Nina Jaiswal
-
ఎందులో ‘నైనా’ రికార్డే !
15 ఏళ్లకే పీజీ, జాతీయస్థాయి క్రీడాకారిణిగా రాణింపు హైదరాబాద్: జాతీయస్థాయిలో క్రీడల్లో రాణిస్తూనే పిన్న వయసులోనే పెద్ద చదువులు చదువుతూ రికార్డు సృష్టిస్తోంది హైదరాబాద్ కాచిగూడకు చెందిన 15 ఏళ్ల నైనా జైస్వాల్. విభిన్న రంగాల్లో తనదైన ముద్ర వేస్తూ ముందుకు సాగుతున్న నైనా కేవలం 8 ఏళ్ల వయసులోనే పదోతరగతి పూర్తి చేసింది. 10 ఏళ్లకు ఇంటర్, 14 ఏళ్లకు డిగ్రీ పాసై శెభాష్ అనిపించుకుంది. అదే సమయంలో మరోవైపు టేబుల్ టెన్నిస్‌లో రాణిస్తూ జాతీయస్థాయిలో అనేక విజయాలు నమోదు చేసింది. ఈ ఏడాది దూరవిద్యా విధానంలో పీజీ (పొలిటికల్ సైన్స్)లో చేరిన నైనా బుధవారం ఎల్బీనగర్ లోని విజయ్‌కరణ్ డిగ్రీ కాలేజ్‌లో ప్రారంభమైన పరీక్షలకు హాజరైంది. ఈ సందర్భంగా ‘సాక్షి’తో మాట్లాడుతూ... భవిష్యత్తులో సివిల్స్ సాధించటమే తన లక్ష్యమని చెప్పింది. పిన్న వయసులోని విభిన్న రంగాల్లో రాణించడం వెనుక తన తండ్రి అశ్విన్‌కుమార్, తల్లి భాగ్యలక్ష్మీల ప్రోత్సాహం ఎంతో ఉందని తెలిపింది. చదువుకోడానికి తాను ప్రత్యేకంగా సమయం కేటాయించనని, రోజూ 8 గంటల పాటు టేబుల్ టెన్నిస్ ప్రాక్టీస్ చేస్తుంటానని పేర్కొంది. సమయం దొరికినప్పుడు రామాయణం, భగవద్గీత వంటి ఆధ్యాత్మిక గ్రంథాలను చదవడానికి ఇష్టపడతానని చెప్పింది. కాగా, నైనా వీటన్నింటితో పాటు రెండు చేతులతో రాయడంలోనూ నేర్పరి. అలాగే, కేవలం రెండు సెకన్లలో ఏ నుంచి జెడ్ వరకు అక్షరాలను టైప్ చేసి మరో రికార్డూ సృష్టించింది. అందరూ వయసు పెరుగుతోందని భావిస్తుంటారు, నేను మాత్రం ఆయుష్షు తగ్గుతున్నట్లుగా భావిస్తా’ అని చెబుతున్న నైనా.. ఎన్ని నేర్చుకున్నా, ఎంత నేర్చుకున్నా చదువు ఉంటేనే ఇతర రంగాలకు మరింత అర్హత తోడవుతుందని అంటోంది. -
ఈ రెండూ మిస్కాను..
