ప్రతీకాత్మక చిత్రం
కోల్‌కతా : చిరుతపులితో తలపడి తన ప్రాణాలను రక్షించుకోవటమే కాకుండా పలువురికి ఆదర్శంగా నిలిచిందో మహిళ. ఈ సంఘటన నార్త్ బెంగాల్‌లోని అలిపురుద్వార్ జిల్లాలో శుక్రవారం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. శుక్రవారం ఉదయం అనితా నగషియా అనే మహిళ అలిపురుద్వార్.. కల్‌చిని పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న రాజభట్ టీ తోటలో పనిచేసుకుంటోంది. అదే సమయంలో అనిత వెనకాల నక్కి ఉన్న ఓ చిరుత పులి ఆమెపైకి దూకింది. ఈ హఠాత్పరిణామానికి మొదట భయపడ్డా.. ఆ వెంటనే ధైర్యంగా చిరుతపై తిరగబడింది. ఒట్టి చేతుల్తో దాని ముఖంపై పిడిగుద్దులు గుద్దటం ప్రారంభించింది.
దాదాపు ఐదు నిమిషాల పాటు చిరుతకు, మహిళ మధ్య పోరాటం జరిగింది. మొదట్లో చిరుత ఆమె దాడికి స్పందించకపోయినా, చివరకు దెబ్బలు తాళలేక తోక ముడిచింది. అక్కడినుంచి పరుగులు పెట్టింది. అనంతరం తీవ్ర గాయాలపాలైన అనితను తోటి పనివాళ్లు దగ్గరలోని ఆసుపత్రికి తరలించారు. కాగా, టీ తోటలలో చిరుతపులుల దాడులు మామూలైపోయాయి. నిత్యం ఎక్కడో ఓ చోట ఎవరో ఒకరు చిరుతల బారిన పడుతూనే ఉన్నారు. గత డిసెంబర్‌లోనూ టీ తోటలో పనిచేసుకుంటున్న ఓ 17ఏళ్ల యువతిపై చిరుతపులి దాడి చేసి తీవ్రంగా గాయపర్చిన సంగతి తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment