రోజు కూలి కోసం తేయాకు తోటల్లో ఆకులు తెంపుతున్న సంధ్యను తోటలోకి వచ్చి రగ్బీ తెంపుకుపోయింది! ఇప్పుడామె ‘అన్‌స్టాపబుల్’ రగ్బీ ప్లేయర్! పేదరికం నుంచి, కరెంటే లేని కొండాకోనల గ్రామం నుంచి జాతీయ స్థాయి ప్లేయర్‌గా ఎదిగిన సంధ్యను స్ఫూర్తివంతమైన క్రీడాకారిణిగా ‘వరల్డ్ రగ్బీ’ సంస్థ తన ‘ఎవరూ ఆపలేని జాబితా’లో చేర్చింది!
ఉత్తర బెంగాల్‌లోని సిలిగురికి తూర్పు వైపున.. బైకాంత్‌పూర్ అటవీ ప్రాంతంలో ఉంటుంది సరస్వతీపూర్ గ్రామం. మూడు వైపులా ఇంతెత్తున గ్రామాన్ని కనిపించనివ్వకుండా గుగ్గిలం కలప చెట్లు ఉంటాయి. సాల్ వృక్షాలు అంటారు వాటినే. గ్రామానికి నాలుగో వైపున తీస్తానది ప్రవహిస్తూ ఉంటుంది. ఏనుగులైతే ఇక గుంపులుగా సరస్వతీపూర్‌కు వచ్చిపోతుండే అతిథులు. ఇప్పుడా ఊరికి కొత్త వెలుగు వచ్చింది! ప్రభుత్వం ఇటీవలే వేయించిన కరెంట్ పోల్స్ వల్ల వచ్చిన విద్యుద్దీప కాంతుల వెలుగు కాదది.
సంధ్యారాయ్ అనే ఆ ఊరి అమ్మాయి డిసెంబర్ 23 న ‘వరల్డ్ రగ్బీ అన్‌స్టాపబుల్’ జాబితాలో చోటు సంపాదించి ఊరి పేరు వెలిగిపోయేలా చేసింది. ‘వరల్డ్ రగ్బీ’ సంస్థ ఏటా ‘అన్‌స్టాపబుల్’ అని అత్యుత్తమ ప్రతిభ కనబరుస్తున్న క్రీడాకారిణుల పేర్లను ప్రకటిస్తుంది. ప్రతిభ మాత్రమే కాదు. వాళ్లది స్ఫూర్తివంతమైన జీవన పోరాటం అయి ఉండాలి. ఈసారి వరల్డ్ రగ్బీ–‘ఆసియా అన్‌స్టాపబుల్స్’ ప్రకటించిన 32 మంది రగ్బీ మహిళా క్రీడాకారులలో సంధ్యారాయ్ పేరు కూడా ఉంది! ఇండియా నుంచి ముగ్గురు ఎంపికైతే వారిలో సంధ్య ఒకరు. ఇరవై ఏళ్ల సంధ్య అంత తేలిగ్గా ఏమీ ఈ స్థాయికి చేరుకోలేదు. రగ్బీ ఫుట్‌బాల్ ఎంత కఠినమైదో, సంధ్య ఇంటి పరిస్థితులు అంతకుమించిన కాఠిన్యం గలవి.
∙∙
సరస్వతీపూర్‌లో నిన్నమొన్నటి వరకు కరెంట్ లేనట్లే, ఆ ఊళ్లో టెన్త్ దాటి చదివిన అమ్మాయిలూ లేరు. సంధ్య కూడా అక్కడితో ఆగిపోయి ఉండేదే. సంధ్య తల్లిదండ్రులు తేయాకు తోటల్లో ఆకులు తెంపే దినసరి కూలీలు. సంధ్య కూడా పదో తరగతి వరకు ఆకులు తెంపడానికి వెళ్లింది. తెలివైన అమ్మాయి కనుక టెన్త్ ఎటూ పాస్ అయి ఉండేది. అడవికే పరిమితమైన జీవనం కనుక ఆమె తెలివితేటలు సాల్ వృక్షాలను దాటి, ఏనుగులను దాటి, తీస్తా నదిని దాటి వెలుపలికి విస్తరించేవి కావు. తిరిగి తల్లిదండ్రులతో కలిసి ఆకులు తెంపడానికి వెళుతుండేది.
అయితే 2013లో జరిగిన ఒక ‘ఈవెంట్’ ఆమె జీవితాన్ని రగ్బీ వైపు తిప్పింది. అందుకు మూడు శక్తులు పని చేశాయి. జార్జి మాథ్యూ అనే క్యాథలిక్ మత ప్రబోధకుడు ఒకరు. సర్వతీపూర్‌లో స్థానికంగా నివసించే సిలిగురి సెలేషియన్ కాలేజ్ ఫిజికల్ డైరెక్టర్ ఒకరు. కోల్‌కతాలోని ‘జంగిల్ క్రోస్’ అనే ఔత్సాహిక రగ్బీ టీమ్ లీడర్ ఒకరు. జార్జి మాథ్యూ కోల్‌కతాలోని డాన్ బాస్కో ఆశాలయం ఇన్‌చార్జి. రగ్బీ ఆట మీద ఆయనకు పట్టు ఉంది. అటవీ ప్రాంతాల్లోని పిల్లలు ఆ ఆటకు పట్టునిస్తారని నమ్మకం ఉంది. అడవుల్లోని ఊళ్లన్నీ తిరుగుతూ సరస్వతీపూర్ కూడా వచ్చి కొన్నాళ్లు అక్కడే ఉన్నారు.