నగరంలో క్రిస్మస్ సందడి పెరిగింది. ఈ నెల 25న క్రిస్మస్ కార్నివాల్‌ను గ్రాండ్‌గా నిర్వహించేందుకు గోల్కొండ హోటల్ సన్నాహాలు చేస్తోంది. హోటల్లోని మీడోలాన్స్లో ఉదయం 10 నుంచి సాయంత్రం 7 గంటల వరకు ఈ కార్నివాల్ జరుగనుంది. న్యూ ఇయర్ వేడుకల కోసం ఘజల్ మాస్టర్ ఖాన్ ఆలీ ఖాన్, స్టీవ్ అడమ్స్‌తో ప్రత్యేక ఈవెంట్లు నిర్వహించనున్నట్లు నిర్వాహకులు ప్రకటించారు. డిసెంబర్ 31 రాత్రి 10 నుంచి తెల్లవారుజామున 4 గంటల వరకు ‘మిలేంగే’ ఈవెంట్ ఉంటుందని తెలిపారు. గురువారం జరిగిన ఈవెంట్ కర్టన్ రైజర్ ప్రోగ్రామ్‌కు హాజరైన టేబుల్ టెన్నిస్ చాంపియన్ నైనా జైస్వాల్‌ను సిటీప్లస్ పలకరించింది. చిన్నప్పటి నుంచి క్రిస్మస్ వేడుకల్లో సరదాగా పాల్గొనేదాన్ని. కుటుంబసభ్యులు, ఫ్రెండ్స్ అందరూ కలసి పండుగ సెలబ్రేట్ చేసుకునేవాళ్లం. డిసెంబర్ 31న కేక్ కట్ చేస్తాను. టీటీ షెడ్యూల్‌తో ఎంత బిజీగా ఉన్నా ఈ రెండు స్పెషల్ డేస్ మాత్రం ఎట్టి పరిస్థితుల్లో మిస్సవ్వను. గోల్కొండ హోటల్ నిర్వహిస్తున్న స్పెషల్ ఈవెంట్స్‌లో నేను కూడా భాగస్వామిని అయినందుకు సంతోషంగా ఉంది. రూపాయిల కన్నా రూపం గొప్పది. వేల కన్నా వినయం గొప్పది. లక్షల కన్నా లక్షణం గొప్పది. కోట్ల కన్నా కొనలేని కాలం గొప్పది. అందుకే ఏటా వచ్చే పండుగలను ఘనంగా జరుపుకుంటాను. చర్చికి వెళ్తుంటా.. క్రిస్మస్ రోజున ఫ్రెండ్స్ ఆహ్వానం మేరకు నారాయణగూడలోని శాంతి థియేటర్ సమీపంలో ఉన్న చర్చికి వెళ్తుంటాను. వారి ఆటపాటలను ఎంతో ఎంజాయ్ చేస్తా. న్యూ ఇయర్ రోజున ఉదయం బషీర్‌బాగ్‌లోని అమ్మవారి గుడికి తప్పకుండా వెళ్తాను. ఈసారి కూడా కుటుంబసభ్యులతో కలిసి వెళ్తున్నా. ఇంట్లో అమ్మ చేసే ప్రత్యేక వంటకాలను టేస్ట్ చేస్తా. ఉదయం నుంచి రాత్రి దాకా న్యూ ఇయర్‌ను ఉత్సాహంగా సెలబ్రేట్ చేసుకుంటాను. ఇతర దేశాల ఆటగాళ్లు కూడా గ్రీటింగ్స్ తెలుపుతుంటారు. - వాంకె శ్రీనివాస్ -
సెమీస్‌లో తెలంగాణ
జాతీయ జూనియర్, యూత్ టీటీ అలెప్పీ (కేరళ): జాతీయ జూనియర్, యూత్ టేబుల్ టెన్నిస్ (టీటీ) టీమ్ చాంపియన్‌షిప్‌లో తెలంగాణ అమ్మాయిల జట్టు సెమీఫైనల్స్‌లోకి దూసుకెళ్లింది. క్వార్టర్స్‌లో డిఫెండింగ్ చాంపియన్ బెంగాల్‌ను 3-2తో ఓడించిన తెలంగాణ జట్టు సెమీస్‌లో కేరళతో తలపడుతుంది. 76వ సీజన్‌గా జరుగుతున్న ఈ టోర్నీలో తెలంగాణ జట్టు తొలిసారి పాల్గొంది. నైనా జైస్వాల్ తానాడిన రెండు సింగిల్స్ మ్యాచ్‌ల్లో గెలుపొందగా... ఆకుల శ్రీజ ఒక మ్యాచ్‌లో నెగ్గి తెలంగాణ సెమీస్‌కు చేరడంలో కీలకపాత్ర పోషించింది. తొలి సింగిల్స్‌లో నైనా11-7, 10-12, 11-7, 11-3తో షోబబ్తి మెయిత్రాపై... రెండో సింగిల్స్‌లో 6-11, 11-7, 7-11, 11-8, 11-7తో ప్రాప్తి సేన్‌పై గెలిచింది. -
నేటి నుంచి తెలంగాణ టీటీ టోర్నీ
నిఖత్, నైనాలకు టాప్ సీడింగ్ సాక్షి, హైదరాబాద్: అనంత నారాయణ రెడ్డి, రామేశ్వరమ్మ స్మారక తెలంగాణ అంతర్ జిల్లా టేబుల్ టెన్నిస్ (టీటీ) టోర్నమెంట్ నేటి నుంచి జరగనుంది. హైదరాబాద్ అమ్మాయిలు నిఖత్ బాను (మహిళలు), నైనా జైస్వాల్ (యూత్ బాలికలు) టాప్ సీడ్లుగా బరిలోకి దిగనున్నారు. ఆకుల శ్రీజకు జూనియర్ బాలికల విభాగంలో టాప్ సీడింగ్ దక్కింది. పురుషుల విభాగంలో చంద్రచూడ్... జూనియర్, సబ్ జూనియర్ బాలుర కేటగిరీలో స్నేహిత్, యూత్ బాలుర విభాగంలో హర్ష లహోటి టాప్ సీడ్లుగా బరిలోకి దిగుతారు. ఖైరతాబాద్‌లోని ఆనంద్‌నగర్ వెల్ఫేర్ అసోసియేషన్‌లో గురువారం నుంచి 16వ తేదీ వరకు పోటీలు నిర్వహిస్తారు. నాలుగు రోజుల పాటు జరిగే టోర్నమెంట్లో 621 ఎంట్రీలు వచ్చాయి. ఈవెంట్ ప్రారంభోత్సవానికి స్థానిక ఎమ్మెల్యే చింతల రామచంద్రా రెడ్డి ముఖ్య అతిథిగా విచ్చేసి పోటీలను లాంఛనంగా ఆరంభిస్తారని ఆర్గనైజింగ్ సెక్రటరీ ఎ.నరసింహారావు తెలిపారు. -
నైనాకు రూ.3 లక్షల నజరానా
సాక్షి, హైదరాబాద్: అంతర్జాతీయ పోటీల్లో నిలకడగా రాణిస్తున్న టేబుల్ టెన్నిస్ క్రీడాకారిణి నైనా జైస్వాల్‌ను తెలంగాణ స్పోర్ట్స్ అథారిటీ (సాట్స్) సత్కరించింది. రాష్ట్ర సచివాలయంలో శనివారం జరిగిన ఈ కార్యక్రమంలో రాష్ట్ర క్రీడలు, యువజన సర్వీసుల శాఖ ముఖ్య కార్యదర్శి లవ్ అగర్వాల్, రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు కె.వి.రమణాచారి (రిటైర్డ్ ఐఏఎస్) ఆమెకు రూ. 3 లక్షల చెక్‌ను అందజేశారు. పాకిస్థాన్‌లో గత నెల జరిగిన ఆసియా జూనియర్, క్యాడెట్ చాంపియన్‌షిప్‌లో ఆమె ఒక్కో స్వర్ణ, రజతం గెలిచింది. దీంతో రాష్ట్ర ప్రభుత్వం ఈ నజరానాను అందజేసింది. చదువుల్లో, క్రీడల్లో రాణిస్తూ బహుముఖ ప్రజ్ఞాశాలిగా పేరుతెచ్చుకున్న నైనాను లవ్ అగర్వాల్, రమణాచారిలు ఈ సందర్భంగా అభినందించారు. ఈ కార్యక్రమంలో ఆమె తల్లిదండ్రులు పాల్గొన్నారు. -
ఆసియా టీటీ పోటీలకు నైనా, శ్రీజ, స్నేహిత్
ముంబై: ప్రతిష్టాత్మక ఆసియా జూనియర్ టేబుల్ టెన్నిస్ (టీటీ) చాంపియన్‌షిప్‌లో పాల్గొనే భారత జట్ల తరఫున హైదరాబాద్ క్రీడాకారులు నైనా జైస్వాల్, ఆకుల శ్రీజ, ఫిడేల్ రఫీక్ స్నేహిత్ ప్రాతినిధ్యం వహిస్తారు. ఈనెల 12 నుంచి 16 వరకు జరిగే ఈ పోటీల్లో జూనియర్స్ (అండర్-18); క్యాడెట్ (అండర్-15) విభాగాల్లో టీమ్, వ్యక్తిగత ఈవెంట్స్‌ను నిర్వహిస్తారు. శ్రీజ జూనియర్ విభాగంలో... నైనా, స్నేహిత్ క్యాడెట్ విభాగాల్లో బరిలోకి దిగుతారు. ఈ పోటీల్లో ఆతిథ్య భారత్‌తోపాటు చైనా, జపాన్, దక్షిణ కొరియా, సింగపూర్, చైనీస్ తైపీ, థాయ్‌లాండ్, ఉత్తర కొరియా, తుర్క్మెనిస్థాన్, జోర్డాన్, కజకిస్థాన్, ఇరాన్, బహ్రెయిన్, హాంకాంగ్, ఖతార్, జట్లు పాల్గొంటున్నాయి. టీమ్ విభాగంలో టాప్-5లో నిలిచిన జట్లు ఈ ఏడాది చివర్లో చైనాలో జరిగే ప్రపంచ జూనియర్ టీటీ పోటీలకు అర్హత సాధిస్తాయి. -
ఇల్లే బడి... అమ్మానాన్నలే గురువులు
‘ఆ అమ్మాయి టేబుల్ టెన్నిస్ బాగా అడుతుంది’ అంటే... దేశానికి పతకాలు సాధించిపెట్టే ఓ క్రీడాకారిణి ఉంది అని సంతోషిస్తారు. ‘ఆ అమ్మాయి వేగంగా టైప్ చేస్తుంది’ అంటే... మంచి సాధన అని ఊరుకుంటారు. ‘ఆ అమ్మాయి రెండు చేతులతో రాస్తుంది’ అంటే... మల్టీటాస్కింగ్ అని ప్రశంసిస్తారు. ‘ఆ అమ్మాయి చక్కగా పాడుతుంది, పియానో వాయిస్తుంది’ అంటే... సంగీత జ్ఞానమున్న కుటుంబం కావచ్చంటారు. ‘ఆ అమ్మాయి అరగంటలో హైదరాబాద్ బిర్యానీ వండి వడ్డిస్తుంది’ అంటే... ఎవరు చేసుకుంటారో కానీ అదృష్టవంతుడు అని ఇప్పుడే కితాబిస్తారు. ‘ఆ అమ్మాయి ఎనిమిదేళ్లకే పదవ తరగతి పరీక్ష పాసయింది’ అంటే మాత్రం... ‘అవునా’ అంటూ కళ్లు విప్పార్చి మరీ ఆశ్చర్యపోతారు. ఇక... ఇవన్నీ ఒకే అమ్మాయి సాధించిన రికార్డులని తెలిస్తే...? ఆ అమ్మాయి నైనా జైస్వాల్ అని మెరిసే కళ్లతో చూడడమే మిగులుతుంది. పద్నాలుగేళ్ల వయసులోనే ఇన్ని రికార్డులు సాధించడం, ఇంతటి సాధన ఎలా సాధ్యమైందంటే అంతా మా అమ్మానాన్నల శ్రమ ఫలితమే అంటోంది నైనా. నిజమే.. నైనా జైస్వాల్ తండ్రి అశ్విని కుమార్ న్యాయశాస్త్రం చదువుకున్నారు. అంతకంటే ముందు ఆయన దాదాపుగా 30 సంవత్సరాలుగా ఉపాధ్యాయుడు. ఇప్పటికీ ఇంటర్, డిగ్రీ, లా విద్యార్థులకు ట్యూషన్లు చెబుతున్నారు. ‘‘తల్లిదండ్రులు కొంత శ్రద్ధ చూపిస్తే పిల్లల్లో ఉన్న ఐక్యూకు పదును పెట్టవచ్చు. అందుకు నిదర్శనం మేము, మా పిల్లలే. నా ఆలోచనకు మా ఆవిడ భాగ్యలక్ష్మి కూడా సహకరించడంతో పిల్లలను బాలమేధావులుగా తీర్చిదిద్దడం సాధ్యమైంది’’ అంటారాయన. అక్క బాటలోనే తమ్ముడు! నైనా తమ్ముడు అగస్త్య ఎనిమిదేళ్ల కుర్రాడు. రామాయణం, భగవద్గీతల్లోని శ్లోకాలు కంఠస్థం చేశాడు. భావంతో సహా ఆ శ్లోకాలనూ వల్లిస్తాడు. వంద ఎక్కాలు గుక్క తిప్పుకోకుండా చెబుతాడు. తండ్రి తయారు చేసిన మూడు వేల ప్రశ్నల జనరల్ నాలెడ్జ్ బుక్లెట్ నుంచి ఏ ప్రశ్నకైనా ఠక్కున జవాబులు చెప్పగలడు. తాజాగా పదవ తరగతి పరీక్షకు సిద్ధమవుతున్నాడు. ‘‘తెలివితేటలు, మేధాసంపత్తి అనేవి పెంచుకుంటూ పోతే పెరుగుతాయి తప్ప, ఏ ప్రయత్నమూ చేయకుండా కాలం గడిపేస్తే పెరగవు. మా పిల్లల విషయంలో నేను చేసింది