బట్టల్లేకుండానే రగ్బీ ఆట
క్రీడ ఏదైనా క్రీడాకారులు వేసుకునే రంగురంగుల జెర్సీలు ఆటకు ప్రత్యేక ఆకర్షణ. ఆ డ్రెస్సుల్లో క్రీడాకారులు చేసే సందడి అంతా ఇంతా కాదు. కానీ న్యూజిలాండ్‌లోని డునెడిన్‌లో మాత్రం ఆటగాళ్లు ఒంటిపై డ్రెస్సేమీ లేకుండానే రగ్బీ మ్యాచుల్లో పాల్గొంటారు. వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా ఇది నిజం. నగ్నంగా రగ్బీ మ్యాచ్‌లు ఆడటమే ఇక్కడి ప్రత్యేకత. దీన్నే న్యూడ్ రగ్బీ లేదా నేకెడ్ రగ్బీ అని కూడా అంటారు.
ప్రతీ యేట డునెడిన్‌లో ఆల్‌బ్లాక్స్(న్యూజిలాండ్ జాతీయ రగ్బీ జట్టు) ఆడే టెస్టు మ్యాచ్‌లకు ముందు నగ్నంగా రగ్బీ పోటీలను నిర్వహిస్తారు. న్యూడ్ రగ్బీ అంటే జనం పడి చస్తారు. దేశ విదేశాల నుంచి న్యూడ్ రగ్బీని వీక్షించేందుకు డునెడిన్‌కు చేరుకుంటారు. ఇలాంటి వారికోసం ప్రత్యేకంగా టూరిస్ట్ ప్యాకేజీలు అందుబాటులో ఉన్నాయి.
2002 నుంచి..
న్యూజిలాండ్‌లో రగ్బీ మ్యాచ్‌లకు విపరీతమైన క్రేజ్. దీంతో డునెడిన్‌లో న్యూజిలాండ్ జాతీయ రగ్బీ జట్టు ఆడే టెస్టుల కన్నా ముందే ఈ టోర్నీపై అందరి దృష్టి పడాలన్న ఉద్దేశంతో రగ్బీ మ్యాచ్‌లను నగ్నంగా ఆడిస్తున్నారు. ఈ ఆలోచన 2002లో మొదలైంది. అదే ఏడాది ఐర్లాండ్ జట్టుతో న్యూడ్ బ్లాక్ టీమ్ పోటీ పడింది. అంతర్జాతీయంగా ఇదే తొలి ‘నగ్న రగ్బీ’ మ్యాచ్ గతంలో సెయింట్ క్లెయిర్ బీచ్‌లో బ్యాక్ ప్యాకర్స్, స్థానిక విద్యార్థులు నగ్నంగా రగ్బీ మ్యాచ్‌లు ఆడటాన్ని నిర్వాహకులు చూశారు. నగ్నంగా ఆడే మ్యాచ్‌లు అసభ్యకరంగా ఉంటాయి. కానీ నిర్వాహకులకు మాత్రం ఆసక్తికరంగా అనిపించిందట.
రగ్బీ టెస్టులకు ముందు వీటిని నిర్వహిస్తే బాగుంటుందని నిర్ణయించారు. అలా మొదలైన ఆలోచన 12 ఏళ్లుగా కొనసాగుతోంది. ప్రతీ యేడాది రగ్బీ టెస్టులకు ముందు న్యూడ్ మ్యాచ్‌లను నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. అంతర్జాతీయ మీడియా ఈ మ్యాచ్‌లపై దృష్టి పెట్టడంతో ‘నగ్న రగ్బీ’ మరింతగా ప్రాచుర్యం పొందింది. దీంతో ఇప్పుడు ‘నగ్న రగ్బీ’ జరిగే ప్రతీసారి వేలల్లో జనం డునెడిన్ వస్తున్నారు.