
బెంగళూరు పేలుడులో ‘సిమి’ హస్తం!
- దర్యాప్తు సంస్థల అనుమానం
సాక్షి, బెంగళూరు: బెంగళూరులోని రెస్టారెంట్ వద్ద పేలుడు ఘటనలో నిషేధిత ఉగ్రవాద సంస్థ ‘సిమి’(స్టూడెంట్స్ ఇస్లామిక్ మూవ్‌మెంట్ ఆఫ్ ఇండియా) హస్తముండే అవకాశమున్నట్లు దర్యాప్తు సంస్థలు భావిస్తున్నాయి. జాతీయ దర్యాప్తు సంస్థ సాయంతో బెంగళూరు పోలీసులు కేసును దర్యాప్తు చేస్తున్నారు. చర్చ్ స్ట్రీట్ వద్ద ఆదివారం జరిగిన పేలుడులో చెన్నై మహిళ మరణించడం తెలిసిందే. గాయపడిన మరో ముగ్గురు ప్రాణాపాయ స్థితి నుంచి బయటపడ్డారు. ఘటనాస్థలిని అధికారులు సోమవారం పరిశీలించారు.
ఐఈడీతోనే పేలుడు జరిగినట్లు గుర్తించారు. నిందితుల వివరాలు తెలిపితే రూ. 10 లక్షల పారితోషికం ఇస్తామన్నారు. కర్ణాటక ప్రభుత్వం రద్దీ ప్రాంతాల్లో భద్రతను కట్టుదిట్టం చేసింది. షాపింగ్‌మాల్స్, సినిమా హాళ్ల వద్ద సీసీటీవీలను అమర్చాలని సీఎం సిద్ధరామయ్య ఆదేశించారు. మధ్యప్రదేశ్‌లోని ఖండ్వా జైలు నుంచి తప్పించుకున్న ఐదుగురు సిమి ఉగ్రవాదులు ఇటీవలే కర్ణాటకలో పర్యటించినట్లు సమాచారం ఉందని, ఆ కోణంలోనూ దర్యాప్తు జరుగుతోందన్నారు. దర్యాప్తు కోసం ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేశామన్నారు.
ఈ ఘటనపై ఢిల్లీలో కేంద్ర హోం మంత్రి రాజ్‌నాథ్ సింగ్ సమీక్ష జరిపారు. అది ఉగ్రవాదుల దుశ్చర్యేనని నిర్ణయానికి వచ్చారు. దర్యాప్తులో భాగంగా కర్ణాటక పోలీసు బృందం తెలంగాణలోని వరంగల్ జిల్లాకు వెళ్లినట్టు సమాచారం. బాంబు తయారీ వస్తువులను పొరుగు రాష్ట్రాల నుంచి కూడా సేకరించినట్లు ప్రాథమిక నిర్ధారణకు రావడంతో.. తమిళనాడు, మహారాష్ట్ర, హైదరాబాద్‌లో గతంలో జరిగిన బాంబు పేలుళ్ల ఘటనలనూ అధ్యయనం చేయడానికి పలు ప్రాంతాలకు ప్రత్యేక బృందాలు తరలి వెళ్లినట్లు తెలిసింది.
‘పేలుడు నా పనే! చేతనైతే పట్టుకోండి’
బెంగళూరలో ఆదివారం నాటి బాంబు పేలుడుకు తానే బాధ్యుడనని అబ్దుల్ ఖాన్ అనే వ్యక్తి సోమవారం ట్వీటర్‌లో పేర్కొన్నాడు. చేతనైతే తనను పట్టుకోవాలంటూ పోలీసులకు సవాల్ కూడా విసిరాడు. ఇస్లామిక్ స్టేట్(ఐఎస్) ఉగ్రవాద సంస్థకు ట్వీట్‌ల ద్వారా మద్దతిచ్చే మెహ్దీ మస్రూర్ బిస్వాస్‌ను విడుదలచేయని పక్షంలోరెండు రోజులకు ఇలాంటి ఘటనలే పునరావృతమవుతాయని హెచ్చరించాడు. కేంద్ర హోం, న్యాయ మంత్రులు రాజ్‌నాథ్, సదానందగౌడకు బెదిరింపు ట్వీట్‌లను పంపించాడు.