ్చే లోపు పిహెచ్‌డి కూడా చేస్తానంటోంది. ‘‘ఒక మంచి పని చేయాలన్నా, ఒకరికి సహాయం చేయాలన్నా చేతిలో అధికారం ఉండాలి. అందుకే మా అమ్మాయిని ఐఎఎస్ అధికారిని చేయాలనుకున్నా’’నంటారామె తండ్రి.
 
ఎంఎస్‌సి మైక్రో బయాలజీ చదివి పిల్లల కోసం పై చదువులకు, ఉద్యోగానికి దూరంగా ఉన్న భాగ్యలక్ష్మి ‘‘మా అమ్మాయితోపాటు నేను కూడా పిహెచ్‌డి చేస్తా’’ అన్నారు. ఇంతలో ‘‘టీటీ టోర్నమెంట్‌కు అక్కకు తోడుగా నాన్న వెళ్తున్నాడు, నేను కూడా టీటీ ఆడి నాతోపాటు అమ్మను చైనాకు తీసుకెళ్తా’’ అంటూ తల్లిని చుట్టుకున్నాడు అగస్త్య. రత్నాల్లాంటి పిల్లలను ఇవ్వడం వరకే దేవుడి వంతు. ఆ రత్నాలకు మెరుగులు దిద్దడం తల్లిదండ్రుల బాధ్యత అనడానికి అశ్వినికుమార్, భాగ్యలక్ష్మి దంపతులే నిదర్శనం.
 - వాకా మంజులారెడ్డి, సాక్షి ఫీచర్స్ ప్రతినిధి
 
అమ్మానాన్నకు అన్నీ నేనే అవుతా!
ఇలాంటి అమ్మానాన్నలు ఉండడం మా అదృష్టం. వాళ్ల సమయం, జీవితం మా కోసమే అన్నట్లు ఉంటారు. నేను సివిల్స్ రాసి మంచి ఉద్యోగం సాధించిన తర్వాత మా అమ్మానాన్నలకు పూర్తి విశ్రాంతినిచ్చి వాళ్లకు అన్నీ నేనే చూసుకుంటాను.
 - నైనా జైస్వాల్, 14 ఏళ్లకే డిగ్రీ పాసైన బాల మేధావి
 
 పుట్టింది: 2000 మార్చి 22వ తేదీన, హైదరాబాద్‌లో

 పదవ తరగతి పరీక్ష పాసయింది: 2008లో

 12వ తరగతి  పాసయింది : 2010లో

 డిగ్రీ పాసయింది: ఇటీవలే ఉస్మానియా యూనివర్శిటీ నుంచి (బి.ఎ, మాస్ కమ్యూనికేషన్స్)

 జాతీయ స్థాయి పతకాలు: టేబుల్ టెన్నిస్‌లో 2010- 2011లలో అండర్ 12 కేటగిరీలో స్వర్ణ, అండర్ 14 కేటగిరీలో కాంస్య పతకాలు, అండర్ 12, అండర్ 14 టీమ్ ఈవెంట్‌లలో స్వర్ణపతకాలు,

{పస్తుత స్థాయి: జాతీయ స్థాయిలో మొదటి ర్యాంకు, అంతర్జాతీయ స్థాయిలో ఆరవ ర్యాంకు.
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement