SVR Srinivas
-
లైంగిక నేరాలపై అవగాహన
సాక్షి, ముంబై: దేశవ్యాప్తంగా మహిళలు, శిశువులపై లైంగిక నేరాలు రోజురోజుకూ పెరుగుతూనే ఉన్నాయి. ప్రభుత్వాలు ఎన్ని చర్యలు తీసుకున్నా పెద్ద ఫలితం మాత్రం ఉండడం లేదు. ఈ విషయంలో తమ వంతు సహకారం అందించేందుకు గణపతి మండళ్లు నడుం బిగించాయి. గణేశ్ ఉత్సవాలను పుస్కరించుకొని బృహన్ముంబై మున్సిపల్ కార్పొరేషన్ (బీఎంసీ), పోలీసులు, పలు గణేశ్ మండళ్లు సంయుక్తంగా లైంగిక నేరాల నియంత్రణపై అవగాహన కల్పించేందుకు కంకణం కట్టుకున్నాయి. ఇందుకు గణేశ్ మండళ్లను వేదికగా చేసుకుంటున్నాయి. మహిళలు, శిశువులపై జరుగుతున్న నేరాలు, వాటి నివారణ చర్యలను వివరించే పోస్టర్లును మండళ్ల వేదికల వద్ద అంటించనున్నారు. గణేశుడిని సందర్శించేందుకు వచ్చిన భక్తులకు వీటితో కొంతైన అవగాహన ఏర్పడుతుందని మండళ్ల నిర్వాహకులు అభిప్రాయపడ్డారు. ‘లైంగిక నేరాల నియంత్రణ అత్యంత కీలక అంశం. గణపతి ఉత్సవాలను పురస్కరించుకొని వేల సంఖ్యలో భక్తులు మండళ్లను సందర్శిస్తుంటారు. దీంతో వీరందరినీ లైంగిక నేరాలపై చైతన్యవంతులను చేసేందుకు ఇదే మంచి అవకాశం. మేం ఈ సమాచారాన్ని వ్యాప్తి చేయడానికి పోస్టర్లను అంటిస్తాం’ అని బీఎంసీ అధికారి ఒకరు తెలిపారు. అడిషనల్ మున్సిపల్ కమిషనర్ ఎస్వీఆర్ శ్రీనివాస్ ఈ సందర్భంగా మాట్లాడుతూ.. గణేశుణ్ని సందర్శించడానికి వచ్చే భక్తులకు అవగాహన కల్పించాలన్న ఆలోచన హర్షణీయమని అన్నారు. ఇదిలా వుండగా పోలీసులు ఇందుకు సంబంధించిన 10 వేల పోస్టర్లను ప్రచురించారు. వీటిని త్వరలోనే మండళ్లకు పంపిణీ చేయనున్నారు. లాల్బాగ్ చా రాజా మండలి వద్ద కూడా వీటిని అంటించనున్నారు. -
చినుకు పడిందంటే కునుకు కరువయ్యే పరిస్థితి
సాక్షి, ముంబై: చినుకు పడిందంటే కునుకు కరువయ్యే పరిస్థితి నగరవాసులది. ఇరుకు రోడ్లు... వాటిపై గుంతలు... అక్కడక్కడా ఆవురావురుమంటూ నోరు తెరుచుకునే మ్యాన్‌హోల్స్... పూడిక తీయకపోవడంతో నాలా ఏదో? రహదారి ఏదో? తెలియని దారిలో ప్రయాణించాల్సిన దుస్థితి ముంబైకర్లది. వర్షాకాలానికి ముందే నాలా పూడికతీత, రోడ్ల మరమ్మతులు పూర్తి చేస్తే కొంతమేరైనా ఉపశమనం కలుగుతుందని భావించిన నగరవాసికి ఈ ఏడాది కూడా ఇబ్బందులు తప్పవేమోననిపిస్తోంది. ఎందుకంటే వర్షాకాలంలోపు రోడ్ల మరమ్మతులు పూర్తి చేస్తామని అమాత్యులు ప్రకటించినా ఆచరణలో మాత్రం అది సాధ్యమయ్యేలా కనిపించడంలేదు. ఎందుకంటే నగరంలోని మొత్తం 967 రోడ్లకుగాను ఇప్పటిదాకా మరమ్మతులు పూర్తిచేసుకున్నవి కేవ లం 132 రోడ్లు మాత్రమే. మిగతా వాటిలో 330 రోడ్ల పనులు ప్రారంభం కాగా 505 రోడ్లవైపు ఎవరూ కనీసం దృష్టిసారించలేదు. దీంతో ప్రస్తుతం పనులు కొనసాగుతున్న 330 రోడ్లు వర్షాకాలంలోపు పూర్తయితేనే మహాగొప్ప అంటున్నారు ఇంజ నీర్లు. అంటే మిగతా 505 రోడ్ల పనులు ఈసారి అటకెక్కినట్లే. వీటి మరమ్మతు పనులు వర్షాకాలం తర్వాతే చేస్తామని సంబంధిత అధికారులే స్వయం గా చెబుతున్నారంటే ఈ ఏడాది సగానికిపైగా రోడ్ల పరిస్థితి దయనీయంగానే ఉండనుంది. ఇక మరమ్మతులు పూర్తి చేసుకున్న, చేసుకుంటున్న రోడ్ల పరిస్థితి ఏమాత్రం బాగుంటుందన్నది కూడా ప్రశ్నార్థకమే. 2013-14 బడ్జెట్లో రహదారుల మరమ్మతులు, పునర్నిర్మాణానికిగాను రూ. 3,000 కోట్లు కేటాయించారు. దీంతో ప్రస్తుతం నగరంలో 328 రోడ్లను తారు, సిమెంట్ రోడ్లుగా తీర్చిదిద్దనున్నా రు. కాగా మోనో-మెట్రో రైళ్ల కోసం ఎమ్మెమ్మార్డీఏ 10 రోడ్ల నిర్మాణం చేపట్టనుంది. ఇదిలా వుండగా పెద్ద, చిన్న రోడ్ల నిర్మణాల పనులను రోడ్ల శాఖకు అప్పగించాలని బీఎంసీ నిర్ణయించింది. రోడ్లపై ఏర్పడిన గుంతలను పూడ్చడం, వీటి నిర్వహణ బాధ్యతను ఆయా వార్డులకు అప్పగించాలని నిర్ణయించినట్లు సంబంధిత అధికారి ఒకరు వెల్లడించారు. అదనపు మున్సిపల్ కమిషనర్ ఎస్వీఆర్ శ్రీని వాస్ ఈ సందర్భంగా మాట్లాడుతూ.. 300 పైగా రోడ్ల మరమ్మతు పనులు ప్రస్తుతం కొనసాగుతున్నాయని, మిగతా 500 రోడ్లను వర్షాకాలం పూర్తి అయిన వెంటనే పనులు ప్రారంభిస్తామని ఆయన చెప్పారు. అయితే వర్షాకాలంలో ఎలాంటి వరద ముప్పు ఉండబోదని ఆయన ఈ సందర్భంగా హామీ ఇచ్చారు. ఇందుకుగాను తాము తగు జాగ్రత్తలు తీసుకుంటున్నామని తెలిపారు. సమస్యాత్మక రహదారుల మరమ్మతు పనులను ఇటీవలే ప్రారంభించామని, వర్షాకాలంలోపు ఈ పనులు పూర్తవుతాయని ఆయన తెలిపారు. కార్పొరేషన్ సీనియర్ అధికారి ఒకరు మాట్లాడుతూ.... రోడ్ల మరమ్మతు పనుల్లో వివిధ కారణాల వల్ల తీవ్ర జాప్యం జరుగుతోందని, ఈ పనులను చేపట్టడానికి కాంట్రాక్టర్లు ముందుకు రావడం లేదన్నారు. దీంతో కాంట్రాక్టు ఇవ్వడానికి టెండర్ల ప్రక్రియను మళ్లీ ప్రారంభించనున్నట్లు చెప్పారు. కోర్టు కేసుల నేపథ్యంలో కూడా రోడ్ల మరమ్మతుల్లో ఆలస్యం జరుగుతోందన్నారు. ప్రస్తుతం 328 రోడ్ల పునర్నిర్మాణ పనులు చేపట్టాల్సి ఉందన్నారు. ఇదిలా వుండగా కార్పొరేషన్ మేయర్ సునీల్ ప్రభు ఇటీవల వివిధ ప్రాంతాలలోని రోడ్లను సందర్శించారు. రోడ్డు పునరుద్ధరణ పనులను ఈ నెల 31వ తేది వరకు ఇచ్చిన గడువులోపు పూర్తి చేయాలని కాంట్రాక్టర్లకు సూచించారు. అయితే వర్షాకాలం పూర్తయ్యేలోపు నగర వాసుల ప్రయాణం సాఫీగా జరిగేందుకు కృషి చేస్తామని ప్రభు హామీ ఇచ్చారు. అయితే రోడ్లపై ఏర్పడిన గుంతలపట్ల నగరవాసులు ఫిర్యాదు చేస్తే సదరు కాంట్రాక్టరుకు జరిమానా విధిస్తామన్నారు. -