అదే’’ అంటారు అశ్విని కుమార్. ‘‘నాకు సంస్కృతం రాదు, బాబుతో రామాయణం, భగవద్గీత శ్లోకాలు పలికించడం, అర్థం చెప్పడం వంటివన్నీ వాళ్లమ్మ నిర్వహిస్తున్న శాఖ. మేమిద్దరం మా పిల్లల్ని ‘ఇల్లే బడి’ అనే పద్ధతిలో తీర్చిదిద్దాలనుకున్నాం. అదే చేశాం’’ అంటారు. లండన్ నుంచి ప్రత్యేక అనుమతి పిల్లల్లో ఎనిమిదేళ్లకే పదో తరగతి పరీక్ష రాయగల సామర్థ్యం ఉందని తల్లిదండ్రులు గ్రహించడం ఒక ఎత్తు. అయితే ఆ పిల్లల చేత పరీక్ష రాయించడానికి అనుమతి పొందడం మరో ఎత్తు. అది చిన్న విషయం కాదు. అందుకు విద్యాశాఖ నుంచి ప్రత్యేక అనుమతి తీసుకోవాలి. ‘‘మా పాప నైనా చేత పరీక్ష రాయించడానికి అప్పటి విద్యాశాఖ మంత్రిని అనుమతి కోరాను. అప్పటికి ఆ మంత్రికి అలా పరీక్ష రాయవచ్చని కూడా తెలియదట. ఆశ్చర్యపోయారు కానీ అనుమతి మాత్రం ఇవ్వలేదు. జిల్లా విద్యా శాఖాధికారులు కూడా పెద్దగా స్పందించలేదు. దాంతో ఐజిసిఎస్ఈ (ఇంటర్నేషనల్ జనరల్ సర్టిఫికేట్ సెకండరీ ఎడ్యుకేషన్) విధానంలో పరీక్ష రాయించడానికి లండన్‌కి ఉత్తరం రాశాను. అప్పటి ప్రధాని మన్మోహన్ సింగ్‌తో సమావేశానికి ఢిల్లీకి వచ్చిన కేంబ్రిడ్జి ప్రతినిధి అలీసా రిచర్డ్సన్ను కోరాను. అప్పుడామె చెన్నైలోని ‘సౌత్ ఏషియా’విభాగాధిపతిని కలవమని రిఫరెన్స్ ఇచ్చారు. అక్కడ పాప ఐక్యూ టెస్ట్ చేసిన తర్వాత అనుమతినిచ్చారు’’ అని చిన్న వయసులోనే నైనా జైస్వాల్ పదో తరగతి పరీక్ష రాయడానికి మార్గం సుగమం చేసుకున్న వైనాన్ని వివరించారు అశ్విని కుమార్. సర్దుబాటు సంతోషమే! స్కూలుకెళ్లి చదువుకోవడం అనే సాధారణ పద్ధతి నుంచి ఇంట్లోనే చదువుకునే విధానాన్ని చేపట్టడానికి దారి తీసిన పరిస్థితులను తల్లి భాగ్యలక్ష్మి. వివరించారు. ‘‘పెళ్లికి ముందు నుంచే ఆయన బోధనారంగంలో ఉన్నారు. కొంతమంది చురుకైన పిల్లలకు క్లాసు సిలబస్ కంటే ఎక్కువ విషయాలను చెప్పాలని తపన పడేవారు. అయితే, ఆ పిల్లల తల్లిదండ్రుల నుంచి పెద్దగా స్పందన వచ్చేది కాదు. అప్పుడే మేమిద్దరం ‘ఇతరుల పిల్లల విషయంలో మనం నిర్ణయం తీసుకోకూడదు, మన పిల్లలనైతే మనకు నచ్చినట్లు పెంచుకోవచ్చు’ అని అప్పుడే అనుకున్నాం’’ అంటారామె. ఈ తల్లిదండ్రుల కృషితో ఆ ఇంట్లో ఇద్దరు బాలమేధావులు తయారయ్యారు. పిల్లలను ఆల్రౌండర్లుగా తీర్చిదిద్దడం కోసం ఎంత వరకైనా శ్రమిస్తాననే తండ్రి, పిల్లల అవసరాల కోసం మా ఖర్చులు తగ్గించుకోవడం మాకేమీ బాధ అనిపించడంలేదనే తల్లి ఈ పిల్లలకు సొంతం. అక్క కంటే నేనే ముందు! నైనాకు రెండు చేతులతో రాయడం నేర్పించడానికి కారణం - మెదడును చురుగ్గా ఉంచడానికేనంటారు తల్లిదండ్రులు. మెదడులోని రెండు పార్శ్వాలూ చురుగ్గా ఉండాలంటే రెండు చేతులతో రాస్తే చాలంటారు. నైనా జాతీయ స్థాయి విజేత అయిన సంఘటన తమకు అత్యంత సంతోషాన్నిచ్చింది అంటారా దంపతులు. అందరూ భావిస్తున్నట్లు ఇన్ని రంగాల్లో రాణించడం వల్ల తమ పిల్లలు ఒత్తిడికి లోను కావడం లేదని, ఇప్పుడు ఏ ఒక్కటి ఆపేయమన్నా ఏడుస్తారనీ వారు చెప్పారు. ఇంతలో అగస్త్య కలగ జేసుకుంటూ ‘‘అక్క అన్నింట్లో ఫస్ట్, కానీ నేను అక్క కంటే ఫస్టే పేపర్లో, టీవీలో వచ్చేశా’’ అంటూ ‘అవును కదమ్మా’ అంటూ తల్లి వైపు చూశాడు. నైనా తాజాగా పద్నాలుగేళ్లకే గ్రాడ్యుయేషన్ పూర్తి చేసింది. ఇటీవలే పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఎంట్రన్స్ పరీక్ష రాసింది. త్వరలోనే పి.జి చేయనుంది. ఇక, సివిల్స్ పరీక్ష రాయడానికి 21 ఏళ్ల వయఃపరిమితి కాబట్టి, ఆ అర్హత వచ్చే లోపు పిహెచ్డి కూడా చేస్తానంటోంది. ‘‘ఒక మంచి పని చేయాలన్నా, ఒకరికి సహాయం చేయాలన్నా చేతిలో అధికారం ఉండాలి. అందుకే మా అమ్మాయిని ఐఎఎస్ అధికారిని చేయాలనుకున్నా’’నంటారామె తండ్రి. ఎంఎస్సి మైక్రో బయాలజీ చదివి పిల్లల కోసం పై చదువులకు, ఉద్యోగానికి దూరంగా ఉన్న భాగ్యలక్ష్మి ‘‘మా అమ్మాయితోపాటు నేను కూడా పిహెచ్డి చేస్తా’’ అన్నారు. ఇంతలో ‘‘టీటీ టోర్నమెంట్‌కు అక్కకు తోడుగా నాన్న వెళ్తున్నాడు, నేను కూడా టీటీ ఆడి నాతోపాటు అమ్మను చైనాకు తీసుకెళ్తా’’ అంటూ తల్లిని చుట్టుకున్నాడు అగస్త్య. రత్నాల్లాంటి పిల్లలను ఇవ్వడం వరకే దేవుడి వంతు. ఆ రత్నాలకు మెరుగులు దిద్దడం తల్లిదండ్రుల బాధ్యత అనడానికి అశ్వినికుమార్, భాగ్యలక్ష్మి దంపతులే నిదర్శనం. - వాకా మంజులారెడ్డి, సాక్షి ఫీచర్స్ ప్రతినిధి అమ్మానాన్నకు అన్నీ నేనే అవుతా! ఇలాంటి అమ్మానాన్నలు ఉండడం మా అదృష్టం. వాళ్ల సమయం, జీవితం మా కోసమే అన్నట్లు ఉంటారు. నేను సివిల్స్ రాసి మంచి ఉద్యోగం సాధించిన తర్వాత మా అమ్మానాన్నలకు పూర్తి విశ్రాంతినిచ్చి వాళ్లకు అన్నీ నేనే చూసుకుంటాను. - నైనా జైస్వాల్, 14 ఏళ్లకే డిగ్రీ పాసైన బాల మేధావి పుట్టింది: 2000 మార్చి 22వ తేదీన, హైదరాబాద్‌లో పదవ తరగతి పరీక్ష పాసయింది: 2008లో 12వ తరగతి పాసయింది : 2010లో డిగ్రీ పాసయింది: ఇటీవలే ఉస్మానియా యూనివర్శిటీ నుంచి (బి.ఎ, మాస్ కమ్యూనికేషన్స్) జాతీయ స్థాయి పతకాలు: టేబుల్ టెన్నిస్‌లో 2010- 2011లలో అండర్ 12 కేటగిరీలో స్వర్ణ, అండర్ 14 కేటగిరీలో కాంస్య పతకాలు, అండర్ 12, అండర్ 14 టీమ్ ఈవెంట్లలో స్వర్ణపతకాలు, {పస్తుత స్థాయి: జాతీయ స్థాయిలో మొదటి ర్యాంకు, అంతర్జాతీయ స్థాయిలో ఆరవ ర్యాంకు. -
14 ఏళ్లకే డిగ్రీ పూర్తి చేసిన నైనా
