క్రికెట్, రగ్బీపై దక్షిణాఫ్రికా సంచలన నిర్ణయం
దక్షిణాఫ్రికాలో అంతర్జాతీయ క్రికెట్, రగ్బీ మ్యాచులు నిర్వహించకుండా ఆ దేశ ప్రభుత్వం దాదాపు ఏడాదిపాటు నిషేధం విధించింది. క్రికెట్, రగ్బీ ఆటల్లో నల్లజాతీయులను విస్మరించి.. కేవలం శ్వేతజాతీయులకు మాత్రమే అవకాశమిస్తుండటంతో దక్షిణాఫ్రికా క్రీడామంత్రి ఫికిలి ఎంబాలులా ఈ మేరకు సంచలన నిర్ణయం తీసుకున్నారు. అంతర్జాతీయ టోర్నమెంట్లు నిర్వహించకుండా, మ్యాచులకు ఆతిథ్యం ఇవ్వకుండా జాతీయ రగ్బీ, క్రికెట్ ఫెడరేషన్లపై ఆయన నిషేధం విధించారు. రగ్బీ, క్రికెట్, ఫుట్‌బాల్, అథ్లెటిక్స్, నెట్‌బాల్.. మొత్తం ఐదు క్రీడలకు ఈ నిషేధం వర్తించనుందని ఆయన సోమవారం తెలిపారు. నల్లజాతీయులను ప్రోత్సహించడంలో ఒక్క ఫుట్‌బాల్ క్రీడ మాత్రమే ముందున్నదని, కాబట్టి ఫుట్‌బాల్‌కు ఈ నిషేధం వర్తించబోదని ఆయన తెలిపారు.
దక్షిణాఫ్రికా ప్రభుత్వం నిర్ణయం వల్ల 2023 రగ్బీ వరల్డ్ కప్ నిర్వహణకు బిడ్డింగ్ దాఖలుచేసే అవకాశాన్ని ఆ దేశ బోర్డు కోల్పోనుంది. అంతర్జాతీయ టోర్నమెంట్లు, మేజర్ మ్యాచులు నిర్వహించకుండా క్రికెట్, రగ్బీ తదితర ఫెడరేషన్లపై విధించిన నిషేధంపై వచ్చే ఏడాది సమీక్ష జరుపుతానని, అప్పటివరకు ఈ నిషేధం కొనసాగుతుందని ఆయన స్పష్టం చేశారు.