
సాక్షి, బెంగళూరు: ఐటీ నగరం బెంగళూరులో మంగళవారం రాత్రి నుంచి బుధవారం ఉదయం వరకు కుండపోతగా కురిసిన వర్షం బీభత్సం సృష్టించింది. పలు లేఔట్లు నీటమునిగాయి. వందల ఇళ్లు, అపార్టుమెంట్ల సెల్లార్లలోకి వర్షపు నీరు ప్రవేశించింది. బెంగళూరు రూరల్ మాదనాయకనహళ్లిలో ఇంటి గోడ కూలి ఒక వ్యక్తి, కేఆర్ పురంలో ఇంట్లోకి నీళ్లు వచ్చి యూపీఎస్ షాక్ కొట్టడంతో ఒక మహిళ మరణించారు. చంద్ర లేఔట్లో ప్రహరీ కూలి ఐదు కార్లు పూర్తిగా ధ్వంసమయ్యాయి. అనేక చోట్ల వాన నీరు దిగ్బంధించడంతో ప్రజలు ఎక్కడికక్కడే చిక్కుకుపోయారు.
బెంగళూరులో మంగళవారం రాత్రి 11 గంటలకు ప్రారంభమైన వర్షం బుధవారం ఉదయం 5 గంటల వరకు ఏకదాటిగా కురిసింది. కోరమంగల, హెచ్‌ఎస్‌ఆర్.లేఔట్, జేపీ.నగర ఆరవపేజ్, కృష్ణరాజపురం తదితర ప్రాంతాల్లో వర్షంనీరు రోడ్లుపై నిలిచిపోవడంతో చెరువులను తలిపించాయి. ఆడుగోడిరోడ్డు, ఆర్మీస్కూల్ కంపౌండ్‌గోడ పై చెట్టుకూలింది. జేపీ.నగర ఐదవబ్లాక్ ఉన్న శోబా డిప్లోర్ అపార్టుమెంట్ గోడ కూలి రెండు ఇళ్ల మీద పడటంతో ఇంట్లో ఉన్న నలుగురు వ్యక్తులు బయటికి రాలేక బుధవారం ఉదయం వరకు నరకయాతన పడ్డారు. సమాచారం అందిన వెంటనే పాలికె సిబ్బంది జేసీబీ యంత్రంతో అక్కడికి చేరుకుని శిథిలాలను తొలగించి వారిని కాపాడారు. ఇంకా వర్షాలు పడే అవకాశముందని వాతావరణ శాఖ వెల్లడించడంతో బెంగళూరు వాసులు బిక్కుబిక్కుమంటున్నారు.
శాంతినగర బస్‌డిపో ముంపు
జయనగర నేషనల్ కాలేజీ ప్రహరీగోడ పై చెట్టుకూలడంతో ప్రహరీగోడ కూలిపోయింది. శాంతినగర బస్‌డిపోలో మళ్లీ వర్షం నీరు చొరబడింది. గత నెలలో కురిసిన భారీ వర్షంతో డిపోలో నీరుచేరిన సందర్బంలో మంత్రి జార్జ్ సందర్శించి శాశ్వతపరిష్కారం కల్పిస్తామని హామీనిచ్చారు. కానీ మంగళవారం రాత్రి కురిసిన భారీ వర్షానికి డిపోలో రెండు అడుగుల మేర నీరు నిలిచిపోవడంతో బీఎంటీసీ సిబ్బంది తీవ్ర ఇబ్బంది ఎదుర్కొన్నారు. గిరినగర తగ్గుప్రాంతాల్లో ఇళ్లులోకి నీరుచేరడంతో ఆ ప్రాంత వాసులు రాత్రంతా జాగరణ చేశారు. హలసూరు, రాజరాజేశ్వరినగర, ఆవలహళ్లి, యశవంతపుర, హెబ్బాళ,బనశంకరి, మల్లేశ్వరం, అత్తిగుప్పె ప్రాంతాల్లో లోతట్టు ప్రాంతాల్లో ఇళ్లలోకి నీరు చేరి జనం ఆందోళనకు గురయ్యారు. దొడ్డబిదరకల్లు చెరువుకట్ట తెగిపోవడంతో అన్నపూర్ణేశ్వరి నగర లేఔట్, ఆందానప్పలేఔట్ నీట మునిగాయి. కాగా, ఆర్‌కేపురం తదితర పలు ప్రాంతాల్లో ఎన్డీఆర్‌ఎఫ్ బృందాలు వచ్చి వరద బాధితులను పడవల్లో సురక్షిత ప్రాంతాలకు తరలించారు.
సీఎం, జార్జ్ ఏం చేస్తున్నారు?
వర్షాలతో నగర ప్రజలు అల్లాడిపోతుంటే సీఎం సిద్దరామయ్య, నగరాభివృద్ది శాఖామంత్రి జార్జ్ ఏం చేస్తున్నారని కాంగ్రెస్ నేత సీఎం ఇబ్రహీం సహోదరి సీఎం జమీనా ప్రశ్నించారు. ఆమె ఇంట్లోకి వాననీరు చేరి రాత్రంతా జాగరణ చేశారు. ఇంట్లోని వస్తువులు నీటిలో మునిగాయి. రాత్రంతా జాగరణతో కోపోద్రిక్తురాలైన జమీనా ముఖ్యమంత్రి సిద్దరామయ్య, మంత్రి జార్జ్ ఏమిచేస్తున్నారంటూ మండిపడ్డారు. ప్రజలను పట్టించుకునే నాథుడేలేరని ధ్వజమెత్తారు.
మేయర్, మంత్రుల పరిశీలన
భారీ వర్షంతో దెబ్బతిన్న ప్రాంతాల్లో మేయర్ పద్మావతి, మంత్రులు కేజే.జార్జ్, ఎం.కృష్ణప్ప పర్యటించారు. చంద్రాలేఔట్‌లో గోడకూలి కారు, ఆటోలు దెబ్బతిన్న ప్రాంతాలను సందర్శించారు.




