rugby
-
భారత మహిళల రగ్బీ జట్టుకు రజత పతకం
ముంబై: ఆసియా రగ్బీ ఎమిరేట్స్ సెవెన్స్ ట్రోఫీలో భారత మహిళల జట్టు రజత పతకం కైవసం చేసుకుంది. నేపాల్‌లో జరిగిన ఈ టోర్నీ ఫైనల్లో భారత్ 5–7 పాయింట్ల తేడాతో ఫిలిప్పీన్స్ చేతిలో ఓటమి పాలైంది. శిఖా యాదవ్ సారథ్యంలోని భారత జట్టు అంతకుముందు సెమీఫైనల్లో 24–7 తేడాతో గువామ్‌పై గెలిచి పట్టికలో అగ్రస్థానంతో తుదిపోరుకు చేరింది. లీగ్ దశలో భారత్ 29–10 తేడాతో శ్రీలంకపై... 17–10తో ఇండోనేసియాపై గెలిచి సంపూర్ణ ఆధిపత్యం కనబర్చింది. ఈ టోర్నీలో మరోసారి రజతం గెలవడం ఆనందంగా ఉందని శిఖా యాదవ్ పేర్కొంది. ‘ప్లేయర్లంతా సమష్టిగా సత్తా చాటారు. కఠిన ప్రత్యర్థులపై చక్కటి ప్రదర్శన కనబర్చడం వల్లే రజత పతకం సాధించగలిగాం. సహచరుల ఆటతీరుతో గర్వపడుతున్నా. ఈ విజయంలో కోచ్‌లతోపాటు సహాయక సిబ్బంది పాత్ర ఎంతో ఉంది’అని శిఖా యాదవ్ చెప్పింది. -
మొన్న స్విమ్మింగ్.. ఇవాళ రగ్బీ; ట్రాన్స్జెండర్లకు వరుస అవమానాలు
ప్రస్తుతం ప్రపంచంలో ట్రాన్స్జెండర్లకు దాదాపు అన్ని దేశాలు తమ పౌరులతో సమానంగా హక్కులు కల్పిస్తున్నాయి. అన్ని రంగాల్లో ట్రాన్స్జెండర్లు ముందుకు వెళ్తుంటే క్రీడల్లో మాత్రం వెనక్కి వెళ్తున్నట్లుగా అనిపిస్తుంది. ట్రాన్స్జెండర్లను ఆడించడం వల్ల ఆట సమతుల్యం దెబ్బతింటుందని అంతర్జాతీయ స్విమ్మింగ్ ఫెడరేషన్ ఇటీవలే పేర్కొంది. లింగమార్పిడి చేసుకున్న స్విమ్మర్లు పురుషుల యుక్త వయస్సు దాటితే మహిళల ఎలైట్ రేసుల్లో పాల్గొనరాదని.. అందుకే స్విమ్మింగ్‌లో ట్రాన్స్జెండర్లు పాల్గొనకుండా నిషేధిస్తునట్లు నిర్ణయం తీసుకుంది. తాజాగా అంతర్జాతీయ రగ్బీ లీగ్(ఐఆర్ఎల్) కూడా అదే బాటలో నడిచింది. ఇక నుంచి జరగబోయే అంతర్జాతీయ మహిళల రగ్బీ మ్యాచ్‌ల్లో ట్రాన్స్‌జెండర్ ప్లేయర్లను ఆడించకూడదంటూ ఆదేశాలు జారీ చేసింది. ట్రాన్స్జెండర్లను రగ్బీ ఆడించేందుకు సరికొత్త పాలసీలు తీసుకు రావాల్సి ఉంది. ప్రపంచ క్రీడలో సంబంధిత పరిణామాలను పరిగణనలోకి తీసుకుని ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లు తెలిపింది. రగ్బీ లీగ్‌లో ట్రాన్స్జెండర్లను ఆడించే విషయంలో ఇంకా పూర్తిస్తాయిలో పరిశోధన జరగాల్సి ఉందని ఐఆర్ఎల్ అభిప్రాయపడింది. ఐఆర్ఎల్ తాజా నిర్ణయంతో అక్టోబర్ లో ఇంగ్లండ్ వేదికగా జరుగనున్న రగ్బీ లీగ్ మహిళల ప్రపంచకప్‌లో ట్రాన్స్‌జెండర్ కీడ్రాకారులు పాల్గొనే అవకాశం లేనట్లే. ఈ ప్రపంచకప్‌లో ఆస్ట్రేలియా, బ్రెజిల్, ఇంగ్లండ్, ఫ్రాన్స్, న్యూజిలాండ్, పపువా న్యూగినియా లాంటి జట్లు పోటీ పడుతున్నాయి. కాగా అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ(ఐఓసీ) ఈ ఏడాది ప్రారంభంలో ట్రాన్స్జెండర్లకు ఆటల్లో పాల్గొనే హక్కులకు సంబంధించిన విధానాలను రూపొందించింది. ఈ నేపథ్యంలో ప్రపంచంలోని క్రీడా సమాఖ్యలన్నీ ట్రాన్స్జెండర్లు క్రీడల్లో పాల్గొనేందుకు కొత్త నిబంధనలు రాసుకునే పనిలో ఉన్నాయి. ఇక ట్రాన్స్జెండర్లను రగ్బీ లీగ్ నుంచి నిషేధించడంపై క్రీడాలోకం భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేసింది. కొందరేమో.. 'వారు ఆడకపోతే మంచిదని' పేర్కొనగా.. 