విమానం.. నదీయానం..
ఓడలు బళ్లవడమంటే ఇదే.. ఇది ఒకప్పుడు ‘యుద్ధ విమానం’.. మరిప్పుడు ఓ పడవ. అదెలా అంటే.. వియత్నాం యుద్ధంలో పాల్గొని.. క్షిపణి దాడిలో దెబ్బతిని పడిపోయిన అనేక యుద్ధ విమానాలు, వాటి తాలూకు ఇంధన ట్యాంకులు ఇప్పటికీ మనకు దక్షిణ వియత్నాం అడవుల్లో కనిపిస్తూనే ఉంటాయి. ముఖ్యంగా యుద్ధ విమానాల తాలూకు ఇంధన ట్యాంకులైతే వేలల్లోనే ఉంటాయి. దూర ప్రయాణాలు చేసే యుద్ధ విమానానికి అదనపు ఇంధన సరఫరాకు ఉపయోగపడే ఈ అల్యూమినియం ట్యాంకు లు విమానం కింది భాగంలో తగిలించి ఉంటాయి.
అత్యవసర సమయాల్లో విమానం వేగాన్ని మరింత పెంచేందుకు వీలుగా.. చాలా మంది పైలట్లు ఇంధనం నింపుకోవడం పూర్తై తర్వాత వీటిని కిందకు వదిలివేసేవారు. యుద్ధం ముగిసింది. ఇవి మాత్రం మిగిలిపోయాయి. అయితే, వియత్నాం రైతులు ఊరుకుంటారా? అడవుల్లో వేల సంఖ్యలో పడి ఉన్న వీటిని ఏం చేయాలా అని ఆలోచించారు. చివరకు ఇంధన ట్యాంకులను ఇలా పడవలుగా మార్చేశారు. కొందరైతే.. యుద్ధ విమానాల నూ పలు రకాలుగా మార్చేసి.. పడవలుగా చేసేశారు. వాట్ ఎన్ ఐడియా సర్‌జీ..