ఈ రెండూ మిస్‌కాను..
నగరంలో క్రిస్మస్ సందడి పెరిగింది. ఈ నెల 25న క్రిస్మస్ కార్నివాల్‌ను గ్రాండ్‌గా నిర్వహించేందుకు గోల్కొండ హోటల్ సన్నాహాలు చేస్తోంది. హోటల్‌లోని మీడోలాన్స్‌లో ఉదయం 10 నుంచి సాయంత్రం 7 గంటల వరకు ఈ కార్నివాల్ జరుగనుంది. న్యూ ఇయర్ వేడుకల కోసం ఘజల్ మాస్టర్ ఖాన్ ఆలీ ఖాన్, స్టీవ్ అడమ్స్‌తో ప్రత్యేక ఈవెంట్లు నిర్వహించనున్నట్లు నిర్వాహకులు ప్రకటించారు. డిసెంబర్ 31 రాత్రి 10 నుంచి తెల్లవారుజామున 4 గంటల వరకు ‘మిలేంగే’ ఈవెంట్ ఉంటుందని తెలిపారు. గురువారం జరిగిన ఈవెంట్ కర్టన్ రైజర్ ప్రోగ్రామ్‌కు హాజరైన టేబుల్ టెన్నిస్ చాంపియన్ నైనా జైస్వాల్‌ను సిటీప్లస్ పలకరించింది.
చిన్నప్పటి నుంచి క్రిస్మస్ వేడుకల్లో సరదాగా పాల్గొనేదాన్ని. కుటుంబసభ్యులు, ఫ్రెండ్స్ అందరూ కలసి పండుగ సెలబ్రేట్ చేసుకునేవాళ్లం. డిసెంబర్ 31న కేక్ కట్ చేస్తాను. టీటీ షెడ్యూల్‌తో ఎంత బిజీగా ఉన్నా ఈ రెండు స్పెషల్ డేస్ మాత్రం ఎట్టి పరిస్థితుల్లో మిస్సవ్వను. గోల్కొండ హోటల్ నిర్వహిస్తున్న స్పెషల్ ఈవెంట్స్‌లో నేను కూడా భాగస్వామిని అయినందుకు సంతోషంగా ఉంది. రూపాయిల కన్నా రూపం గొప్పది. వేల కన్నా వినయం గొప్పది. లక్షల కన్నా లక్షణం గొప్పది. కోట్ల కన్నా కొనలేని కాలం గొప్పది. అందుకే ఏటా వచ్చే పండుగలను ఘనంగా జరుపుకుంటాను.
చర్చికి వెళ్తుంటా..
క్రిస్మస్ రోజున ఫ్రెండ్స్ ఆహ్వానం మేరకు నారాయణగూడలోని శాంతి థియేటర్ సమీపంలో ఉన్న చర్చికి వెళ్తుంటాను. వారి ఆటపాటలను ఎంతో ఎంజాయ్ చేస్తా. న్యూ ఇయర్ రోజున ఉదయం బషీర్‌బాగ్‌లోని అమ్మవారి గుడికి తప్పకుండా వెళ్తాను. ఈసారి కూడా కుటుంబసభ్యులతో కలిసి వెళ్తున్నా. ఇంట్లో అమ్మ చేసే ప్రత్యేక వంటకాలను టేస్ట్ చేస్తా. ఉదయం నుంచి రాత్రి దాకా న్యూ ఇయర్‌ను ఉత్సాహంగా సెలబ్రేట్ చేసుకుంటాను. ఇతర దేశాల ఆటగాళ్లు కూడా గ్రీటింగ్స్ తెలుపుతుంటారు.
- వాంకె శ్రీనివాస్