'ట్రాన్స్జెండర్లకు ఇది అవమానమే' అని మరికొందరు తెలిపారు. ఈ విషయంలో ట్రాన్స్జెండర్లు స్పందిస్తూ.. ఇది క్రీడల ప్రాథమిక సూత్రానికి విరుద్ధమని .. సమానత్వం కోసం పాటుపడే క్రీడల్లో ఇలా వివక్ష చూపడం సరైనది కాదని అభిప్రాయపడ్డారు. చదవండి: Cristiano Ronaldo: కోట్ల విలువైన కారుకు యాక్సిడెంట్.. రొనాల్డో క్షేమంగానే వింబుల్డన్ ఆడేందుకు రష్యా పౌరసత్వాన్ని వదులుకునేందుకు సిద్ధమైన టెన్నిస్ క్రీడాకారిణి -
అన్‌స్టాపబుల్ సంధ్య
రోజు కూలి కోసం తేయాకు తోటల్లో ఆకులు తెంపుతున్న సంధ్యను తోటలోకి వచ్చి రగ్బీ తెంపుకుపోయింది! ఇప్పుడామె ‘అన్‌స్టాపబుల్’ రగ్బీ ప్లేయర్! పేదరికం నుంచి, కరెంటే లేని కొండాకోనల గ్రామం నుంచి జాతీయ స్థాయి ప్లేయర్‌గా ఎదిగిన సంధ్యను స్ఫూర్తివంతమైన క్రీడాకారిణిగా ‘వరల్డ్ రగ్బీ’ సంస్థ తన ‘ఎవరూ ఆపలేని జాబితా’లో చేర్చింది! ఉత్తర బెంగాల్‌లోని సిలిగురికి తూర్పు వైపున.. బైకాంత్‌పూర్ అటవీ ప్రాంతంలో ఉంటుంది సరస్వతీపూర్ గ్రామం. మూడు వైపులా ఇంతెత్తున గ్రామాన్ని కనిపించనివ్వకుండా గుగ్గిలం కలప చెట్లు ఉంటాయి. సాల్ వృక్షాలు అంటారు వాటినే. గ్రామానికి నాలుగో వైపున తీస్తానది ప్రవహిస్తూ ఉంటుంది. ఏనుగులైతే ఇక గుంపులుగా సరస్వతీపూర్కు వచ్చిపోతుండే అతిథులు. ఇప్పుడా ఊరికి కొత్త వెలుగు వచ్చింది! ప్రభుత్వం ఇటీవలే వేయించిన కరెంట్ పోల్స్ వల్ల వచ్చిన విద్యుద్దీప కాంతుల వెలుగు కాదది. సంధ్యారాయ్ అనే ఆ ఊరి అమ్మాయి డిసెంబర్ 23 న ‘వరల్డ్ రగ్బీ అన్‌స్టాపబుల్’ జాబితాలో చోటు సంపాదించి ఊరి పేరు వెలిగిపోయేలా చేసింది. ‘వరల్డ్ రగ్బీ’ సంస్థ ఏటా ‘అన్‌స్టాపబుల్’ అని అత్యుత్తమ ప్రతిభ కనబరుస్తున్న క్రీడాకారిణుల పేర్లను ప్రకటిస్తుంది. ప్రతిభ మాత్రమే కాదు. వాళ్లది స్ఫూర్తివంతమైన జీవన పోరాటం అయి ఉండాలి. ఈసారి వరల్డ్ రగ్బీ–‘ఆసియా అన్‌స్టాపబుల్స్’ ప్రకటించిన 32 మంది రగ్బీ మహిళా క్రీడాకారులలో సంధ్యారాయ్ పేరు కూడా ఉంది! ఇండియా నుంచి ముగ్గురు ఎంపికైతే వారిలో సంధ్య ఒకరు. ఇరవై ఏళ్ల సంధ్య అంత తేలిగ్గా ఏమీ ఈ స్థాయికి చేరుకోలేదు. రగ్బీ ఫుట్‌బాల్ ఎంత కఠినమైదో, సంధ్య ఇంటి పరిస్థితులు అంతకుమించిన కాఠిన్యం గలవి. ∙∙ సరస్వతీపూర్లో నిన్నమొన్నటి వరకు కరెంట్ లేనట్లే, ఆ ఊళ్లో టెన్త్ దాటి చదివిన అమ్మాయిలూ లేరు. సంధ్య కూడా అక్కడితో ఆగిపోయి ఉండేదే. సంధ్య తల్లిదండ్రులు తేయాకు తోటల్లో ఆకులు తెంపే దినసరి కూలీలు. సంధ్య కూడా పదో తరగతి వరకు ఆకులు తెంపడానికి వెళ్లింది. తెలివైన అమ్మాయి కనుక టెన్త్ ఎటూ పాస్ అయి ఉండేది. అడవికే పరిమితమైన జీవనం కనుక ఆమె తెలివితేటలు సాల్ వృక్షాలను దాటి, ఏనుగులను దాటి, తీస్తా నదిని దాటి వెలుపలికి విస్తరించేవి కావు. తిరిగి తల్లిదండ్రులతో కలిసి ఆకులు తెంపడానికి వెళుతుండేది. అయితే 2013లో జరిగిన ఒక ‘ఈవెంట్’ ఆమె జీవితాన్ని రగ్బీ వైపు తిప్పింది. అందుకు మూడు శక్తులు పని చేశాయి. జార్జి మాథ్యూ అనే క్యాథలిక్ మత ప్రబోధకుడు ఒకరు. సర్వతీపూర్లో స్థానికంగా నివసించే సిలిగురి సెలేషియన్ కాలేజ్ ఫిజికల్ డైరెక్టర్ ఒకరు. కోల్‌కతాలోని ‘జంగిల్ క్రోస్’ అనే ఔత్సాహిక రగ్బీ టీమ్ లీడర్ ఒకరు. జార్జి మాథ్యూ కోల్‌కతాలోని డాన్ బాస్కో ఆశాలయం ఇన్చార్జి. రగ్బీ ఆట మీద ఆయనకు పట్టు ఉంది. అటవీ ప్రాంతాల్లోని పిల్లలు ఆ ఆటకు పట్టునిస్తారని నమ్మకం ఉంది. అడవుల్లోని ఊళ్లన్నీ తిరుగుతూ సరస్వతీపూర్ కూడా వచ్చి కొన్నాళ్లు అక్కడే ఉన్నారు. ‘జంగిల్ క్రోస్’ రగ్బీ టీమ్ ఆయనకు పరిచయమే. సిలిగురి కాలేజ్ ఫిజికల్ డైరెక్టర్‌తో మాట్లాడుతున్నప్పుడు ఇక్కడి పిల్లలకు కూడా రగ్బీ నేర్పిస్తే బాగుంటుందన్న ఆలోచన వచ్చింది జార్జి మేథ్యూకి. ఇద్దరూ అనుకుని రగ్బీలో శిక్షణ ఇచ్చేందుకు జంగిల్ క్రోస్ని సిలిగురి కాలేజ్‌కి తెప్పించారు. అక్కడ పడింది సంధ్యారాయ్కి రగ్బీలోకి తొలి అడుగు. ఆమెతో పాటు తొమ్మిది మంది బాలికలు శిక్షణ తీసుకున్నారు. అక్కడి నుంచే సంధ్యారాయ్ ‘అన్‌స్టాపబుల్’ జర్నీ మొదలైంది. తేయాకు తెంపడానికి వెళుతున్న అమ్మాయిని ఆ తోటల్లోంచి రగ్బీ తెంపుకుపోయింది. రగ్బీలోనే తను భవిష్యత్తు ఉందని సంధ్య తెలుసుకుంది. ఈ ఏడేళ్లలో జాతీయంగా జరిగిన అనేక రగ్బీ పోటీలలో తనేంటో, తన టీమేంటో చూపించింది సంధ్య! ఆటలోని ఆమె ఒడుపును చూసి రాహుల్ బోస్ అంతటి వ్యక్తే మంత్రముగ్ధుడయ్యారు. బోస్ సినిమా నటుడిగా, డైరెక్టర్‌గానే ప్రసిద్ధి. రగ్బీలో కూడా ఆయన చాంపియన్. ఇంటర్నేషనల్ ప్లేయర్. ‘రగ్బీ అన్‌స్టాపబుల్’ జాబితాలో సంధ్యకు ఓటు వేసిన వారిలో బోస్ కూడా ఉన్నారు. ‘‘పేదింటి నుంచి వచ్చిన అమ్మాయి, కరెంటు లేని ఊరి నుంచి వచ్చిన అమ్మాయి రగ్బీలో నేషనల్ ప్లేయర్‌గా రాణించడం సాధారణమైన సంగతేమీ కాదు’’ అని ఆయన ప్రశంసించారు. ∙∙ టెన్త్ తర్వాత తన చదువేదో తను, తన రగ్బీ ఏదో తను చూసుకోలేదు సంధ్య. ఊళ్లోని అమ్మాయిల్నీ తనలా రగ్బీ ప్లేయర్లను చేసేందుకు ‘జంగిల్ క్రోస్’తో కలిసి ‘పాస్ ఫర్ ప్యాషన్’ అనే ప్రచారోద్యమాన్ని ప్రారంభించింది. ‘ఖేలో రగ్బీ’ అనే ప్రాజెక్టు కింద బాలికలకు రగ్బీలో ఆసక్తిని కలుగజేసి, వారికి తర్ఫీదు ఇప్పిస్తోంది. ఆగకుండా సాగిపోతోంది. సంధ్యపై ఒక డాక్యుమెంటరీ కూడా వచ్చింది! కాకులు దూరని కారడవిలోని ఒక గ్రామానికి రగ్బీ ఆటతో పేరు తెచ్చిన అమ్మాయి అంటూ బెంగాలీ నిర్మాత రోహన్ చక్రవర్తి ఆ డాక్యుమెంటరీని తీశారు. ఇంత ప్రేరణనిచ్చే కెరీర్ కనుకే వరల్డ్ రగ్బీ సంధ్యను ‘అన్‌స్టాపబుల్’ క్రీడాకారిణిగా గుర్తించింది. సంధ్య ప్రస్తుతం కోల్‌కతాలో స్పోర్ట్స్ మేనేజ్మెంట్ కోర్సు చేస్తోంది. సెలవులకు ఇప్పుడు సరస్వతీపూర్లోనే ఉంది. ఆ విరామాన్ని ఆమె ఊరికే గడపడం లేదు. గ్రామంలోని పిల్లలకు రగ్బీలో ట్రైనింగ్ ఇస్తోంది. తల్లితో సంధ్య టీమ్‌లో.. (కుడి నుంచి రెండో ప్లేయర్) -
నిబంధనలు పాటించకుంటే నో ఎంట్రీ
కాన్బెర్రా: కోవిడ్ ఐసోలేషన్ నిబంధనలు ఉల్లంఘించిన మరో ఆస్ట్రేలియా ఆటగాడిపై చర్యలు తప్పలేదు. ఆటగాళ్ల రక్షణకు ఏర్పాటు చేసిన బయో సెక్యురిటీ బబుల్ నుంచి బయటకు వెళ్లిన బ్రిస్బేన్ బ్రోన్కాస్ ఫార్వార్డ్ ఆటగాడు తెవిట పంగై జూనియర్‌కు 30 వేల ఆస్ట్రేలియా డాలర్ల జరిమానా విధిస్తూ నేషనల్ రగ్బీ లీగ్ నిర్ణయం తీసుకుంది. నిబంధనలు అతిక్రమించిన పంగైని ఇప్పుడుడప్పుడే బయో సెక్యూర్ ప్రాంతంతోకి అనుమతించబోమని ఎన్ఆర్ఎల్ చీఫ్ అబ్డో వెల్లడించారు. నిర్ణీత సమయం, ప్రొటోకాల్స్ అనంతరమే లోపలికి వచ్చేందుకు అతనికి ఎంట్రీ ఉటుందని స్పష్టం చేశారు. కరోనా క్లిష్ట పరిస్థితుల నేపథ్యంలో కట్టుదిట్టమైన రక్షణ చర్యల మధ్య నేషనల్ రగ్బీ లీగ్ నిర్వహణకు ఏర్పాట్లు జరుగుతున్నాయని పేర్కొన్నారు. కాగా, ఆగస్టు 1 న 10 మంది రగ్బీ ఆటగాళ్లు పబ్‌కు వెళ్లారని, వారిలో పంగై ఉన్నట్టు తెలిసిందని అబ్డో చెప్పారు. ఈ ఘటనపై విచారణ జరగుతోందని తెలిపారు. ఇక ఇప్పటికే బయో సెక్యూర్ నుంచి బయటికి వెళ్లిన ఏడుసార్లు జాతీయ రగ్బీ ప్రీమియర్ షిప్ పొందిన జట్లకు కోచ్ వేన్ బెన్నెట్‌పై కూడా చర్యలు తప్పలేదు. ఆయనను బలవంతంగా 14 రోజుల క్వారంటైన్లో ఉండాలని నేషనల్ రగ్బీ లీగ్ స్పష్టం చేసింది. దీంతోపాటు ఆస్ట్రేలియా ఫుట్‌బాల్ లీగ్ కోచ్ నాథన్ బక్లే, అతని సహాయకుడు బ్రెంటన్ సాండర్సన్పై ఆస్ట్రేలియా ఫుట్‌బాల్ లీగ్ 25,000 ఆస్ట్రేలియన్ డాలర్లు చొప్పున జరిమాన విధించింది. మరోవైపు కఠినమైన నిబంధనల కారణంగా జైళ్లో బంధించిన ఫీలింగ్ కలుగుతోందని ఆటగాళ్లు చెప్తున్నారు. -
తెలంగాణ జట్ల ఓటమి
సాక్షి, హైదరాబాద్: ఎస్జీఎఫ్ఐ జాతీయ రగ్బీ చాంపియన్‌షిప్‌ను తెలంగాణ జట్లు ఓటమితో ప్రారంభించాయి. లాల్‌బహదూర్ స్టేడియంలో జరుగుతోన్న ఈ టోర్నీలో తెలంగాణ జట్లు తలపడిన మూడు మ్యాచుల్లోనూ పరాజయాన్ని చవిచూశాయి. గురువారం జరిగిన అండర్–17 బాలుర తొలి మ్యాచ్‌లో తెలంగాణ 0–21తో బిహార్ చేతిలో, రెండో మ్యాచ్‌లో 0–10తో పంజాబ్ చేతిలో చిత్తుగా ఓడింది. మరో మ్యాచ్‌లో ఆంధ్రప్రదేశ్ 0–20తో పంజాబ్ చేతిలో ఓడిపోయింది. అండర్–19 విభాగంలోనూ ఛత్తీస్‌గఢ్ 7–0తో తెలంగాణపై గెలుపొందింది. ఇతర మ్యాచ్‌ల్లో ఛత్తీస్‌గఢ్ 25–0తో జమ్మూ కశ్మీర్‌పై, ఒడిశా 14–0తో గుజరాత్‌పై, ఢిల్లీ 14–7తో పంజాబ్‌పై, బిహార్ 34–0తో రాజస్తాన్‌పై, జమ్మూ కశ్మీర్ 15–0తో విద్యాభారతిపై విజయం సాధించాయి. ఇతర మ్యాచ్‌ల ఫలితాలు అండర్–17 బాలురు: బిహార్ 0–22తో ఆంధ్రప్రదేశ్‌పై, ఢిల్లీ 15–0తో గుజరాత్‌పై, రాజస్తాన్ 5–0తో ఛత్తీస్‌గఢ్‌పై నెగ్గాయి.బాలికలు: తమిళనాడు 18–0తో పంజాబ్‌పై, ఛత్తీస్‌గఢ్ 17–0తో రాజస్తాన్‌పై, ఒడిశా 22–0తో జమ్మూ కశ్మీర్‌పై, బిహార్ 27–0తో గుజరాత్‌పై, పంజాబ్ 10–0తో ఆంధ్రప్రదేశ్‌పై, ఢిల్లీ 5–0తో ఛత్తీస్‌గఢ్‌పై గెలిచాయి. -
జాతీయ రగ్బీ టోర్నీ షురూ
సాక్షి, హైదరాబాద్: భాగ్యనగరం మరో జాతీయ స్థాయి టోర్నమెంట్‌కు ఆతిథ్యమిచ్చింది. భా రత స్కూల్ గేమ్స్ సమాఖ్య (ఎస్జీఎఫ్ఐ) రగ్బీ జాతీయ చాంపియన్‌షిప్ బుధవారం ప్రారంభమైంది. ఎల్బీ స్టేడియంలో జరిగిన టోర్నీ ప్రారంభోత్సవంలో శాట్స్ చైర్మన్ అల్లిపురం వెంకటేశ్వర్ రెడ్డి ముఖ్య అతిథిగా విచ్చేసి పోటీలను ప్రారంభించారు. మొత్తం 14 రాష్ట్రాలకు చెందిన జట్లు ఇందులో తలపడుతున్నాయి. మూడు రోజుల పాటు ఈ టోర్నీ జరుగుతుంది. ఈ సందర్భంగా శాట్స్ చైర్మన్ వెంకటేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ ఆసియా రగ్బీ చాంపియన్‌షిప్‌ను కూడా నగరంలో నిర్వహించేందుకు సహకరిస్తామని తెలిపారు. -
ఫైనల్స్‌కు కర్నూలు, గుంటూరు