‘జంగిల్ క్రోస్’ రగ్బీ టీమ్ ఆయనకు పరిచయమే. సిలిగురి కాలేజ్ ఫిజికల్ డైరెక్టర్‌తో మాట్లాడుతున్నప్పుడు ఇక్కడి పిల్లలకు కూడా రగ్బీ నేర్పిస్తే బాగుంటుందన్న ఆలోచన వచ్చింది జార్జి మేథ్యూకి. ఇద్దరూ అనుకుని రగ్బీలో శిక్షణ ఇచ్చేందుకు జంగిల్ క్రోస్‌ని సిలిగురి కాలేజ్‌కి తెప్పించారు. అక్కడ పడింది సంధ్యారాయ్‌కి రగ్బీలోకి తొలి అడుగు. ఆమెతో పాటు తొమ్మిది మంది బాలికలు శిక్షణ తీసుకున్నారు. అక్కడి నుంచే సంధ్యారాయ్ ‘అన్‌స్టాపబుల్’ జర్నీ మొదలైంది.
తేయాకు తెంపడానికి వెళుతున్న అమ్మాయిని ఆ తోటల్లోంచి రగ్బీ తెంపుకుపోయింది. రగ్బీలోనే తను భవిష్యత్తు ఉందని సంధ్య తెలుసుకుంది. ఈ ఏడేళ్లలో జాతీయంగా జరిగిన అనేక రగ్బీ పోటీలలో తనేంటో, తన టీమేంటో చూపించింది సంధ్య! ఆటలోని ఆమె ఒడుపును చూసి రాహుల్ బోస్ అంతటి వ్యక్తే మంత్రముగ్ధుడయ్యారు. బోస్ సినిమా నటుడిగా, డైరెక్టర్‌గానే ప్రసిద్ధి. రగ్బీలో కూడా ఆయన చాంపియన్. ఇంటర్నేషనల్ ప్లేయర్. ‘రగ్బీ అన్‌స్టాపబుల్’ జాబితాలో సంధ్యకు ఓటు వేసిన వారిలో బోస్ కూడా ఉన్నారు. ‘‘పేదింటి నుంచి వచ్చిన అమ్మాయి, కరెంటు లేని ఊరి నుంచి వచ్చిన అమ్మాయి రగ్బీలో నేషనల్ ప్లేయర్‌గా రాణించడం సాధారణమైన సంగతేమీ కాదు’’ అని ఆయన ప్రశంసించారు.
∙∙
టెన్త్ తర్వాత తన చదువేదో తను, తన రగ్బీ ఏదో తను చూసుకోలేదు సంధ్య. ఊళ్లోని అమ్మాయిల్నీ తనలా రగ్బీ ప్లేయర్‌లను చేసేందుకు ‘జంగిల్ క్రోస్’తో కలిసి ‘పాస్ ఫర్ ప్యాషన్’ అనే ప్రచారోద్యమాన్ని ప్రారంభించింది. ‘ఖేలో రగ్బీ’ అనే ప్రాజెక్టు కింద బాలికలకు రగ్బీలో ఆసక్తిని కలుగజేసి, వారికి తర్ఫీదు ఇప్పిస్తోంది. ఆగకుండా సాగిపోతోంది. సంధ్యపై ఒక డాక్యుమెంటరీ కూడా వచ్చింది! కాకులు దూరని కారడవిలోని ఒక గ్రామానికి రగ్బీ ఆటతో పేరు తెచ్చిన అమ్మాయి అంటూ బెంగాలీ నిర్మాత రోహన్ చక్రవర్తి ఆ డాక్యుమెంటరీని తీశారు. ఇంత ప్రేరణనిచ్చే కెరీర్ కనుకే వరల్డ్ రగ్బీ సంధ్యను ‘అన్‌స్టాపబుల్’ క్రీడాకారిణిగా గుర్తించింది. సంధ్య ప్రస్తుతం కోల్‌కతాలో స్పోర్ట్స్ మేనేజ్‌మెంట్ కోర్సు చేస్తోంది. సెలవులకు ఇప్పుడు సరస్వతీపూర్‌లోనే ఉంది. ఆ విరామాన్ని ఆమె ఊరికే గడపడం లేదు. గ్రామంలోని పిల్లలకు రగ్బీలో ట్రైనింగ్ ఇస్తోంది.
తల్లితో సంధ్య
టీమ్‌లో.. (కుడి నుంచి రెండో ప్లేయర్)
Comments
Please login to add a commentAdd a comment