అక్కడి ఉర్సులో పాకిస్థానీలకు నో ఎంట్రీ!
అక్కడి ఉర్సులో పాకిస్థానీలకు నో ఎంట్రీ!
Published Tue, Nov 8 2016 9:33 AM | Last Updated on Sat, Mar 23 2019 8:36 PM
భారత్ - పాకిస్థాన్‌ల మధ్య నెలకొన్న ఉద్రిక్తతల నేపథ్యంలో.. ప్రతియేటా బరేలీలోని దర్గా ఆలా హజ్రత్‌లో జరిగే ఉర్సు ఉత్సవాలకు ఈసారి పాకిస్థానీ మతపెద్దలను అనుమతించకూడదని నిర్ణయించుకున్నారు. ఈనెల 24 నుంచి ఇక్కడ వార్షిక ఉర్సు ఉత్సవాలు జరుగుతాయి. ఈసారి ఇక్కడకు వస్తామని ఆరుగురు పాకిస్థానీ మత గురువులు లేఖలు రాసినా, వాళ్లలో ఎవరికీ అనుమతి లేఖలు పంపకూడదని నిర్ణయించుకున్నారు. గత సంవత్సరం ఆ దేశం నుంచి 12 మందిని ఆహ్వానిస్తూ దర్గా యాజమాన్యం లేఖలు పంపింనా, వాళ్లలో ఐదుగురే వచ్చారు.
ఉగ్రవాద కార్యకలాపాలకు తాము సైతం నిరసన వ్యక్తం చేస్తున్నట్లు ఇస్లామాబాద్‌కు తెలియజేయాలనే అనుకుంటున్నామని, అందుకే ఈసారి పాకిస్థానీ మతపెద్దలను బహిష్కరించాలని నిర్ణయించుకున్నామని దర్గా ప్రతినిధి ముఫ్తీ మహ్మద్ సలీం నూరీ చెప్పారు. దాదాపు దశాబ్ద కాలం క్రితం వరకు ఇక్కడి ఉర్సుకు ప్రతియేటా వందలాది మంది పాకిస్థానీలు వచ్చేవారని, కానీ రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలు పెరిగిన తర్వాత ఈ సంఖ్య బాగా తగ్గింది.
ఉగ్రవాద దాడులు జరిగినప్పుడల్లా భారతీయ ముస్లింలు చాలా బాధపడుతున్నారని, వాళ్లను అంతా అనుమానితులుగా చూస్తున్నారని నూరీ అన్నారు. ఇరు దేశాల సంబంధాలు చెడిపోవడంతో రెండు దేశాల్లోని సామాన్య ప్రజలకు ఇబ్బందులు తలెత్తుతున్నాయని, ఉగ్రవాదం ఎక్కడున్నా ఖండించాల్సిందేనని.. శాంతి సందేశాన్ని ప్రజలకు పంచాలని చెప్పారు. ఇక్కడ ఉర్సు ఉత్సవాలకు ఫ్రాన్స్, దుబాయ్, మారిషస్, నెదర్లాండ్స్, దక్షిణాఫ్రికా, ఒమన్.. ఇలా చాలా దేశాల నుంచి మత పెద్దలు వస్తుంటారని, మూడు రోజుల పాటు జరిగే కార్యక్రమంలో అంతా పాల్గొంటారని.. వాళ్లందరినీ కూడా ఉగ్రవాదాన్ని ఖండించాల్సిందిగా కోరుతామని ఆయన వివరించారు.
Advertisement
Advertisement