- హోరాహోరీగా రగ్బీ పోటీలు కర్నూలు(టౌన్): నగర శివారులోని మాంటిస్సోరి ఇండస్ స్కూల్లో రగ్బీ చాంపియన్‌షిప్ క్రీడాపోటీలు హోరాహోరీగా సాగుతున్నాయి. శనివారం జరిగిన పోటీల్లో ప్రతిభ కనబరిచి పురుషుల విభాగంలో కర్నూలు, గుంటూరు జట్లు, మహిళల విభాగంలో కడప, కర్నూలు జట్లు ఫైనల్స్‌కు చేరుకున్నాయి. పురుషుల మొదటి సెమీఫైనల్లో కర్నూలు జట్టు 12–0 స్కోరుతో నెల్లూరు జట్టుపై విజయం సాధించి ఫైనల్స్‌కు చేరుకుంది. అలాగే రెండో సెమీఫైనల్ పోటీలో గుంటూరు జట్టు 5–0 స్కోరుతో చిత్తూరు జట్టుపై గెలుపొంది ఫైనల్స్‌కు చేరింది. మహిళా విభాగం మొదటి సెమీఫైనల్లో కర్నూలు జట్టు 20–0 స్కోరుతో నెల్లూరుపై, కడప జట్టు 5–0 స్కోరుతో గుంటూరు జట్టుపై నెగ్గి ఫైనల్స్‌కు చేరుకుంది. ఈ పోటీల్లో రాష్ట్రంలోని పది జిల్లాలకు చెందిన రగ్బీ క్రీడాకారులు పాల్గొన్నారు. లీగ్ కమ్ నాకౌట్ పద్ధతిలో పోటీలు జరుగుతున్నాయి. ఇండియన్ రగ్బీ ఫుట్‌బాల్ యూనియన్ రెఫరీలుగా నోయల్, వెంకటేష్ వ్యవహరిస్తున్నారు. -
జాతీయ స్థాయి రగ్బీ పోటీలకు ఏపీ జట్టు
వెంకటేశ్వరపురం(నంద్యాల రూరల్): ఈనెల 22 నుంచి 24 వరకు ఒరిస్సాలోని భువనేశ్వర్‌లో జరిగే 62వ జాతీయ స్థాయి స్కూల్‌గేమ్స్ అండర్–17 బాలబాలికల రగ్బీ పోటీల్లో పాల్గొనే రాష్ట్ర క్రీడాకారులను ఎంపిక చేసినట్లు రగ్బీ రాష్ట్ర సంఘం ప్రధాన కార్యదర్శి రామాంజనేయులు తెలిపారు. మంగళవారం నంద్యాల సమీపంలోని వెంకటేశ్వరపురం వద్ద ఉన్న ఎస్డీఆర్ వరల్డ్ స్కూల్లో రాష్ట్ర జట్టు క్రీడాకారులతో స్కూల్ చైర్మన్ కొండారెడ్డి ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బాలికల జట్టు కర్నూలు శ్రీలక్ష్మిప్రియ, గురురుషిక, చిట్టెమ్మ, శ్రీవల్లి, భారతి, అనూష, శివాణి, నెల్లూరుకు చెందిన శిల్పా, సాయివిహారిక, చిత్తూరుకు చెందిన జాహ్నవి, కడపకు చెందిన భవ్య నందిని, బాలుర విభాగంలో కర్నూలుకు చెందిన దివాకర్, సురేంద్ర, సందీప్, నెల్లూరుకు చెందిన షబ్బీర్, నవీన్, అబ్దుల్లా, శ్రీకాంత్, గుంటూరుకు చెందిన సాయిరంజిత్, గురుకృష్ణ, చిత్తూరుకు చెందిన శంకర్, మోహన్, కడపకు చెందిన ప్రవీణ్‌కుమార్‌లు ఎంపికయ్యారని వివరించారు. -
రగ్బీ విజేత కర్నూలు
వెంకటేశ్వరపురం (నంద్యాలరూరల్): రాష్ట్రస్థాయి 62వ స్కూల్‌గేమ్స్ అండర్–17 బాల బాలికల రగ్బీ పోటీల్లో కర్నూలు బాలికల జట్టు విజయకేతనం ఎగుర వేసింది. బాలుర విభాగంలో గుంటూరు జట్టు ప్రథమ స్థానంలో నిలిచింది. బాలికల విభాగంలో నెల్లూరు జట్టు రజితం, చిత్తూరు జట్టు కాంస్య పతకాలు, బాలుర విభాగంలో నెల్లూరు జట్టు రజితం, కడప జట్టు కాంస్య పతకాలు సాధించాయి. మంగళవారం ఎస్డీఆర్ వరల్డ్ స్కూల్ ఆవరణలో విజేతలకు బహుమతులు ప్రదానం చేశారు. ఈ సందర్భంగా రాష్ట్ర స్కూల్ గేమ్స్ రగ్బీ సంఘ ప్రధాన కార్యదర్శి రామాంజనేయులు మాట్లాడుతూ..పోటీల్లో 8 జిల్లాల జట్లు పాల్గొని తమ ప్రతిభను చాటాయన్నారు. స్కూల్ చైర్మన్ కొండారెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో జిల్లా రగ్బీ అసోసియేషన్ అధ్యక్షుడు సురేందర్, జిల్లా స్కూల్ గేమ్ సెక్రటరీ లక్ష్మినర్సయ్య తదితరులు పాల్గొన్నారు. -
27న జిల్లా స్థాయి రగ్బీ జట్టు ఎంపిక