త్వరలో కొత్త పార్కింగ్ విధానం
సాక్షి, ముంబై: ట్రాఫిక్‌ను మరింత సమర్థంగా నియంత్రించే లక్ష్యంతో బృహన్ముంబై మున్సిపల్ కార్పొరేషన్ (బీఎంసీ) తన పార్కింగ్ విధానాన్ని సంస్కరించేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టింది. ఇందుకోసం కొన్ని ప్రతిపాదనలను సిద్ధం చేసింది. ప్రస్తుతం ఇవి ముసాయిదా దశలోనే ఉన్నాయని, త్వరలోనే కార్యరూపం దాల్చేఅవకాశం ఉందని కార్పొరేషన్ సీనియర్ అధికారి ఒకరు వెల్లడించారు. కొత్త విధానం అమలైతే పాఠశాలలు, కళాశాలల సమీపంలోని పార్కింగ్ కేంద్రాలను తొలగిస్తారు. పే అండ్ పార్కింగ్ కేంద్రాల్లో ప్రస్తుతం అమల్లో ఉన్న చార్జీలు సైతం మారే అవకాశముంది. అంతేకాకుండా పాఠశాలలు, కళాశాలలకు 100 మీటర్ల దూరం వరకు ఉన్న పార్కింగ్ కేంద్రాలను తొలగిస్తారు. ఈ ప్రక్రియ అమల్లోకి వస్తే క్రాఫర్డ్ మార్కెట్ జేజే స్కూల్ ఆఫ్ ఆర్ట్స్ పాఠశాలకు సమీపంలోని భారీ పార్కింగ్ కేంద్రాన్ని కూడా తొలగించాల్సి వస్తుంది. నగర శివారులో భారీ పార్కింగ్ కేంద్రాలను కూడా తొలగించాలని బీఎంసీ భావిస్తోంది. దీంతో పాఠశాలలు, కళాశాలల సమీపంలో ట్రాఫిక్ బెడద తగ్గుతుందని మున్సిపల్ కమిషనర్ ఎస్వీఆర్ శ్రీనివాస్ ఆశాభావం వ్యక్తం చేశారు. అయితే కొత్త విధానంలో కొన్ని వాహనాలకు అధికంగా పార్కింగ్ చార్జీలు వసూలు చేసే అవకాశాలున్నాయి. ప్రైవేట్, ప్రజారవాణా వాహనాలకు వేరేవిధంగా చార్జీలను వసూలు చేయనున్నారు. ఇది ఆదాయాన్ని ఆర్జించేందుకు ప్రవేశపెడుతున్న విధానం కాదని శ్రీనివాస్ స్పష్టం చేశారు. ఇక నుంచి వాహనాలను ప్రైవేట్, పబ్లిక్, మాధ్యమిక ప్రజారవాణా (ఇంటర్మీడియెట్ పబ్లిక్ ట్రాన్స్‌పోర్టేషన్)గా విభజిస్తామన్నారు. ఒక్కో విభాగానికి ఒక్కో తరహా చార్జీ ఉంటుందన్నారు. అయితే ప్రజారవాణాను ఎక్కువ మంది ఉపయోగించేలా ప్రోత్సహించడమే తమ ముఖ్య ఉద్దేశమని శ్రీనివాస్ వివరణ ఇచ్చారు. వీధి పార్కింగ్ పథకంలో స్థానికులకు నెలసరి పాస్‌లను ఇచ్చేందుకు మార్గదర్శకాలు రూపొందిస్తున్నామని తెలిపారు. కనీసపు చార్జీ రూ.600గా నిర్ణయించే అవకాశముంది. రద్దీ ఎక్కువ, తక్కువగా ఉన్నప్పుడు, సెలవు దినాల్లో ఒక్కో తరహా చార్జీ వసూలు చేయాలనే ప్రతిపాదన కూడా ఉంది. నగరవ్యాప్తంగా 92 పార్కింగ్ కేంద్రాలు ఉన్నప్పటికీ, మరికొన్నింటిని నిర్మించేందుకు కూడా బీఎంసీ ప్రణాళికను సిద్ధం చేసింది. ఇప్పటికే దాదాపు 12 చోట్ల పార్కింగ్ కేంద్రాల నిర్మాణానికి స్థలాలను గుర్తించామని శ్రీనివాస్ పేర్కొన్నారు.