సాక్షి, ముంబై: చినుకు పడిందంటే కునుకు కరువయ్యే పరిస్థితి నగరవాసులది. ఇరుకు రోడ్లు... వాటిపై గుంతలు... అక్కడక్కడా ఆవురావురుమంటూ నోరు తెరుచుకునే మ్యాన్‌హోల్స్... పూడిక తీయకపోవడంతో నాలా ఏదో? రహదారి ఏదో? తెలియని దారిలో ప్రయాణించాల్సిన దుస్థితి ముంబైకర్లది. వర్షాకాలానికి ముందే నాలా పూడికతీత, రోడ్ల మరమ్మతులు పూర్తి చేస్తే కొంతమేరైనా ఉపశమనం కలుగుతుందని భావించిన నగరవాసికి ఈ ఏడాది కూడా ఇబ్బందులు తప్పవేమోననిపిస్తోంది. ఎందుకంటే వర్షాకాలంలోపు రోడ్ల మరమ్మతులు పూర్తి చేస్తామని అమాత్యులు ప్రకటించినా ఆచరణలో మాత్రం అది సాధ్యమయ్యేలా కనిపించడంలేదు. ఎందుకంటే నగరంలోని మొత్తం 967 రోడ్లకుగాను ఇప్పటిదాకా మరమ్మతులు పూర్తిచేసుకున్నవి కేవ లం 132 రోడ్లు మాత్రమే.
మిగతా వాటిలో 330 రోడ్ల పనులు ప్రారంభం కాగా 505 రోడ్లవైపు ఎవరూ కనీసం దృష్టిసారించలేదు. దీంతో ప్రస్తుతం పనులు కొనసాగుతున్న 330 రోడ్లు వర్షాకాలంలోపు పూర్తయితేనే మహాగొప్ప అంటున్నారు ఇంజ నీర్లు. అంటే మిగతా 505 రోడ్ల పనులు ఈసారి అటకెక్కినట్లే. వీటి మరమ్మతు పనులు వర్షాకాలం తర్వాతే చేస్తామని సంబంధిత అధికారులే స్వయం గా చెబుతున్నారంటే ఈ ఏడాది సగానికిపైగా రోడ్ల పరిస్థితి దయనీయంగానే ఉండనుంది. ఇక మరమ్మతులు పూర్తి చేసుకున్న, చేసుకుంటున్న రోడ్ల పరిస్థితి ఏమాత్రం బాగుంటుందన్నది కూడా ప్రశ్నార్థకమే.
2013-14 బడ్జెట్‌లో రహదారుల మరమ్మతులు, పునర్నిర్మాణానికిగాను రూ. 3,000 కోట్లు కేటాయించారు. దీంతో ప్రస్తుతం నగరంలో 328 రోడ్లను తారు, సిమెంట్ రోడ్లుగా తీర్చిదిద్దనున్నా రు. కాగా మోనో-మెట్రో రైళ్ల కోసం ఎమ్మెమ్మార్డీఏ 10 రోడ్ల నిర్మాణం చేపట్టనుంది. ఇదిలా వుండగా పెద్ద, చిన్న రోడ్ల నిర్మణాల పనులను రోడ్ల శాఖకు అప్పగించాలని బీఎంసీ నిర్ణయించింది. రోడ్లపై ఏర్పడిన గుంతలను పూడ్చడం, వీటి నిర్వహణ బాధ్యతను ఆయా వార్డులకు అప్పగించాలని నిర్ణయించినట్లు సంబంధిత అధికారి ఒకరు వెల్లడించారు.
అదనపు మున్సిపల్ కమిషనర్ ఎస్‌వీఆర్ శ్రీని వాస్ ఈ సందర్భంగా మాట్లాడుతూ.. 300 పైగా రోడ్ల మరమ్మతు పనులు ప్రస్తుతం కొనసాగుతున్నాయని, మిగతా 500 రోడ్లను వర్షాకాలం పూర్తి అయిన వెంటనే పనులు ప్రారంభిస్తామని ఆయన చెప్పారు. అయితే వర్షాకాలంలో ఎలాంటి వరద ముప్పు ఉండబోదని ఆయన ఈ సందర్భంగా హామీ ఇచ్చారు. ఇందుకుగాను తాము తగు జాగ్రత్తలు తీసుకుంటున్నామని తెలిపారు. సమస్యాత్మక రహదారుల మరమ్మతు పనులను ఇటీవలే ప్రారంభించామని, వర్షాకాలంలోపు ఈ పనులు పూర్తవుతాయని ఆయన తెలిపారు. కార్పొరేషన్ సీనియర్ అధికారి ఒకరు మాట్లాడుతూ.... రోడ్ల మరమ్మతు పనుల్లో వివిధ కారణాల వల్ల తీవ్ర జాప్యం జరుగుతోందని, ఈ పనులను చేపట్టడానికి కాంట్రాక్టర్లు ముందుకు రావడం లేదన్నారు.
దీంతో కాంట్రాక్టు ఇవ్వడానికి టెండర్ల ప్రక్రియను మళ్లీ ప్రారంభించనున్నట్లు చెప్పారు. కోర్టు కేసుల నేపథ్యంలో కూడా రోడ్ల మరమ్మతుల్లో ఆలస్యం జరుగుతోందన్నారు. ప్రస్తుతం 328 రోడ్ల పునర్నిర్మాణ పనులు చేపట్టాల్సి ఉందన్నారు. ఇదిలా వుండగా కార్పొరేషన్ మేయర్ సునీల్ ప్రభు ఇటీవల వివిధ ప్రాంతాలలోని రోడ్లను సందర్శించారు. రోడ్డు పునరుద్ధరణ పనులను ఈ నెల 31వ తేది వరకు ఇచ్చిన గడువులోపు పూర్తి చేయాలని కాంట్రాక్టర్లకు సూచించారు. అయితే వర్షాకాలం పూర్తయ్యేలోపు నగర వాసుల ప్రయాణం సాఫీగా జరిగేందుకు కృషి చేస్తామని ప్రభు హామీ ఇచ్చారు. అయితే రోడ్లపై ఏర్పడిన గుంతలపట్ల నగరవాసులు ఫిర్యాదు చేస్తే సదరు కాంట్రాక్టరుకు జరిమానా విధిస్తామన్నారు.
చినుకు పడిందంటే కునుకు కరువయ్యే పరిస్థితి
Published Sun, May 11 2014 10:13 PM | Last Updated on Sat, Sep 2 2017 7:14 AM
Advertisement
Advertisement