కర్నూలు(టౌన్): నంద్యాల ఎస్డీఆర్ స్కూల్ మైదానంలో జిల్లాస్థాయి అండర్–17 రగ్బీ బాలబాలికల జట్లకు సంబంధించి క్రీడాకారుల ఎంపిక ఈ నెల 27న నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు సి. రామాంజనేయులు సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఎంపికైన క్రీడాకారులు ఈనెల 28న నంద్యాల ఎస్డీఆర్ స్కూలు మైదానంలో నిర్వహిస్తున్న 62వ రాష్ట్ర స్థాయి స్కూలుగేమ్స్ రగ్బీ (అండర్–17) పోటీల్లో పాల్గొంటారన్నారు. జిల్లాస్థాయి ఎంపిక పోటీల్లో పాల్గొనే ఆసక్తి కలిగిన క్రీడాకారులు వయస్సు ధ్రువీకరణ పత్రాలతో 27వ తేదీ మధ్యాహ్న 3 గంటలకు హాజరు కావాలని పేర్కొన్నారు. -
ఒలింపిక్స్ చరిత్రలో ఫిజీకి తొలి స్వర్ణం
రియో ఒలింపిక్స్ రగ్బీ సెవన్స్ టైటిల్‌ను ఫిజీ జట్టు గెలుచుకుంది.ఫైనల్లో బ్రిటన్‌పై 43-7తో గెలిచిన ఫిజీకి.. ఆ దేశ చరిత్రలో ఇదే తొలి ఒలింపిక్స్ మెడల్ కావడం విశేషం. 92 ఏళ్ల విరామం తర్వాత ఈసారే ఒలింపిక్స్‌లోకి రగ్బీ ప్రవేశపెట్టారు. క్వార్టర్స్‌లో అమెరికాను 24-19తో, సెమీస్‌లో జపాన్ను 20-5తో ఓడించిన ఫిజీ.. ఫైనల్స్‌లో భారీ ఆధిక్యంతో విజయం సాధించింది. -
క్రికెట్, రగ్బీపై దక్షిణాఫ్రికా సంచలన నిర్ణయం
దక్షిణాఫ్రికాలో అంతర్జాతీయ క్రికెట్, రగ్బీ మ్యాచులు నిర్వహించకుండా ఆ దేశ ప్రభుత్వం దాదాపు ఏడాదిపాటు నిషేధం విధించింది. క్రికెట్, రగ్బీ ఆటల్లో నల్లజాతీయులను విస్మరించి.. కేవలం శ్వేతజాతీయులకు మాత్రమే అవకాశమిస్తుండటంతో దక్షిణాఫ్రికా క్రీడామంత్రి ఫికిలి ఎంబాలులా ఈ మేరకు సంచలన నిర్ణయం తీసుకున్నారు. అంతర్జాతీయ టోర్నమెంట్లు నిర్వహించకుండా, మ్యాచులకు ఆతిథ్యం ఇవ్వకుండా జాతీయ రగ్బీ, క్రికెట్ ఫెడరేషన్లపై ఆయన నిషేధం విధించారు. రగ్బీ, క్రికెట్, ఫుట్‌బాల్, అథ్లెటిక్స్, నెట్‌బాల్.. మొత్తం ఐదు క్రీడలకు ఈ నిషేధం వర్తించనుందని ఆయన సోమవారం తెలిపారు. నల్లజాతీయులను ప్రోత్సహించడంలో ఒక్క ఫుట్‌బాల్ క్రీడ మాత్రమే ముందున్నదని, కాబట్టి ఫుట్‌బాల్‌కు ఈ నిషేధం వర్తించబోదని ఆయన తెలిపారు. దక్షిణాఫ్రికా ప్రభుత్వం నిర్ణయం వల్ల 2023 రగ్బీ వరల్డ్ కప్ నిర్వహణకు బిడ్డింగ్ దాఖలుచేసే అవకాశాన్ని ఆ దేశ బోర్డు కోల్పోనుంది. అంతర్జాతీయ టోర్నమెంట్లు, మేజర్ మ్యాచులు నిర్వహించకుండా క్రికెట్, రగ్బీ తదితర ఫెడరేషన్లపై విధించిన నిషేధంపై వచ్చే ఏడాది సమీక్ష జరుపుతానని, అప్పటివరకు ఈ నిషేధం కొనసాగుతుందని ఆయన స్పష్టం చేశారు. -
కలల విహారి
నటుడు క్రీడాకారుడు సమాజ సేవకుడు రాహుల్ వెరీవెరీ స్పెషల్ ‘ఓ 15 ఏళ్ల తర్వాత నన్ను ఎవరూ ఫలానా విధంగా గుర్తుంచుకోవాలని కోరుకోను. బతికినంత కాలం మన కలల కోసం బతకాలి. అంతే కానీ... చచ్చిన తర్వాత మనని ఎవరో... ఎందుకో గుర్తు పెట్టుకోవాల్సిన అవసరం ఏముంది? ఈ నిమిషం చనిపోయినా నాకు ఆనందమే. నన్ను గే అన్నారు... యాంటీ హ్యూమన్ అన్నారు. అన్నీ కాంప్లిమెంట్‌గా తీసుకున్నాను. నా పని నేను చేస్తూ వెళుతున్నా. ఏది చేసినా గెలిచామా? ఓడుతున్నామా? అనే లెక్కల కన్నా మన కలల కోసం చేసే ప్రయాణాన్ని ఎంజాయ్ చేస్తుండాలి. అదే నేను చేస్తున్నా’ అంటున్నారు బాలీవుడ్ నటుడు రాహుల్ బోస్. నటుడిగా... రగ్బీ క్రీడాకారుడిగా... అంతకుమించి సమాజ సేవకుడిగా గుర్తింపు పొందిన ఈ స్పెషల్ గెస్ట్‌తో చిట్‌చాట్. -సాక్షి, సిటీబ్యూరో సిటిబ్యూరో: చిన్నప్పుడు నాన్నమ్మ చిన్న గదిలో ఉండేది. రాత్రికి అక్కడికి దాదాపు 12 మంది వచ్చి పడుకునే వాళ్లు. మనసు పెద్దదైతేఇల్లూ పెద్దదే అవుతుంది అనే నమ్మకంతో పెరిగా. ఇప్పటికీ నాది రెండు గదుల ఇల్లు. నా కారు కన్నా నా ఇల్లు చిన్నగా ఉందని ఫ్రెండ్స్ అంటుంటారు. ఏ గిఫ్ట్ వచ్చినా 24 గంటలకు మించి నా దగ్గర ఉండదు. ఆర్నెళ్లకోసారి ఇంట్లోవన్నీ తీసి పంచేస్తాను. మా డ్రైవర్ ఇంట్లో చిన్న రాహుల్ బోస్ మ్యూజియమే ఉంది. చిన్న చూపే... పెద్ద మలుపు నటుడిగా తొలి నాళ్లలో ఇచ్చే ట్రీట్మెంట్ కారణంగా పడ్డ కష్టం... సినిమా విడుదలైన తరువాత వచ్చే గుర్తింపుతో తుడిచిపెట్టుకుపోతుంది. అది నా తొలి సినిమా అనుభవం నేర్పిన పాఠం. ఇక నటుడిగా, డెరైక్టర్‌గా ఏది బెటర్ అంటే... సినిమాలో నటుడిది చాలా చిన్న పాత్ర. డెరైక్టర్ సినిమాకు డిక్టేటర్. డెరైక్టర్ అనేవాడు ఔట్‌కమ్, ముగింపునుముందే ఊహించాలి. అప్పుడే అనుకున్నది చెయ్యగలరు. నటుడిగా, ఆడగాడిగా ఏది ఎక్కువ సంతోషాన్నిస్తుందనే ప్రశ్నకు సమాధానం చెప్పడం కష్టం. నటన కంటే దర్శకత్వమే సులువని నా అభిప్రాయం. మన పని మనం చేసుకుంటూ అవతలి వాళ్లని వాళ్ల పని చేసుకోనివ్వాలి. వారిని నమ్మాలి. అన్నీ మనమే నియంత్రించడం మానాలి. నా సినిమా కెరీర్లో కొన్ని దిద్దుకోలేని లోపాలు ఉన్న విషయం వాస్తవమే. ఒక్క చాన్స్... ఇక రగ్బీలో 18వ ప్లేయర్‌గా తనకు మాత్రమే అవకాశం రాకపోవడం కన్నా తనకు అవకాశం వచ్చిన ఒకే ఒకే సందర్భాన్ని ఎలా వినియోగించుకున్నాడో అదే ఆటగాడి లక్షణం. ఒంటరిగా బతకగలం... అన్నీ చేసుకోగలం అనే ఆలోచనను మార్చేసింది రగ్బీ ఆట. ఇక ఒక లీడర్‌గా... ప్లేయర్‌గా... మాములు మనిషిగా... ట్రాఫిక్ నుంచి ఆపీస్ విషయాల దాకా చాలాసార్లు బుర్ర వేడెక్కిపోయి.. మనసు చికాకు పెడుతుంది. అలాంటి సమయాల్లో చికాకును పక్కన పెట్టి... కళ్లలో ప్రశాంతతని అలాగే ఉంచి.. చెయ్యవలసిన పని మీద దృష్టి పెట్టిన వాళ్లే సచిన్ టెండూల్కర్ లాంటి గొప్పవాళ్లు.అది కష్టమే కానీ అసాధ్యం కాదు. ఇక ఇన్ని పనులు చెయ్యడానికి నాకు ప్రేరణ ఏంటి అంటే... నా వరకు నేను ఇవన్నీ ఇష్టంతో, ప్రేమతో చేస్తున్నాను. మనం ఇక్కడే ఉండాలి. మన సమాజం... మనుషులపై ప్రేమ ఉంటే ఇవన్నీ చేస్తాం. తోచింది కాదు... అవసరమైనదే ఇవ్వాలి తోటి వారికి సాయం అంటే నీకు తోచింది కాదు... వారికి అవసరమైనది అందించ డం. సునామీ సమయంలో అండమాన్ కోసం పని చేస్తున్నప్పుడు నేను తెలుసుకున్న విషయమిది. అలాగే తక్కువ ప్రామిస్ చేయాలి. ఎక్కువ ఇవ్వడం సరైన పని. ఇక సొసైటీకి ఏదైనా చెయ్యాలి అనుకుంటే... ఏడాదిలో కొన్ని గంటలైనా... డబ్బయినా మనం ఇవ్వడం ద్వారా సామాజిక బాధ్యత నెరవేర్చుకోవచ్చు. ఉదాహరణకు ఈ సిటీలో 4,861 హోటల్స్ ఉన్నాయంటున్నారు కదా. సగటునరోజుకు 200 మంది వీటికి వెళ్తారు అనుకోండి. అంటే 4 వేల హోటల్స్‌కి రోజుకి 8 లక్షల మంది... నెలకు 2 కోట్ల 40 లక్షలు. వీరికి ఒక గ్లాసు మంచి నీళ్లు సప్లై చేస్తే అందులో సగం నీళ్లు తాగి సగం వృధా చేస్తుంటారు. ఇలా