కోల్‌కతా : లోక్‌సభ ఎన్నికల అనంతరం పశ్చిమ బెంగాల్‌లో చోటుచేసుకుంటున్న హింసాకాండ, కోల్‌కతాలో బీజేపీ నిరసనలు తీవ్ర ఉద్రిక్తతకు దారితీసిన నేపథ్యంలో ఈ అంశంపై చర్చించేందుకు గవర్నర్ కేఎన్ త్రిపాఠి అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేశారు. రాజ్‌భవన్‌లో గురువారం సాయంత్రం 4 గంటలకు జరిగే అఖిలపక్ష సమావేశానికి హాజరుకావాలని తృణమూల్ కాంగ్రెస్, బీజేపీ, సీపీఎం, కాంగ్రెస్ సహా ప్రధాన రాజకీయ పార్టీలను ఆహ్వానించారు.
రాష్ట్రంలో ఎన్నికల అనంతరం చోటుచేసుకుంటున్న ఘర్షణలను నివారించి శాంతిభద్రతల పరిస్ధితిని తిరిగి గాడిలో పెట్టేందుకు బెంగాల్ గవర్నర్ హోదాలో త్రిపాఠి అఖిలపక్ష భేటీకి చొరవ తీసుకున్నారని అధికార వర్గాలు పేర్కొన్నాయి. కాగా ఈ సమావేశానికి హాజరయ్యేందుకు అంగీకరించిన తృణమూల్ కాంగ్రెస్ తమ ప్రతినిధిగా పార్ధో ఛటర్జీని పంపుతోంది. ఇక బీజేపీ నుంచి దిలీప్ ఘోష్, సీపీఎం నుంచి ఎస్‌కే మిశ్రా, కాంగ్రెస్ తరపున ఎస్‌ఎన్ మిత్రా అఖిలపక్ష భేటీకి హాజరుకానున్నారు.
Comments
Please login to add a commentAdd a comment