సాక్షి, ముంబై: దేశవ్యాప్తంగా మహిళలు, శిశువులపై లైంగిక నేరాలు రోజురోజుకూ పెరుగుతూనే ఉన్నాయి. ప్రభుత్వాలు ఎన్ని చర్యలు తీసుకున్నా పెద్ద ఫలితం మాత్రం ఉండడం లేదు. ఈ విషయంలో తమ వంతు సహకారం అందించేందుకు గణపతి మండళ్లు నడుం బిగించాయి. గణేశ్ ఉత్సవాలను పుస్కరించుకొని బృహన్‌ముంబై మున్సిపల్ కార్పొరేషన్ (బీఎంసీ), పోలీసులు, పలు గణేశ్ మండళ్లు సంయుక్తంగా లైంగిక నేరాల నియంత్రణపై అవగాహన కల్పించేందుకు కంకణం కట్టుకున్నాయి.
ఇందుకు గణేశ్ మండళ్లను వేదికగా చేసుకుంటున్నాయి. మహిళలు, శిశువులపై జరుగుతున్న నేరాలు, వాటి నివారణ చర్యలను వివరించే పోస్టర్లును మండళ్ల వేదికల వద్ద అంటించనున్నారు. గణేశుడిని సందర్శించేందుకు వచ్చిన భక్తులకు వీటితో కొంతైన అవగాహన ఏర్పడుతుందని మండళ్ల నిర్వాహకులు అభిప్రాయపడ్డారు. ‘లైంగిక నేరాల నియంత్రణ అత్యంత కీలక అంశం. గణపతి ఉత్సవాలను పురస్కరించుకొని వేల సంఖ్యలో భక్తులు మండళ్లను సందర్శిస్తుంటారు. దీంతో వీరందరినీ లైంగిక నేరాలపై చైతన్యవంతులను చేసేందుకు ఇదే మంచి అవకాశం. మేం ఈ సమాచారాన్ని వ్యాప్తి చేయడానికి పోస్టర్లను అంటిస్తాం’ అని బీఎంసీ అధికారి ఒకరు తెలిపారు.
అడిషనల్ మున్సిపల్ కమిషనర్ ఎస్‌వీఆర్ శ్రీనివాస్ ఈ సందర్భంగా మాట్లాడుతూ.. గణేశుణ్ని సందర్శించడానికి వచ్చే భక్తులకు అవగాహన కల్పించాలన్న ఆలోచన హర్షణీయమని అన్నారు. ఇదిలా వుండగా పోలీసులు ఇందుకు సంబంధించిన 10 వేల పోస్టర్లను ప్రచురించారు. వీటిని త్వరలోనే మండళ్లకు పంపిణీ చేయనున్నారు. లాల్‌బాగ్ చా రాజా మండలి వద్ద కూడా వీటిని అంటించనున్నారు.
లైంగిక నేరాలపై అవగాహన
Published Sat, Aug 30 2014 11:07 PM | Last Updated on Tue, Oct 16 2018 6:08 PM
Advertisement