సాక్షి, ముంబై: ట్రాఫిక్‌ను మరింత సమర్థంగా నియంత్రించే లక్ష్యంతో బృహన్‌ముంబై మున్సిపల్ కార్పొరేషన్ (బీఎంసీ) తన పార్కింగ్ విధానాన్ని సంస్కరించేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టింది. ఇందుకోసం కొన్ని ప్రతిపాదనలను సిద్ధం చేసింది. ప్రస్తుతం ఇవి ముసాయిదా దశలోనే ఉన్నాయని, త్వరలోనే కార్యరూపం దాల్చేఅవకాశం ఉందని కార్పొరేషన్ సీనియర్ అధికారి ఒకరు వెల్లడించారు. కొత్త విధానం అమలైతే పాఠశాలలు, కళాశాలల సమీపంలోని పార్కింగ్ కేంద్రాలను తొలగిస్తారు. పే అండ్ పార్కింగ్ కేంద్రాల్లో ప్రస్తుతం అమల్లో ఉన్న చార్జీలు సైతం మారే అవకాశముంది. అంతేకాకుండా పాఠశాలలు, కళాశాలలకు 100 మీటర్ల దూరం వరకు ఉన్న పార్కింగ్ కేంద్రాలను తొలగిస్తారు. ఈ ప్రక్రియ అమల్లోకి వస్తే క్రాఫర్డ్ మార్కెట్ జేజే స్కూల్ ఆఫ్ ఆర్ట్స్ పాఠశాలకు సమీపంలోని భారీ పార్కింగ్ కేంద్రాన్ని కూడా తొలగించాల్సి వస్తుంది. నగర శివారులో భారీ పార్కింగ్ కేంద్రాలను కూడా తొలగించాలని బీఎంసీ భావిస్తోంది. దీంతో పాఠశాలలు, కళాశాలల సమీపంలో ట్రాఫిక్ బెడద తగ్గుతుందని మున్సిపల్ కమిషనర్ ఎస్‌వీఆర్ శ్రీనివాస్ ఆశాభావం వ్యక్తం చేశారు.
అయితే కొత్త విధానంలో కొన్ని వాహనాలకు అధికంగా పార్కింగ్ చార్జీలు వసూలు చేసే అవకాశాలున్నాయి. ప్రైవేట్, ప్రజారవాణా వాహనాలకు వేరేవిధంగా చార్జీలను వసూలు చేయనున్నారు. ఇది ఆదాయాన్ని ఆర్జించేందుకు ప్రవేశపెడుతున్న విధానం కాదని శ్రీనివాస్ స్పష్టం చేశారు. ఇక నుంచి వాహనాలను ప్రైవేట్, పబ్లిక్, మాధ్యమిక ప్రజారవాణా (ఇంటర్మీడియెట్ పబ్లిక్ ట్రాన్స్‌పోర్టేషన్)గా విభజిస్తామన్నారు.
ఒక్కో విభాగానికి ఒక్కో తరహా చార్జీ ఉంటుందన్నారు. అయితే ప్రజారవాణాను ఎక్కువ మంది ఉపయోగించేలా ప్రోత్సహించడమే తమ ముఖ్య ఉద్దేశమని శ్రీనివాస్ వివరణ ఇచ్చారు. వీధి పార్కింగ్ పథకంలో స్థానికులకు నెలసరి పాస్‌లను ఇచ్చేందుకు మార్గదర్శకాలు రూపొందిస్తున్నామని తెలిపారు. కనీసపు చార్జీ రూ.600గా నిర్ణయించే అవకాశముంది. రద్దీ ఎక్కువ, తక్కువగా ఉన్నప్పుడు, సెలవు దినాల్లో ఒక్కో తరహా చార్జీ వసూలు చేయాలనే ప్రతిపాదన కూడా ఉంది. నగరవ్యాప్తంగా 92 పార్కింగ్ కేంద్రాలు ఉన్నప్పటికీ, మరికొన్నింటిని నిర్మించేందుకు కూడా బీఎంసీ ప్రణాళికను సిద్ధం చేసింది. ఇప్పటికే దాదాపు 12 చోట్ల పార్కింగ్ కేంద్రాల నిర్మాణానికి స్థలాలను గుర్తించామని శ్రీనివాస్ పేర్కొన్నారు.
త్వరలో కొత్త పార్కింగ్ విధానం
Published Sat, Sep 7 2013 3:59 AM | Last Updated on Fri, Sep 1 2017 10:30 PM
Advertisement