నెలకు వృధా చేస్తున్న నీళ్లు 24 లక్షల లీటర్లు. ఇది వృధా చెయ్యకపోతే మనం చాలా పొదుపు చేసినట్టేగా. ఇది కూడా నా దృష్టిలో సామాజిక బాధ్యత నెరవేర్చినట్టే. నా సినిమా సెట్లలో ప్లాస్టిక్ నిషేధం... సెక్సువల్ హరాస్మెంట్ సెల్... ఆడవాళ్లకు టాయిలెట్లు లాంటి ఏర్పాట్లు ఉంటాయి. మంచిపనికి నేస్తాలెందరో... అండమాన్‌లో సునామీ తర్వాత అక్కడ సేవా కార్యక్రమాల కోసం ఫౌండేషన్ స్థాపించా. అండమాన్, కాశ్మీర్, మణిపూర్ ఇలా వెనుకబడిన ప్రాంతాల్లో కొన్ని నెలల పాటు తిరిగా. స్వస్థలంపై గౌరవం కలిగిన.... తక్కువ ఆదాయం కలిగిన కుటుంబం నుంచి వచ్చిన... సృజనాత్మకత కలిగిన పిల్లలను ఎంపిక చేస్తాం. దాదాపు రూ.5 కోట్ల ఖర్చుతో తమ ప్రాంతంలో ఉన్న పరిస్థితులను చక్కదిద్దగలిగే విద్యావంతులుగా వారిని తయారు చేస్తాం. ఒక మంచి పని కోసం అని అడిగితే చాలా మంది సాయం చేస్తారు. సినీ పరిశ్రమలో అలాంటి వారిలో జాన్ అబ్రహాం, నందిత, విద్యాబాలన్, విపుల్‌షా లాంటివారు కొందరు సేవా కార్యక్రమాల్లో ముందంజలో ఉన్నారు. -
బట్టల్లేకుండానే రగ్బీ ఆట
క్రీడ ఏదైనా క్రీడాకారులు వేసుకునే రంగురంగుల జెర్సీలు ఆటకు ప్రత్యేక ఆకర్షణ. ఆ డ్రెస్సుల్లో క్రీడాకారులు చేసే సందడి అంతా ఇంతా కాదు. కానీ న్యూజిలాండ్‌లోని డునెడిన్‌లో మాత్రం ఆటగాళ్లు ఒంటిపై డ్రెస్సేమీ లేకుండానే రగ్బీ మ్యాచుల్లో పాల్గొంటారు. వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా ఇది నిజం. నగ్నంగా రగ్బీ మ్యాచ్‌లు ఆడటమే ఇక్కడి ప్రత్యేకత. దీన్నే న్యూడ్ రగ్బీ లేదా నేకెడ్ రగ్బీ అని కూడా అంటారు. ప్రతీ యేట డునెడిన్‌లో ఆల్బ్లాక్స్(న్యూజిలాండ్ జాతీయ రగ్బీ జట్టు) ఆడే టెస్టు మ్యాచ్‌లకు ముందు నగ్నంగా రగ్బీ పోటీలను నిర్వహిస్తారు. న్యూడ్ రగ్బీ అంటే జనం పడి చస్తారు. దేశ విదేశాల నుంచి న్యూడ్ రగ్బీని వీక్షించేందుకు డునెడిన్‌కు చేరుకుంటారు. ఇలాంటి వారికోసం ప్రత్యేకంగా టూరిస్ట్ ప్యాకేజీలు అందుబాటులో ఉన్నాయి. 2002 నుంచి.. న్యూజిలాండ్‌లో రగ్బీ మ్యాచ్‌లకు విపరీతమైన క్రేజ్. దీంతో డునెడిన్‌లో న్యూజిలాండ్ జాతీయ రగ్బీ జట్టు ఆడే టెస్టుల కన్నా ముందే ఈ టోర్నీపై అందరి దృష్టి పడాలన్న ఉద్దేశంతో రగ్బీ మ్యాచ్‌లను నగ్నంగా ఆడిస్తున్నారు. ఈ ఆలోచన 2002లో మొదలైంది. అదే ఏడాది ఐర్లాండ్ జట్టుతో న్యూడ్ బ్లాక్ టీమ్ పోటీ పడింది. అంతర్జాతీయంగా ఇదే తొలి ‘నగ్న రగ్బీ’ మ్యాచ్ గతంలో సెయింట్ క్లెయిర్ బీచ్‌లో బ్యాక్ ప్యాకర్స్, స్థానిక విద్యార్థులు నగ్నంగా రగ్బీ మ్యాచ్‌లు ఆడటాన్ని నిర్వాహకులు చూశారు. నగ్నంగా ఆడే మ్యాచ్‌లు అసభ్యకరంగా ఉంటాయి. కానీ నిర్వాహకులకు మాత్రం ఆసక్తికరంగా అనిపించిందట. రగ్బీ టెస్టులకు ముందు వీటిని నిర్వహిస్తే బాగుంటుందని నిర్ణయించారు. అలా మొదలైన ఆలోచన 12 ఏళ్లుగా కొనసాగుతోంది. ప్రతీ యేడాది రగ్బీ టెస్టులకు ముందు న్యూడ్ మ్యాచ్‌లను నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. అంతర్జాతీయ మీడియా ఈ మ్యాచ్‌లపై దృష్టి పెట్టడంతో ‘నగ్న రగ్బీ’ మరింతగా ప్రాచుర్యం పొందింది. దీంతో ఇప్పుడు ‘నగ్న రగ్బీ’ జరిగే ప్రతీసారి వేలల్లో జనం డునెడిన్ వస్తున్నారు.