ఐటీ రాజధాని కాదు.. మాంత్రికుల రాజధాని
బెంగుళూరు: కర్ణాటక రాజధాని బెంగుళూరు వాసులను తాంత్రికశక్తులు నడిపిస్తున్నాయి. నగరంలో 33 ఏళ్ల మహిళ అరెస్టు ఈ విషయాన్ని వెలుగులోకి తెచ్చింది. గౌరిపలయా ప్రాంతానికి చెందిన ఓ మహిళా తాంత్రికురాలు కష్టాలు తీర్చాలని తనన ఆశ్రయించిన ఓ యువజంటకు బాలికను బలి ఇవ్వాలని చెప్పింది. ఆ తర్వాత ఆమె శరీరంతో ప్రత్యేకపూజలు నిర్వహించాలని తెలిపింది. దీంతో మొత్తం ఐదుగురు సంతానం కలిగిన ఆ జంట.. తమ పదేళ్ల బాలికను మంత్రగత్తె వద్దకు తీసుకెళ్లింది.
బలికి ప్రత్యేక పూజలు నిర్వహించిన ఆమె క్షుద్రపూజల పేరిట బాలికను చంపింది. ఆ తర్వాత మరికొన్ని క్లిష్టమైన ప్రక్రియలను పూర్తి చేసి ఆ జంటను అక్కడి నుంచి పంపేసింది. ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు మంత్రగత్తెను అదుపులోకి తీసుకుని విచారించగా సంచలన నిజాలు బయటకు వచ్చాయి. రాజధాని అంతటా చేతబడి తదితర మాంత్రిక పూజలు కొనసాగుతున్నట్లు ఆమె చెప్పింది. ప్రేమికులు, కార్పొరేట్ ఉద్యోగులు, కార్ రేస్ డ్రైవర్లు, ఆర్థికంగా నలిగిపోతున్న కుటుంబాలు ఇలా బాగా చదువుకున్నవారే తమ కష్టాలను తీర్చాలంటూ తాంత్రికశక్తులను ఆశ్రయిస్తున్నట్లు వెల్లడించింది.
మహిళ వెల్లడించిన సమాచారంతో షాక్‌కు గురైన పోలీసులు.. ఇలాంటి ఘటనలు ఇంకా జరిగాయా? అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. మాంత్రికులను కలిసేందుకు సోషల్‌మీడియా తదితర ప్రత్యేక పోర్టల్స్ ద్వారా బెంగుళూరియన్లు అపాయింట్‌మెంట్లను తీసుకుంటున్నట్లు.. వ్యక్తి సమస్యను బట్టి రూ. 500ల నుంచి రూ. లక్షలోపు వసూలు చేస్తున్నట్లు తెలిసింది. ఎక్కువ మంది ప్రజలు 'వశీకరణ క్రియ' పూజను నిర్వహించాలని కోరుతున్నారని పేరు చెప్పడానికి ఇష్టపడని ఓ మాంత్రికుడు తెలిపారు. వశీకరణ క్రియ అంటే ఒక వ్యక్తిని మరొక వ్యక్తి తన అవసరానికి అనుగుణంగా పనిచేయించడమని వివరించారు.
40 ఏళ్లుగా తాను బ్లాక్ మ్యాజిక్ చేస్తున్నట్లు తెలిపారు. సాధారణంగా ఇలాంటి పూజలు నిర్వహించడానికి వ్యక్తి పుట్టిన తేదీ, ఫోటో, సమస్య గురించిన వివరాలు అవసరమవుతాయని చెప్పారు. తన వద్దకు వచ్చిన వారిలో ఎక్కువ మంది అవతలి వ్యక్తిని చంపడానికి ఏదైనా చేయమని అడిగారని తెలిపారు. బెంగుళూరులోని ఇందిరానగర్, రాజాజీనగర్ తదితర ప్రాంతాల్లో మాంత్రికులు ఎక్కువగా ఉన్నట్లు వెల్లడించారు.