కాచిగూడ: టేబుల్ టెన్నిస్‌లో అంతర్జాతీయ క్రీడాకారిణిగా రాణిస్తున్న పద్నాలుగేళ్ల నైనా జైస్వాల్ మరో ఘనత సాధించింది. చిన్న వయస్సులోనే డిగ్రీ పూర్తి చేసింది. శుక్రవారం విడుదలైన తృతీయ సంవత్సరం పరీక్షా ఫలితాల్లో కాచిగూడలోని కుత్బిగూడకు చెందిన నైనా (హాల్‌టికెట్ నెంబర్: 120911386007) చిన్న వయస్సులోనే డిగ్రీ ఉత్తీర్ణురాలైంది. నైనా యూసుఫ్‌గూడలోని సెయింట్ మేరీస్ కళాశాలలో బీఏ జర్నలిజం, మాస్ కమ్యూనికేషన్ కోర్సు చేసిం ది. ఆమె టేబుల్ టెన్నిస్‌లో అంతర్జాతీయ క్రీడాకారిణిగా రాణిస్తోంది. నైనా జైస్వాల్ డిగ్రీ ఫైనల్ ఇయర్లో ప్రథమ శ్రేణిలో ఉత్తీర్ణత సాధించిన సందర్భంగా ఆమె ఇంటివద్ద బంధుమిత్రులు సంబరాలు జరుపుకొన్నారు. పలువురు ఆమెకు పూల బొకేలు అందజేసి, మిఠాయిలు తినిపించి అభినందించారు. -
వ్యాయామం తప్పనిసరి: నైనా జైస్వాల్
అఫ్జల్‌గంజ్, న్యూస్‌లైన్: ఆరోగ్యవంతమైన జీవనానికి వ్యాయామం తప్పనిసరని టేబుల్ టెన్నిస్ స్టార్ నైనా జైస్వాల్ తెలిపింది. శారీరక శ్రమ కరువైన ఇప్పటి బిజీ లైఫ్‌లో ప్రతి ఒక్కరు రోజు కనీసం అరగంటైనా వ్యాయామం చేయాలని ఆమె పేర్కొంది. సెయింట్ ఆన్స్ కళాశాల (మెహిదీపట్నం) విద్యార్థులకు అబిడ్స్‌లోని ఇన్స్పైర్ ఫిట్నెస్ సెంటర్లో బుధవారం నిర్వహించిన న్యూట్రిషన్, ఫిట్నెస్ కోర్సు ముగింపు కార్యక్రమంలో ఆమె పాల్గొంది. ఈ సందర్భంగా నైనా జైస్వాల్ మాట్లాడుతూ ప్రస్తుత పోటీ ప్రపంచంలో ఒత్తిడిని జయించేందుకు వ్యాయామం ఎంతగానో దోహదపడుతుందని పేర్కొంది. దీంతో పాటు వైద్యుల సలహా మేరకు ఆహారపు అలవాట్లు, జీవన శైలిని కూడా మార్చుకోవాలని సూచించింది. అనంతరం విద్యార్థులకు ఆమె సర్టిఫికేట్లను అందజేసింది. ఈ కార్యక్రమంలో ఇన్స్పైర్ సెంటర్ సీఈఓ డేవిడ్ జూడ్, యోగా శిక్షకులు సంగీత, ఏరోబిక్ ట్రెయినర్ అమీనా తదితరులు పాల్గొన్నారు. -
14 ఏళ్లకే డిగ్రీ ఫైనల్ రాసిన నైనా జైస్వాల్
చదువులోను రికార్డు సాధించిన టీటీ క్రీడాకారిణి హైదరాబాద్, న్యూస్‌లైన్: పలు జాతీయ, అంతర్జాతీయ టోర్నీల్లో పాల్గొని విజయాలు సాధించిన టేబుల్ టెన్నిస్ క్రీడాకారిణి నైనా జైస్వాల్ చదువులో కూడా రికార్డు సొంతం చేసుకున్నారు. పద్నాలుగేళ్లకే డిగ్రీ ఫైనలియర్ పరీక్షలు రాశారు. ఇక్కడి సీతాఫల్మండి వివేకానంద డిగ్రీ కళాశాల సెంటర్లో ఆమె ఈ పరీక్షలకు హాజరయ్యారు. నైనా బీఏ జర్నలిజం, మాస్ కమ్యూనికేషన్ కోర్సు చేస్తున్నారు. టేబుల్ టెన్నిస్‌తో పాటు తనకు జర్నలిజం అంటే ఇష్టమని ఈ సందర్భంగా ఆమె తెలిపారు. తన తల్లిదండ్రులు అశ్విన్ జైస్వాల్, భాగ్యలక్ష్మి ప్రోత్సాహంతోనే అటు టీటీ, ఇటు చదువులో రాణిస్తున్నట్లు తెలిపారు. తొమ్మిదేళ్లకే పదో తరగతి పరీక్షలు రాసిన తమ కుమార్తె ఆ పరీక్షలో ఏ గ్రేడ్ సాధించిందని నైనా తండ్రి అశ్విన్ తెలిపారు. అంతర్జాతీయ క్రీడాకారిణి నైనా తమ సెంటర్లో పరీక్షలు రాయడంపట్ల కళాశాల నిర్వాహకులు సంతోషం వ్యక్తం చేశారు. -
నైనా జైస్వాల్‌కు సన్మానం
జింఖానా, న్యూస్‌లైన్: అంతర్జాతీయ స్థాయిలో సత్తా చాటుకుంటున్న టేబుల్ టెన్నిస్ క్రీడాకారిణి నైనా జైస్వాల్‌ను సోమవారం హైదరాబాద్ జిల్లా టేబుల్ టెన్నిస్ అసోసియేషన్ ఘనంగా సన్మానించింది. 13 ఏళ్ల నైనా ఇటీవల ఇరాన్లో జరిగిన అంతర్జాతీయ క్యాడెట్ అండ్ జూనియర్ టీటీ టోర్నీలో రెండు స్వర్ణాలతో పాటు ఓ కాంస్యం దక్కించుకున్న సంగతి తెలిసిందే. ఈసందర్భంగా నైనా మాట్లాడుతూ తన విజయాల వెనుక తల్లిదండ్రుల కృషి ఉందని తెలిపింది. ‘ఆడపిల్లలను నేటి సమాజం భారంగా పరిగణిస్తున్న సమయంలో నన్ను అన్ని రంగాల్లో ముందుకెళ్లేలా నా తల్లిదండ్రులు ప్రోత్సహించారు. ఓ మహిళగా సమున్నత స్థాయికి ఎదిగిన మాజీ పోలీస్ అధికారిణి కిరణ్ బేడిని నేను ఆదర్శంగా తీసుకుంటాను’ అని నైనా తెలిపింది. ఇప్పటి వరకు జాతీయ, అంతర్జాతీయ స్థాయిల్లో తమ కుమార్తె 15 స్వర్ణ పతకాలు సాధించినట్లు నైనా తండ్రి, హైదరాబాద్ టేబుల్ టెన్నిస్ కార్యదర్శి అశ్విన్‌కుమార్ తెలిపారు. సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో జరిగిన ఈ కార్యక్రమానికి బ్యాడ్మింటన్ కోచ్, ద్రోణాచార్య అవార్డీ ఎస్ఎం. ఆరిఫ్, అర్జున అవార్డు గ్రహీత మీర్ ఖాసిం అలీ, ఆంధ్రప్రదేశ్ టేబుల్ టెన్నిస్ సెలక్షన్ కమిటీ చైర్మన్ నరసింహారావు, ప్రముఖ బాడీ బిల్డర్ మోతేశ్యామ్ అలీ, టైపింగ్‌లో ప్రపంచ రికార్డు సాధించిన ఖుర్షీద్ హుస్సేన్, హైదరాబాద్ టేబుల్ టెన్నిస్ అకాడమీ అధ్యక్షుడు సాయిప్రసాద్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
అంతర్జాతీయ టీటీ టోర్నీకి నైనా
సాక్షి, హైదరాబాద్: ఫజార్ కప్ అంతర్జాతీయ టేబుల్ టెన్నిస్ (టీటీ) టోర్నమెంట్లో పాల్గొనే భారత జట్టుకు జాతీయ సబ్ జూనియర్ చాంపియన్, ఆంధ్రప్రదేశ్ టీటీ యువ తార నైనా జైస్వాల్ ఎంపికైంది. ఇరాన్‌లోని టెహ్రాన్‌లో ఈనెల 28 నుంచి 30 వరకు ఈ టోర్నీ జరుగుతుంది. 13 ఏళ్ల నైనా గత మూడేళ్లుగా జాతీయ టీటీ చాంపియన్‌షిప్‌లో సబ్ జూనియర్ బాలికల విభాగంలో విజేతగా నిలుస్తోంది. జాతీయస్థాయిలో నైనా కనబరుస్తోన్న స్థిరమైన ప్రదర్శన ఆధారంగా ఆమెకు భారత జట్టులో చోటు లభించింది. మూడు రోజులపాటు జరిగే ఫజార్ కప్‌లో జూనియర్ బాల బాలికల టీమ్, సింగిల్స్, డబుల్స్ విభాగాలలో... క్యాడెట్ బాల బాలికల సింగిల్స్ విభాగాలలో పోటీలుంటాయి.